Shruti Haasan: రాజమౌళి మాటలు సంతోషాన్నిచ్చాయి

నటనతోనే కాదు తన పాటలతోనూ అభిమానులను కట్టిపడేస్తుంది కథానాయిక శ్రుతి హాసన్‌. గతేడాది ఒక్క సినిమా కూడా చేయని ఈమె ఈ ఏడాది వరుస చిత్రాలతో బిజీగా ఉంది. తాజాగా ప్రభాస్‌ ప్రధాన పాత్రలో వచ్చిన ‘సలార్‌: పార్ట్‌ 1 సీజ్‌ ఫైర్‌’లో ఆద్యగా ఆకట్టుకుంది.

Updated : 28 Dec 2023 04:17 IST

నటనతోనే కాదు తన పాటలతోనూ అభిమానులను కట్టిపడేస్తుంది కథానాయిక శ్రుతి హాసన్‌. ‘అనగనగా ఓ ధీరుడు’ అనే సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన ఈ భామ అగ్రకథానాయకులతో తెరపై సందడి చేసింది. హీరోల సరసన ప్రత్యేక పాటలు చేస్తూ అలరించింది. గతేడాది ఒక్క సినిమా కూడా చేయని ఈమె ఈ ఏడాది వరుస చిత్రాలతో బిజీగా ఉంది. తాజాగా ప్రభాస్‌ ప్రధాన పాత్రలో వచ్చిన ‘సలార్‌: పార్ట్‌ 1 సీజ్‌ ఫైర్‌’లో ఆద్యగా ఆకట్టుకుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శ్రుతి చెప్పిన విషయాలివీ...

కూల్‌ అండ్‌ కామ్‌

ప్రభాస్‌ తెరపై చేసిన పాత్రలకంటే భిన్నంగా తన నిజజీవితంలో ఉంటారు. చాలా కూల్‌గా, కామ్‌గా, ప్రశాంతంగా ఉంటారు. సినిమాలోని పాత్రల కోసం ప్రభాస్‌ కష్టడుతూ పనిచేయటం, పాత్రలో ఒదిగిపోయే విధానం నన్ను బాగా ఆకట్టుకున్నాయి. మంచి సహనటుడు. స్నేహంగా ఉంటారు. ప్రేక్షకులు కోరుకునే దానికంటే ఎక్కువగా అలరించగల నటుడాయన. యాక్షన్‌ సన్నివేశాల్లో మాత్రం తనలో భిన్నమైన ప్రభాస్‌ కనిపిస్తాడు.

ఈ ఏడాది ఎంతో ప్రత్యేకం

బాలకృష్ణ, చిరంజీవి సర్‌లతో కలిసి ఈ ఏడాది ప్రారంభించాను. ఇప్పుడు ‘సలార్‌’తో విజయవంతంగా ముగిస్తున్నాను. ‘మాన్‌స్టర్‌ మెషిన్‌’ అనే ప్రత్యేక పాటని కూడా విడుదల చేశాను. ఈ ఏడాది ఎంత ప్రత్యేకంగా ఉందో వచ్చే సంవత్సరం కూడా దీనికి భిన్నంగా ఉండాలని ఆశిస్తున్నాను.

తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో అలరిస్తా

నేను తదుపరి హాలీవుడ్‌లో ‘ది ఐ’ చేస్తున్నాను. ఈ చిత్రాన్ని ఇటీవలే ‘లండన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’, ‘గ్రీక్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’లో ప్రదర్శించారు. ఇదొక సైకలాజికల్‌ థ్రిల్లర్‌ డ్రామా. అడివి శేష్‌తో ‘డకాయిట్‌’లో నటిస్తున్నాను. తెలుగు, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఆ చిత్ర టైటిల్‌ గ్లింప్స్‌ని తాజాగా విడుదల చేశారు. దానికి మంచి స్పందన లభించింది. రెండు భిన్నమైన కథలతో వచ్చే ఏడాది అలరిస్తా.

అదే అతిపెద్ద కారణం

సినిమాలోని నా పాత్రల ఎంపిక పట్ల చాలా ప్రత్యేకంగా ఆలోచిసున్నాను. గతేడాది నేను ఒక్క సినిమా కూడా చేయకపోవడానికి కారణం నాకు నచ్చిన కథలు రాకపోవడమే. అగ్రతారలతో కలిసి తెరను పంచుకుంటూ ఈ ఏడాదిని అద్భుతంగా ప్రారంభించాను. ప్రథమార్ధంలో ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహా రెడ్డి’, ద్వితీయార్ధంలో ‘సలార్‌’తో మంచి విజయాన్ని అందుకున్నాను. నేను ‘సలార్‌’లో నటించడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తీర్చిదిద్దిన నా పాత్ర, రెండోది ప్రభాస్‌తో కలిసి చేయాలన్న కోరిక. ఈ సినిమాలో నా పాత్ర చాలా నచ్చింది. ప్రభాస్‌తో కలిసి పనిచేయాలనేది ఈ చిత్రం చేయడానికి అతిపెద్ద కారణం.

కోరుకున్నట్టే భాగమయ్యాను

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి సర్‌ నా డ్యాన్స్‌ గురించి మాట్లాడటం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. ‘సలార్‌’లో నా డ్యాన్స్‌ లేదని దర్శకుడిని అడిగారని తెలిసి ఆశ్చర్యపోయాను. ‘రేసు గుర్రం’, ‘శ్రీమంతుడు’ చిత్రాల్లో ఆమె చేసిన డ్యాన్స్‌ అంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమాలో డ్యూయెట్‌లు లేవని తెలిశాక నిరాశపడ్డాను’ అని రాజమౌళి సర్‌ ఆ ఇంటర్వ్యూలో చెప్పిన ఆ మాటలు సంతోషాన్నిచ్చాయి. కానీ నేను ఈ ప్రాజెక్టుకు సంతకం చేసేటప్పుడు కథ దేనిపై దృష్టి పెట్టిందో అని గ్రహించాను. డ్యాన్సులు లేకపోయినా ప్రశాంత్‌ నీల్‌ సినీ ప్రపంచంలో భాగం కావాలని కోరుకున్నాను.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని