Tollywood: సెప్టెంబరులో 6 పాన్‌ ఇండియా సినిమాలు

తెలుగు చిత్రసీమలో నూతనోత్తేజాన్ని నింపింది ఈ నెల. ఆరంభంలో అగ్ర కథానాయకుడు రజనీకాంత్‌ ‘జైలర్‌’తో బాక్సాఫీస్‌ ముందు కాసుల వర్షం కురిపిస్తే..

Updated : 29 Aug 2023 07:11 IST

తెలుగు చిత్రసీమలో నూతనోత్తేజాన్ని నింపింది ఈ నెల. ఆరంభంలో అగ్ర కథానాయకుడు రజనీకాంత్‌ ‘జైలర్‌’తో బాక్సాఫీస్‌ ముందు కాసుల వర్షం కురిపిస్తే.. నెలాఖరున ‘బెదురులంక 2012’, ‘బాయ్స్‌ హాస్టల్‌’ లాంటి చిన్న చిత్రాలు మెరుపులు మెరిపించాయి. ఇప్పుడీ విజయోత్సాహంలోనే ఆగస్టుకు వీడ్కోలు పలుకుతూ సెప్టెంబరు పోరుకు సిద్ధమవుతోంది తెలుగు చిత్ర పరిశ్రమ. ఈ నెలలో దాదాపు అరడజను పాన్‌ ఇండియా సినిమాలు బాక్సాఫీస్‌ ముందు వరుస కడుతుండటం.. ప్రభాస్‌, షారుక్‌ ఖాన్‌, విజయ్‌ దేవరకొండ, రామ్‌ లాంటి స్టార్లు పోటీ పడుతుండటం సినీప్రియుల్ని ఊరిస్తోంది. మరి వీటిలో హిట్టు మాట వినిపించి.. వసూళ్ల వర్షం కురిపించేవి ఏవి? అన్నది ఆసక్తి రేకెత్తిస్తోంది.

సెప్టెంబరు తొలివారంలో విజయ్‌ దేవరకొండ - సమంతల ‘ఖుషి’తో పాటు ‘నా..నీ.. ప్రేమకథ’ అనే మరో చిన్న చిత్రం థియేటర్లలోకి రానుంది. అయితే వీటిలో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది ‘ఖుషి’నే. విజయ్‌ - సామ్‌ జంటగా శివ నిర్వాణ రూపొందించిన ఈ ప్రేమ కథా చిత్రం సెప్టెంబరు 1న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే పాటలు, ప్రచార చిత్రాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంతో మంచి వసూళ్లు సాధించే అవకాశమున్నట్లు ట్రేడ్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

‘జవాన్‌’తో శెట్టి పోరు..

షారుక్‌ ఖాన్‌ ‘జవాన్‌’, నవీన్‌ పొలిశెట్టి - అనుష్కల ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్ట¨’ సెప్టెంబరు 7న బాక్సాఫీస్‌ ముందు తలపడనున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో ‘పఠాన్‌’తో రూ.1000కోట్ల పైచిలుకు వసూళ్లు సాధించి బాలీవుడ్‌కు కొత్త కళ తీసుకొచ్చారు షారుక్‌. అంతటి భారీ విజయం తర్వాత ఆయన నుంచి రానున్న సినిమా కావడంతో ‘జవాన్‌’పై ఇటు ప్రేక్షకుల్లోనూ.. అటు సినీ వర్గాల్లోనూ భారీస్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. దాదాపు రూ.300కోట్ల భారీ బడ్జెట్‌తో అట్లీ రూపొందించిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌లో నయనతార కథానాయికగా కనిపించనుండగా.. విజయ్‌ సేతుపతి ప్రతినాయక పాత్ర పోషించారు. తమిళ స్టార్‌ విజయ్‌, బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ ఇందులో అతిథి పాత్రల్లో తళుక్కున మెరవనున్నట్లు సమాచారం. ఇక ‘జవాన్‌’ బాటలోనే పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న ‘మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి’ చిత్రంపైనా మంచి అంచనాలున్నాయి. ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘జాతిరత్నాలు’ లాంటి విజయాల తర్వాత నవీన్‌ నటించిన చిత్రమిది. పి.మహేష్‌ తెరకెక్కించారు. భిన్న వయసులున్న ఓ జంట మధ్య సాగే సరికొత్త ప్రేమకథతో ఈ చిత్రం రూపొందింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు వినోదాత్మకంగా ఉండి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి.

చవితి బరిలో గెలుపెవరిదో?

ఈ వినాయక చవితి పసందైన వినోదాలతో కనువిందు చేయనుంది. ఈ సారి బాక్సాఫీస్‌ బరిలో రామ్‌, విశాల్‌, లారెన్స్‌ల మధ్య ముక్కోణపు పోటీ కనిపించనుంది. ‘అఖండ’ లాంటి విజయం తర్వాత ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను.. రామ్‌తో రూపొందించిన సినిమా ‘స్కంద’. ఇది ఈ ఇద్దరికీ తొలి పాన్‌ ఇండియా ప్రయత్నమే. మాస్‌ యాక్షన్‌ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్‌ రెండు కోణాలున్న పాత్ర పోషించారు. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాలో శ్రీలీల కథానాయిక. సయీ మంజ్రేకర్‌ మరో నాయికగా నటించింది. ఇక లారెన్స్‌ - కంగనా రనౌత్‌ కలిసి నటించిన ‘చంద్రముఖి 2’, విశాల్‌ - అధిక్‌ రవిచంద్రన్‌ కలయికలో రూపొందిన ‘మార్క్‌ అంథోని’ చవితి బరిలోనే అదృష్టం పరీక్షించుకోనున్నాయి. వీటిలో లారెన్స్‌ సినిమా రజనీకాంత్‌ హిట్‌ సినిమా ‘చంద్రముఖి’కి కొనసాగింపుగా రూపొందగా, విశాల్‌ చిత్రం ఓ వినూత్నమైన ట్రైమ్‌ ట్రావెల్‌ కథాంశంతో తెరకెక్కింది. మరి సెప్టెంబరు 15న థియేటర్లలోకి అడుగుపెడుతున్న ఈ మూడు సినిమాల్లో విజయ ఢంకా మోగించేది ఏదన్నది మరికొద్ది రోజుల్లో తేలనుంది. ఈ మూడింటికి రెండు వారాల లాంగ్‌ వీకెండ్‌ దొరకడం.. ఏమాత్రం పాజిటివ్‌ టాక్‌ వచ్చినా భారీ వసూళ్లు కొల్లగొట్టే అవకాశముందని చిత్ర వర్గాలు అంచనా వేస్తున్నాయి.

కళ్లన్నీ ‘సలార్‌’పైనే..

రెండేళ్లుగా సినీప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘సలార్‌’ ఒకటి. ప్రభాస్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ‘కేజీఎఫ్‌’ విజయాల తర్వాత ప్రశాంత్‌ నుంచి వస్తున్న సినిమా కావడంతో జాతీయ స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు ఇందులో పృథ్విరాజ్‌ సుకుమారన్‌ ప్రతినాయకుడిగా నటించడం.. ‘కేజీఎఫ్‌’ యూనివర్స్‌ నుంచి వస్తున్న చిత్రమని వార్తలు వినిపిస్తుండటం ఈ అంచనాల్ని రెట్టింపు చేస్తున్నాయి. ‘రాధేశ్యామ్‌’, ‘ఆదిపురుష్‌’ సినిమాలతో చేదు ఫలితాలందుకున్న ప్రభాస్‌ దీనిపై భారీ ఆశలే పెట్టుకున్నారు. ఇది రెండు భాగాలుగా విడుదల కానుండగా.. తొలి భాగం ‘సలార్‌ పార్ట్‌1: సీజ్‌ ఫైర్‌’ పేరుతో సెప్టెంబరు 28న థియేటర్లలో అడుగుపెట్టనుంది. అదే రోజున వివేక్‌ రంజన్‌ అగ్నిహోత్రి దర్శకత్వం వహిస్తున్న ‘ది వ్యాక్సిన్‌ వార్‌’ కూడా విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని