Family star: మా కుటుంబానికి నాన్నే ఫ్యామిలీ స్టార్‌

‘‘మనకు ఏ కష్టం వచ్చినా అండగా నిలిచి నేనున్నానని ధైర్యం చెప్పే వ్యక్తి కుటుంబంలో ఒకరుంటారు. ఆ ఒక్కరే ఫ్యామిలీ స్టార్‌. మా కుటుంబంలో మా నాన్న ఫ్యామిలీ స్టార్‌’’ అన్నారు హీరో విజయ్‌ దేవరకొండ

Updated : 02 Apr 2024 09:38 IST

‘‘మనకు ఏ కష్టం వచ్చినా అండగా నిలిచి నేనున్నానని ధైర్యం చెప్పే వ్యక్తి కుటుంబంలో ఒకరుంటారు. ఆ ఒక్కరే ఫ్యామిలీ స్టార్‌. మా కుటుంబంలో మా నాన్న ఫ్యామిలీ స్టార్‌’’ అన్నారు హీరో విజయ్‌ దేవరకొండ. ఆయన.. మృణాల్‌ ఠాకూర్‌ జంటగా పరశురామ్‌ తెరకెక్కించిన సినిమా ‘ఫ్యామిలీస్టార్‌’. దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 5న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హీరో విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ.. ‘‘దర్శకుడు పరశురామ్‌ ఈ కథ చెప్పినప్పుడు ఆయన జీవితంలోని అనుభవాలను ఊహించుకుంటూ చెప్పాడు. కథ వింటున్నప్పుడు మాత్రం నాకు మా నాన్న గుర్తొచ్చారు. కుటుంబం కోసం ఆయన పడిన తపన గుర్తొచ్చింది. అందుకే ఈ చిత్రంలో హీరో పాత్రకు గోవర్ధన్‌ అనే పేరు పెట్టమని చెప్పాను. ఎందుకంటే ఆ పేరు పెట్టుకున్న తర్వాత భావోద్వేగాలు పలికించడం సులువవుతుంది. ఈ నెల 5న ఈ చిత్రం విడుదలవుతోంది. 8న మా నాన్న పుట్టినరోజు. ఈ సినిమా విషయంలో ఆయన గర్వపడతారని ఆశిస్తున్నా. ‘గీత గోవిందం’కు ఈ సినిమాకి ఏమాత్రం పోలిక ఉండదు. ఆ చిత్రంతో పోలిస్తే నటుడిగా నేను.. దర్శకుడిగా పరశురామ్‌ ఎంత పరిణతి సాధించామో చూస్తారు. ఈ సినిమాకి నాకు పేరొస్తే ఆ క్రెడిట్‌ పరశురామ్‌కు ఇస్తా’’ అన్నారు. ‘‘మనల్ని ప్రోత్సహించి ముందుకు నడిపించే వారు కుటుంబంలో ఒకరుంటారు. అలాంటి వారిని గుర్తు చేసుకునే ప్రయత్నమే ఈ చిత్రం’’ అంది నటి మృణాల్‌. నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రానికి విజయ్‌ క్యారెక్టరైజేషన్‌ వెన్నుముక లాంటిది. విజయ్‌ హీరోగా మా సంస్థలో ఓ భారీ పాన్‌ ఇండియా సినిమా చేయనున్నాం. దాని స్క్రిప్ట్‌ సిద్ధమైంది. ప్రీ ప్రొడక్షన్‌ పనులకు మరింత సమయం పట్టనుంది. అది పూర్తయ్యాక సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది’’ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని