Gaami OTT Release: ఓటీటీలోకి విశ్వక్‌సేన్‌ ‘గామి’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..?

విశ్వక్‌సేన్‌ (Vishwak Sen) హీరోగా నటించిన సరికొత్త చిత్రం ‘గామి’ (Gaami). తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ విడుదలైంది.

Updated : 03 Apr 2024 15:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: విశ్వక్‌సేన్‌ (Vishwak Sen) హీరోగా నటించిన ఎపిక్‌ అడ్వంచర్‌ థ్రిల్లర్‌ ‘గామి’ (Gaami). విద్యాధర్‌ కాగిత దర్శకుడు. చాందినీ చౌదరి, అభినయ కీలక పాత్రలు పోషించారు. మార్చి 8న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద విజయాన్ని అందుకుంది. అఘోరా పాత్రలో విశ్వక్‌ నటనను సినీప్రియులు మెచ్చుకున్నారు. ఇప్పుడీ చిత్రం ఓటీటీ విడుదలకు రంగం సిద్ధమైంది. జీ5 ఓటీటీ వేదికగా ఏప్రిల్‌ 12 నుంచి ఇది ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడలోనూ ఇది ప్రసారం కానుంది. ఈవిషయాన్ని తెలియజేస్తూ జీ5 తాజాగా ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టింది.

కథేంటంటే: శంకర్‌ (విశ్వక్‌ సేన్‌) ఓ అఘోరా. తనెవరు.. గతమేంటి.. ఎక్కడినుంచి వచ్చాడు.. ఈ జ్ఞాపకాలేం అతడికి గుర్తుండవు. పైగా మానవ స్పర్శను తట్టుకోలేని ఓ అరుదైన వ్యాధితో బాధ పడుతుంటాడు. దీంతో తోటి అఘోరాలంతా అతనిని శాపగ్రస్థుడుగా భావించి.. ఆశ్రమం నుంచి వెలివేస్తారు. ఈక్రమంలో తనని తాను తెలుసుకునేందుకు అన్వేషణ మొదలుపెడతాడు. తన సమస్యకు పరిష్కారం హిమాలయాల్లోని ద్రోణగిరి పర్వత శ్రేణుల్లో 36 ఏళ్లకు ఒకసారి వికసించే మాలిపత్రాల్లో ఉందని ఓ స్వామీజీ ద్వారా తెలుసుకుంటాడు. అక్కడికి చేరుకోవాలంటే.. ఎన్నో ప్రమాదాలను దాటుకుని వెళ్లాలి. వాటన్నింటినీ లెక్క చేయకుండా డాక్టర్‌ జాహ్నవి (చాందిని చౌదరి)తో కలిసి అక్కడికి బయలుదేరుతాడు శంకర్‌. ఆ తర్వాత ఏమైంది? మాలిపత్రాలు సాధించే క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లేంటి? దేవదాసి దుర్గ (అభినయ) కూతురు ఉమ (హారిక), సీటీ333 (మహమ్మద్‌)ల జ్ఞాపకాలు.. అతడిని ఎందుకు వెంటాడుతుంటాయి? వాళ్లతో అతనికి ఉన్న సంబంధం ఏంటి? తదితర ఆసక్తికర అంశాలతో ఇది సిద్ధమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని