Vijay: 10 వేల పదాలతో విజయ్‌పై కవిత.. అవార్డు దక్కించుకున్న అభిమాని

తమిళ స్టార్‌ హీరో విజయ్‌పై ఓ అభిమాని వినూత్న రీతిలో తన అభిమానాన్ని చాటుకున్నారు. 

Updated : 22 Apr 2024 23:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌కు (Vijay) తమిళనాడుతో పాటు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆయన నటించిన ‘గిల్లీ’ చిత్రం తాజాగా రీరిలీజై మంచి వసూళ్లు చేస్తోంది. ఈ సందర్భంగా విజయ్ అభిమాని ఒకరు వినూత్న రీతిలో అభిమానాన్ని చాటుకున్నారు. తిరుప్పతూర్‌ సమీపంలో నివసించే కదిరవేల్‌ తన అభిమాన హీరోకు ఊహించని బహుమతి ఇచ్చారు. విజయ్‌ గురించి ఏకంగా 10వేల పదాలతో ఒక కవిత రాశారు. దీని కోసం మొత్తం 36 గంటలు కష్టపడినట్లు తెలిపారు. అంతేకాదు ఈ కవితతో ఆయన్ను పలు రికార్డులు వరించడం విశేషం. ఏప్రిల్ 16 ఉదయం 11 గంటలకు రాయడం మొదలు పెట్టిన ఆయన ఏప్రిల్‌ 17 రాత్రి 11 గంటలకు ముగించారు. దీంతో యూనివర్సల్‌ అచీవర్‌ బుక్‌ ఆఫ్ రికార్డ్స్‌, ఫ్యూచర్‌ కలామ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. 

ఒక్క రోజులోనే రూ.10 కోట్లు వసూళ్లు చేసి సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది ‘గిల్లీ’. మరో రెండు రోజులు ఇది థియేటర్లలో ప్రదర్శితం కానుంది. తెలుగులో మహేశ్‌ బాబు- భూమిక ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఒక్కడు’కు రీమేక్‌ ఈ ‘గిల్లీ’. ఇది తమిళనాట విడుదలై 20 ఏళ్ల పూర్తి చేసుకున్న సందర్భంగా రీరిలీజ్‌ చేశారు. ప్రస్తుతం విజయ్‌ ‘గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’తో బిజీగా ఉన్నారు. వెంకట్‌ ప్రభు తెరకెక్కిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయిక. ప్రస్తుతం చిత్రీకరణ ముగింపు దశలో ఉంది. ఇందులో రెండు కోణాలున్న పాత్రలో కనిపించనున్నారు విజయ్‌. ప్రభుదేవా, స్నేహ, లైలా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సెప్టెంబరు 5న ఈ చిత్రం విడుదల కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని