Ramoji Rao: చైతన్య కిరణాలు... రామోజీ సినిమాలు

చిత్రసీమపై నిర్మాతగా రామోజీరావు వేసిన ముద్ర ఎంతో ప్రత్యేకం. అయితే ఆయనలో నిర్మాతే కాక మంచి నటుడు కూడా ఉన్న సంగతి కొద్ది మందికే తెలుసు.

Updated : 10 Jun 2024 13:31 IST

స్ఫూర్తిని పంచే కథలతో... విలువలతో కూడిన వినోదంతో ప్రేక్షకుల్ని అలరించాయి రామోజీ రావు నిర్మించిన చిత్రాలు. తారలకంటే కూడా కథ, కథనాలకే పెద్ద పీట వేస్తూ ఆయన సినిమాలు నిర్మించారు. కొత్త ప్రతిభకు పట్టం కడుతూ ఎంతో మందిని వెలుగులోకి తీసుకొచ్చారు. ఆయన సినిమాలతో పరిచయమై...ఉన్నతస్థాయికి చేరిన నటులు... గాయకులు... ఇతర సాంకేతిక నిపుణులు ఎంతోమంది. తాను అడుగు పెట్టిన రంగంలో అత్యున్నత శిఖరానికి చేరుకునేవరకూ విశ్రమించని ఆయన నైజమే... ‘సితార’ సినీ వారపత్రిక స్థాపన మొదలు ఉషాకిరణ్‌ మూవీస్, మయూరి ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూటర్స్, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామోజీ ఫిల్మ్‌సిటీ నిర్మాణం వరకూ తీసుకెళ్లింది.

నలభయ్యేళ్ల కిందట ప్రారంభమైన ఉషాకిరణ్‌ మూవీస్‌ 87 చిత్రాల్ని నిర్మించింది. ఈ సంస్థకి బీజం పడటానికి కారణం రామోజీరావుకు స్వతహాగా సినిమాపై ఉన్న అభిరుచే. సినీ ప్రేమికుల్ని దృష్టిలో ఉంచుకుని మొదట ఈనాడుకు అనుబంధంగా సితార వార పత్రికని ప్రారంభించారు. రంగుల లోకంలోని సమగ్ర విశేషాల్ని మోసుకుంటూ 1976 అక్టోబరులో సితార పాఠకుల ముంగిటకు వచ్చింది. అనతికాలంలో తెలుగు పాఠకులకు చేరువైంది. 198081, 198182, 198283 వత్సరాల్లో సితార అవార్డుల వేడుకను నిర్వహించారు. విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాదుల్లో నిర్వహించిన ఈ పురస్కార కార్యక్రమాలను ఆ తరం నటులు, సాంకేతిక నిపుణులూ ఇప్పటికీ గుర్తు చేసుకొంటూ ఉంటారు. సినిమాలపై అభిమానంతో పాఠకులకు ప్రత్యేకంగా సినిమా వార్తలు అందించాలని తొలిసారి ఈనాడు నపత్రికలో ‘ఈనాడు సినిమా’ పేరుతో ఓ ప్రత్యేక పేజీని ప్రారంభించారు రామోజీ రావు. కేవలం వార్తలు, కథనాలను అందించేందుకే పరిమితం కాకుండా విలువలున్న చిత్రాల్ని ప్రోత్సహించే దిశగానూ రామోజీరావు అడుగులు వేశారు. సమాజ హితమైన, ఆహ్లాదం, ఆరోగ్యకరమైన చిత్రాల్ని ప్రేక్షకులకు అందించడమే లక్ష్యంగా ఉషాకిరణ్‌ మూవీస్‌ నిర్మాణ సంస్థని ప్రారంభించారు. తారాబలం ఉన్న చిత్రాలు కాకుండా... కథాబలం ఉన్న సినిమాల్ని అందించాలనే సంకల్పంతో ఈనాడు అనుబంధ పత్రికైన ‘చతుర’లో ప్రచురితమైన ‘ప్రేమలేఖ’ నవలను చిత్రంగా మలచాలని పూనుకున్నారు. హాస్యరసంతో ఉన్న కథకు న్యాయం చేసే దర్శకుడు జంధ్యాలకు బాధ్యతలు అప్పగించారు. ఆ సినిమానే  ‘శ్రీవారికి ప్రేమలేఖ’. తెలుగు చిత్రసీమలో అప్పుడే ఎదిగే ప్రయత్నం చేస్తున్న నరేశ్, పూర్ణిమ లాంటి నటుల్ని దీని కోసం ఎంపిక చేసుకొన్నారు. పకడ్బందీ ప్రణాళికతో  నిర్మితమైన ఈ చిత్రం 1984 మార్చిలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఉషాకిరణ్‌ మూవీస్‌ తొలి ప్రయత్నమే ప్రేక్షకుల మెప్పు పొందింది. అలా తొలి అడుగుల్లోనే ఉషాకిరణ్‌ మూవీస్‌ నిర్మాణ సంస్థగా తనదైన ముద్ర వేసింది.

కొత్తతరం అభిరుచులకు తగ్గట్టుగా...  

ప్రేక్షకుల అభిరుచులు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. తరాలు మారుతున్నకొద్దీ ప్రేక్షకుడి సినీ వీక్షణలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటాయి. అందుకు తగ్గట్టుగా మార్పు చెందకపోతే మనుగడ కష్టం. ముందుచూపుతో ఆలోచించే రామోజీరావు మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగానే సినీ నిర్మాణాన్ని కొనసాగించారు. ‘చిత్రం’, ‘నువ్వే కావాలి’, ‘ఆనందం’, ’నచ్చావులే’, ‘బెట్టింగ్‌ బంగార్రాజు’, ‘నువ్విలా’ తదితర సినిమాలే అందుకు తార్కాణం. నవతరం ప్రేక్షకుడి ఆలోచనలకి తగ్గట్టుగా సున్నితమైన వినోదంతో రూపుదిద్దుకున్న సినిమాలివి. పరిమిత వ్యయంతో రూపొందిన  ‘చిత్రం’, ‘నువ్వేకావాలి’ తదితర చిత్రాలు నిర్మాణంలో సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టాయి. కె.విజయభాస్కర్‌ దర్శకత్వం వహించిన ‘నువ్వే కావాలి’ హిందీలో ‘తుఝే మేరీ కసమ్‌’గా రీమేక్‌ అయ్యింది. ‘ప్రతిఘటన’... ‘ప్రతిఘాత్‌’గా హిందీ ప్రేక్షకుల్ని అలరించింది. ‘దాగుడుమూత దండా కోర్‌’ ఉషాకిరణ్‌ మూవీస్‌ నిర్మించిన చివరి చిత్రం. హిందీతోపాటు, కన్నడ, తమిళ, మరాఠీ, ఆంగ్ల భాషల్లోనూ సినిమాలు నిర్మించారు రామోజీరావు.

సినీ వ్యాపారంలో కచ్చితత్వం

చిత్ర నిర్మాణ సంస్థతోపాటే... పంపిణీ విభాగాన్నీ ఏర్పాటు చేశారు రామోజీరావు. మయూరి ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్‌పై వందల సినిమాల్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సినీవ్యాపార నిర్వహణలో కచ్చితత్వాన్ని పాటించడంతో పలు నిర్మాణ సంస్థలు మయూరిసంస్థ ద్వారా తమ సినిమాల్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఆసక్తి ప్రదర్శించేవి. ఆడియో రంగంలోనూ మయూరి తనదైన ముద్ర వేసింది. 

ప్రపంచ చిత్ర రంగానికే మణిమకుటం రామోజీ ఫిల్మ్‌సిటీ

నిర్మాతగా, పంపిణీదారుడిగా సినీ రంగంలో సుదీర్ఘకాలం పాటు ప్రయాణం చేసిన రామోజీ ఎవరూ ఊహించనంత పెద్ద కలని కన్నారు. అదే రామోజీ ఫిల్మ్‌సిటీ. ఒక మనిషి ఇలాంటి నిర్మాణం చేయడం అసాధ్యం అనిపించే ఆ కలని తన సంకల్ప బలంతో సాకారం చేశారు. ఏకకాలంలో పదుల సంఖ్యలో సినిమాల చిత్రీకరణ, నిర్మాణానంతర కార్యక్రమాలు చేసుకునేలా ఈ స్టూడియో నిర్మితమైంది. ఎలాంటి జానర్‌ సినిమా చిత్రీకరణకు సంబంధించిన వనరులైనా ఇక్కడ అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దారు. స్క్రిప్టుతో అడుగుపెడితే సినిమా ప్రింట్‌తో బయటికెళ్లేలా సకల సదుపాయాలతో తీర్చిదిద్దిన ఈ స్టూడియో గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డుల్లో చోటు సంపాదించింది. షూటింగులకే కాకుండా ప్రముఖ అంతర్జాతీయ పర్యటక కేంద్రంగా కూడా ఫిల్మ్‌సిటీని తీర్చిదిద్దారు. కేవలం తెలుగు సినిమాలే కాదు జాతీయ, అంతర్జాతీయ సినిమాలు కూడా ఇక్కడ చిత్రీకరణ చేసుకుంటాయి. సినిమాపై రామోజీ రావుకు ఉన్న అమితమైన ప్రేమకి దర్పణమే ఇదంతా. పరిశ్రమ తీరుతెన్నుల్ని గమనిస్తూ నిర్మాణం చేస్తూ వచ్చిన రామోజీరావు కెరీర్‌లో వంద సినిమాల మైలురాయి దిశగా అడుగులు వేస్తున్న క్రమంలోనే దూరమయ్యారు. 

పురస్కారాలెన్నో...

ఉషాకిరణ్‌ మూవీస్‌ సినిమాలకు జాతీయ, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు, ప్రైవేట్‌ సంస్థల నుంచి పలు పురస్కారాలు లభించాయి. నువ్వే కావాలి సినిమాకి ఉత్తమ ప్రాంతీయచిత్రం విభాగంలో జాతీయ పురస్కారం లభించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మయూరి చిత్రానికి ఉత్తమ చిత్రం, ద్వితీయ ఉత్తమ కథా రచన (ఉషాకిరణ్‌ మూవీస్‌ యూనిట్) విభాగాల్లో నంది పురస్కారాలు లభించాయి. ఉత్తమ చిత్రాలు, ఉత్తమ బాలల చిత్రం విభాగాల్లో మౌనపోరాటం, అశ్విని, తేజ చిత్రాలకు నందులు లభించాయి. ప్రతిఘటన, కాంచన గంగ చిత్రాలకి ఉత్తమ చిత్రం విభాగంలో ఫిల్మ్‌ఫేర్‌ పురస్కారాలు లభించాయి.


వెండితెరపై అతిథిలా మెరిసి 

చిత్రసీమపై నిర్మాతగా రామోజీరావు వేసిన ముద్ర ఎంతో ప్రత్యేకం. అయితే ఆయనలో నిర్మాతే కాక మంచి నటుడు కూడా ఉన్న సంగతి కొద్ది మందికే తెలుసు. ఓ సందర్భంలో ఆ నటనా ప్రతిభను వెండితెరకు పరిచయం చేశారు. యు.విశ్వేశ్వరరావు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘మార్పు’ (1978) చిత్రంలో రామోజీ న్యాయమూర్తి పాత్రలో తళుక్కున మెరిశారు. నిజానికి అందులో ఆయనది అతిథి పాత్రే అయినా సినిమా పోస్టర్లపై తన బొమ్మ ప్రచురించి అభిమానం చాటుకుంది చిత్ర బృందం. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ కూడా అతిథి పాత్రలో సందడి చేయడం మరో విశేషం.


తారలెందరో పరిచయం

బాలనటుడిగా బాలరామాయణంతో పరిచయమైన ఎన్టీఆర్‌... ఉషాకిరణ్‌ మూవీస్‌ నిర్మించిన ‘నిన్ను చూడాలని’ సినిమాతోనే కథానాయకుడిగా పరిచయమయ్యారు. కల్యాణ్‌రామ్, శ్రీకాంత్, వినోద్‌ కుమార్, చరణ్‌రాజ్, యమున, ఉదయ్‌ కిరణ్, తరుణ్, రీమాసేన్, శ్రియ, జెనీలియా, రితేష్‌ దేశ్‌ముఖ్, రిచా పల్లోడ్, తనీష్, మాధవీలత... ఇలా ఎందరో నటులు చిత్రసీమకు పరిచయమయ్యారు. ఛాయాగ్రాహకుడిగా ఉన్న తేజ దర్శకుడైంది ఈ సంస్థ నుంచే. ఆయన ఈ సంస్థలో తీసిన ‘చిత్రం’తోనే 20 మందికి పైగా నటులు పరిచయం అయ్యారు. గాయనిగా ఉన్న ఎస్‌.జానకి సంగీత దర్శకురాలైంది కూడా ‘మౌనపోరాటం’ చిత్రంతోనే. ఎమ్‌.ఎమ్‌ కీరవాణి కూడా రామోజీ రావు నిర్మించిన ‘మనసు మమత’ చిత్రంతోనే సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్‌ గెలుచుకున్న తర్వాత ఓ ఇంటర్వ్యూలో కీరవాణి మాట్లాడుతూ ‘‘ఆస్కార్, పద్మశ్రీ ఏదైనా సరే నాపై పాజిటివ్‌గా కానీ, నెగిటివ్‌గా గానీ ఏ ప్రభావం చూపించలేదు. వాస్తవానికి ఆస్కార్‌ వస్తే బాగుండన్న ఆలోచనలు నాకెప్పుడూ లేవు. ఎందుకంటే నేను ఏ అవార్డుల్ని గౌరవించను. అలాంటి పరిస్థితుల్లో ‘మీరు ఆస్కార్‌ తీసుకురండ’ని రామోజీరావు అన్నారు. ఆయన లాంటి వ్యక్తి ఆస్కార్‌కు గౌరవమిస్తున్నారంటే దానికో విలువ ఉందనిపించి.. త్రికరణ శుద్ధిగా దాన్ని సాధించేందుకు ఏం చేయాలో అది చేసి సాధించుకొచ్చాం’’అని చెప్పారు. మల్లిఖార్జున్, ఉష, గోపికా పూర్ణిమ లాంటి గాయనీగాయకులను శ్రోతలకు పరిచయం చేసింది కూడా ఉషాకిరణ్‌ మూవీస్‌ సంస్థే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని