Cinema News: సినీ విశేషాలు.. కొత్త సినిమా ముచ్చట్లు

తెలుగులో కుటుంబ కథా చిత్రాల హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు జగపతిబాబు. రెండో ఇన్నింగ్స్‌లో విలన్‌, తండ్రి పాత్రలు పోషిస్తూ మంచి పేరు తెచ్చుకోవడమే కాదు పలు భారీ విజయాల్ని తన ఖాతాలో వేసుకున్నారు.

Updated : 10 Dec 2022 07:09 IST

సల్మాన్‌ బావమరిదితో జగపతి బాబు

తెలుగులో కుటుంబ కథా చిత్రాల హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు జగపతిబాబు (Jagapathi Babu). రెండో ఇన్నింగ్స్‌లో విలన్‌, తండ్రి పాత్రలు పోషిస్తూ మంచి పేరు తెచ్చుకోవడమే కాదు పలు భారీ విజయాల్ని తన ఖాతాలో వేసుకున్నారు. తాజాగా ఆయన ఓ హిందీ చిత్రంలో నటిస్తున్నారు. సల్మాన్‌ఖాన్‌ బావమరిది ఆయుష్‌శర్మ (Aayush Sharma) నాలుగో చిత్రంలో ఆయన నటించనున్నారు. ఈ విషయాన్ని ఆయుష్‌శర్మ వెల్లడించారు. ‘‘భాషలతో సంబంధం లేకుండా నేను సినిమాలను అభిమానిస్తాను. నాకు జగపతిబాబు సార్‌ నటన గురించి తెలుసు. ఆయన పోషించిన పాత్రలంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఆయన నా నాలుగో చిత్రంలో నటించడం ఆనందంగా ఉంది’’ అని ఓ ప్రకటనలో తెలిపారు ఆయుష్‌. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాని కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్నారు. ఆయుష్‌శర్మ మూడో చిత్రం ‘అంతిమ్‌’లో సల్మాన్‌ఖాన్‌ కూడా సందడి చేసిన సంగతి తెలిసిందే.


ఏదీ జీవితం

‘‘చాలామంది ప్రేమించడమే జీవితం అనుకుంటారు. కానీ నమ్మించడమే జీవితం అంటాడు ఆ కుర్రాడు. చిన్నప్పట్నుంచి ఒకడినే ప్రేమిస్తూ అతనే రాముడు దేవుడు అని నమ్మి జీవితాన్ని అంకితం చేసింది ఆ అమ్మాయి. భిన్నమైన మనస్తత్వాలున్న ఈ ఇద్దరి ప్రేమకథ ఎక్కడిదాకా సాగింది? ఎక్కడ ముగిసిందో తెలియాలంటే ‘లవ్‌ యూ రామ్‌’ (Love You Ram) చూడాల్సిందే. రోహిత్‌ బెహల్‌, అపర్ణ జనార్ధనన్‌ జంటగా నటించిన చిత్రమిది. డి.వి.చౌదరి దర్శకత్వం వహించడంతోపాటు, కథని సమకూర్చిన ప్రముఖ దర్శకుడు కె.దశరథ్‌తో కలిసి నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ విడుదల కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. తెలంగాణ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ప్రముఖ దర్శకుడు హరీష్‌శంకర్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘‘దశరథ్‌ మంచి చిత్రాలు అందించిన దర్శకుడు. ఈ సినిమాతో నిర్మాతగా కూడా విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నా. రోహిత్‌ నటించిన ‘నాట్యం’ చూశా. అతను ఎంత మంచి డాన్సరో, అంత మంచి నటుడు. బృందం అంతటికీ ఈ చిత్రం మంచి విజయాన్ని అందిస్తుందని నమ్ముతున్నా’’ అన్నారు. దర్శకుడు హరీష్‌శంకర్‌ మాట్లాడుతూ ‘‘దశరథ్‌ స్టైల్‌లో ఎక్కడా బోర్‌ కొట్టకుండా సాగే చిత్రమిది. విజువల్స్‌ చాలా రిచ్‌గా ఉంటాయి. రోహిత్‌, అపర్ణ చాలా బాగా నటించారు. దశరథ్‌ ఇందులో ఇందులో ఓ మంచి పాత్ర చేశారు. ఆయన ఈ సినిమా తర్వాత నటుడిగాకూడా బిజీ అయిపోతారు. దర్శకుడు చౌదరికి సినిమానే ప్రాణం. కొన్ని సినిమాల్ని నిర్మించాలంటే దర్శకులే నిర్మాతలు కావాలి’’ అన్నారు. ప్రతిభావంతులైన పలువురు యువకులు ఈ చిత్రానికి పనిచేశారన్నారు దశరథ్‌. ఈ సినిమాకి హరీష్‌శంకర్‌ తన విలువైన సూచనలెన్నో ఇచ్చారన్నారు చిత్ర దర్శకుడు. ఈ కార్యక్రమంలో నాయకానాయికలతోపాటు, ఇతర చిత్రబృందం పాల్గొంది.


సంక్రాంతికి... ‘కళ్యాణం కమనీయం’

ముగ్గుల పండక్కి అగ్ర తారల చిత్రాలు ఎన్ని పోటీ పడినా సరే... వాటి మధ్య ఓ చిన్న సినిమా కూడా ఖాయంగా సందడి చేస్తుంటుంది. అలా ఈసారి కూడా ‘కళ్యాణం కమనీయం’ విడుదలవుతోంది. బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’, చిరంజీవి ‘వాల్తేర్‌ వీరయ్య’, విజయ్‌ ‘వారసుడు’, అజిత్‌ ‘తునివు’ తర్వాత సంక్రాంతికి విడుదల ఖాయమైన మరో చిత్రం ‘కళ్యాణం కమనీయం’ (Kalyanam Kamaneeyam). సంతోష్‌ శోభన్‌ (Santosh Sobhan) కథానాయకుడిగా నటించారు. ప్రియ భవానీ శంకర్‌ కథానాయిక. అనిల్‌ కుమార్‌ ఆళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. యు.వి.కాన్సెప్ట్‌ సంస్థ నిర్మిస్తోంది. పెళ్లి నేపథ్యంలో సాగే ఈ సినిమాని జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు శుక్రవారం  ప్రకటించాయి సినీ వర్గాలు. కథాబలమున్న చిత్రాల్ని నిర్మిస్తూ, యువ ప్రతిభావంతుల్ని ప్రోత్సహిస్తున్న యు.వి.కాన్సెప్ట్స్‌ నుంచి విడుదలవుతున్న మరో కుటుంబ కథా చిత్రమిదని నిర్మాణ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కార్తీక్‌ ఘట్టమనేని, కూర్పు: సత్య.జి, సంగీతం: శ్రావణ్‌ భరద్వాజ్‌, ప్రొడక్షన్‌ డిజైన్‌: రవీందర్‌.


ప్రేమలో శ్రీలీల

విరాట్‌, శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘ఐ లవ్‌ యు ఇడియట్‌’ (I Love You Idiot). కన్నడ చిత్రం ‘కిస్‌’కి అనువాద రూపమిది. ఎ.పి.అర్జున్‌ దర్శకత్వం వహించారు.  సాయికిరణ్‌ బత్తుల, సుదర్శన్‌ గౌడ్‌ బత్తుల, ఎ.పి.అర్జున్‌ నిర్మాతలు. బెక్కం వేణుగోపాల్‌, వసంత సమర్పణలో ఈ చిత్రాన్ని ఈ నెల 17న విడుదల చేస్తున్నట్టు సినీ వర్గాలు తెలిపాయి. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘మంచి కాన్సెప్ట్‌తో కూడిన చిత్రమిది. ప్రేమకథ కొత్తగా ఉంటుంది. శ్రీలీల అభినయం, ఆమె అందం ఆకట్టుకుంటుంది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కి మంచి స్పందన లభించింది. చిత్రం తప్పకుండా ప్రేక్షకుల మెప్పు పొందుతుంద’’న్నారు. ఈ సినిమాకి సంగీతం: వి.హరికృష్ణ.


రాజ్‌ కథ

రాజ్‌ కార్తికేన్‌ హీరోగా నటిస్తూ.. స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘రాజ్‌ కహాని’ (Raj Kahani). భాస్కర రాజు, ధార్మికన్‌ రాజు సంయుక్తంగా నిర్మించారు. చంద్రికా అవస్తి, సోనియా సాహా, ప్రియా పాల్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా తాజాగా సెన్సార్‌ పనులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హీరో, దర్శకుడు రాజ్‌ కార్తికేన్‌ మాట్లాడుతూ.. ‘‘అసలైన ప్రేమకు అర్థం చెప్పే మంచి కథతో రూపొందిన చిత్రమిది. అమ్మ ప్రేమను, అమ్మాయి ప్రేమను ముడిపెడుతూ ఆకట్టుకునేలా తెరకెక్కించాం’’ అన్నారు. ‘‘కుటుంబ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు చిత్ర నిర్మాతలు. ఈ సినిమాకి సంగీతం: మహిత్‌ నారాయణ్‌, ఛాయాగ్రహణం: యస్‌.యస్‌.వి.ప్రసాద్‌.


మనసు పేజీల్లో దోబూచులాట

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని