Tollywood: విభిన్న పాత్రలు.. వైవిధ్య కథలు

కొత్త కథ చెప్పాలి.. సరికొత్తగా కనిపించాలి.. వైవిధ్యభరితమైన పాత్రలతో మెప్పించాలి.. ఇలా కథానాయకుల ఆలోచనలన్నీ ఇప్పుడు కొత్తదనం చుట్టూనే తిరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రేక్షక లోకం కోరుకుంటోంది

Published : 28 Feb 2022 04:47 IST

తొలిసారి ఇలా..

కొత్త కథ చెప్పాలి.. సరికొత్తగా కనిపించాలి.. వైవిధ్యభరితమైన పాత్రలతో మెప్పించాలి.. ఇలా కథానాయకుల ఆలోచనలన్నీ ఇప్పుడు కొత్తదనం చుట్టూనే తిరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రేక్షక లోకం కోరుకుంటోంది అదే. చెయ్యి ఎత్తి జై కొడుతోంది ఆ కొత్తదనానికే. సినీప్రియుల అభిరుచుల్లో కనిపిస్తున్న ఈ మార్పుల్ని గమనించే.. మన హీరోలు నవ్యతను అందించేందుకు తపన పడుతున్నారు. ప్రతి సినిమాకీ వైవిధ్యం చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తమ కెరీర్‌లో మునుపెన్నడూ చేయని పాత్రలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

‘‘ఈ సినిమాలో నన్ను కొత్తగా చూస్తారు. మునుపెన్నడూ చూడని విభిన్నమైన పాత్రతో మెప్పిస్తా’.. - ఇప్పుడు ఏ హీరో నోట విన్నా ఇలాంటి మాటలే వినిపిస్తున్నాయి. ప్రేక్షక లోకం మొత్తం కొత్తదనం కావాలని కోడై కూస్తున్న తరుణంలో.. అందుకు తగ్గట్లుగా ఆ వైపే పరుగులు పెడుతోంది తారాలోకం. ‘బాహుబలి’, ‘సాహో’ సినిమాలతో జాతీయ స్థాయిలో క్రేజ్‌ సంపాదించుకున్నారు కథానాయకుడు ప్రభాస్‌. ప్రస్తుతం ఆయన ‘సలార్‌’, ‘ఆదిపురుష్‌’, ‘ప్రాజెక్ట్‌ కే’.. ఇలా వరుస సినిమాలతో సెట్స్‌పై బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇవన్నీ వేటికవే సరికొత్త జానర్లలో సాగే కథలే. ఇందులో ఆయన పోషిస్తున్న పాత్రలన్నీ మునుపెన్నడూ పోషించనివే. వీటితో పాటు ప్రస్తుతం ఆయన ఖాతాలో సందీప్‌ రెడ్డి వంగా ప్రాజెక్ట్‌ ఉన్న సంగతి తెలిసిందే. ‘స్పిరిట్‌’ పేరుతో రూపొందనున్న ఈ పాన్‌ ఇండియా సినిమా కోసం తొలిసారి ఖాకీ దుస్తుల ధరించి, లాఠీ ఝుళిపించనున్నారు ప్రభాస్‌. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత భూషణ్‌ కుమార్‌ ఆ మధ్య స్వయంగా వెల్లడించారు. మరి ఈ కథేంటి? ఇందులో పోలీస్‌గా డార్లింగ్‌ సందడి ఎలా ఉండనుంది? తెలియాలంటే ఇంకొన్నాళ్లు వేచి చూడక తప్పదు.

కెరీర్‌ ఆరంభంలో లవర్‌ బాయ్‌గా అలరించి.. ఆ తర్వాత మాస్‌ కథానాయకుడిగా పేరు తెచ్చుకున్నారు రవితేజ. ప్రస్తుతం వరుస చిత్రాలతో జోరు చూపిస్తున్న ఆయన.. ‘రావణాసుర’ కోసం  తొలిసారి నల్లకోటు ధరించి, వాదనలు   వినిపించేందుకు సిద్ధమయ్యారు. సుధీర్‌ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రమిది. అభిషేక్‌ నామా నిర్మిస్తున్నారు. విభిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోన్న ఈ సినిమా.. ఈ ఏడాది సెప్టెంబర్‌ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో హీరో సుశాంత్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.

‘రంగస్థలం’ నుంచి కథల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ వస్తున్నారు కథానాయకుడు రామ్‌చరణ్‌. ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోసం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజుగా, ‘ఆచార్య’ కోసం సిద్ధ అనే నక్సలైట్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇప్పుడాయన శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దిల్‌రాజు నిర్మిస్తున్న 50వ చిత్రమిది. రాజకీయాలు, ప్రభుత్వ వ్యవస్థలతో  ముడిపడిన ఆసక్తికర కథాంశంతో రూపొందుతోంది. ఇప్పుడీ సినిమా కోసం చరణ్‌ తొలిసారి ఐఏఎస్‌ ఆఫీసర్‌గా కొత్త అవతారమెత్తినట్లు సమాచారం. ఈ చిత్రం.. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

నాని తెలంగాణ యాస.. రామ్‌ పోలీస్‌ వేట 

కొత్తదనం నిండిన కథలతో ప్రయోగాలు చేయడంలో ముందుండే కథానాయకుడు నాని. ఇటీవలే ‘శ్యామ్‌ సింగరాయ్‌’లో బెంగాలీ బాబుగా అలరించిన ఆయన.. ఇప్పుడు ‘దసరా’తో మరో విభిన్నమైన పాత్రతో వినోదాలు పంచేందుకు సిద్ధమవుతున్నారు. కొత్త దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల తెరకెక్కిస్తున్న చిత్రమిది. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు.  గోదావరిఖనిలోని సింగరేణి కోల్‌ మైన్స్‌లో ఉన్న ఓ గ్రామం   నేపథ్యంలో జరిగే కథతో రూపొందుతోంది. ఇప్పుడీ కథకు తగ్గట్లుగానే తన పాత్ర కోసం తొలిసారి పక్కా తెలంగాణ యాసలో సంభాషణలు పలకనున్నారు నాని. ఇందులో ఆయన రింగులు తిరిగిన జుట్టు, గుబురు గడ్డంతో పూర్తి మాస్‌ అవతారంలో విభిన్నంగా కనిపించనున్నారు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.

ప్రేమ కథలకు, మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లకు చిరునామాగా నిలుస్తుంటారు రామ్‌ పోతినేని. ఇప్పుడాయన హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో ‘ది వారియర్‌’ అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోంది. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ముస్తాబవుతోన్న ఈ చిత్రం కోసం తొలిసారి ఖాకీ చొక్కా ధరించారు రామ్‌. ఆయనిందులో శక్తిమంతమైన పోలీస్‌ సత్తా చూపించనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. రామ్‌ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న చిత్రమిది. ఇందులో ఆయనకు జోడీగా కృతి శెట్టి నటిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు