మరోమారు..సీనియర్ల జోరు

వయసు పెరిగినా వన్నె తగ్గడం లేదు.. ఇప్పటికే పదుల చిత్రాలు తమ ఖాతాలో ఉన్నా పరుగు ఆపడం లేదు. ఒకవైపు నాయికా ప్రధానమైన కథల్లో నటిస్తూ.. మరోవైపు సీనియర్‌ హీరోలతో జోడీ కడుతూ జోరు చూపిస్తున్నారు.

Published : 22 Feb 2024 04:48 IST

వయసు పెరిగినా వన్నె తగ్గడం లేదు.. ఇప్పటికే పదుల చిత్రాలు తమ ఖాతాలో ఉన్నా పరుగు ఆపడం లేదు. ఒకవైపు నాయికా ప్రధానమైన కథల్లో నటిస్తూ.. మరోవైపు సీనియర్‌ హీరోలతో జోడీ కడుతూ జోరు చూపిస్తున్నారు. నవతరం నాయికలకి దీటుగా అవకాశాలు కొల్లగొడుతూ దూసుకెళ్తున్నారు సీనియర్‌ భామలు. తెలుగులో తమకేమాత్రం డిమాండ్‌ తగ్గలేదని నిరూపించుకుంటున్నారు.

త్రిష... అనుష్క... కాజల్‌... శ్రుతిహాసన్‌... ఇలా చాలామంది సీనియర్‌ నాయికలు తెలుగు సినిమాలతోనే ఇప్పుడు సెట్స్‌లో బిజీగా గడుపుతున్నారు. నయనతార కోసం ఎప్పుడూ ఏదో ఒక ప్రాజెక్ట్‌ ఎదురు చూస్తూ ఉంటుంది. ఆమె కాల్షీట్లు దొరకడమే బంగారం అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఈ మధ్య కొత్త తారలకైనా హిట్లు, ఫ్లాపుల్నిబట్టి అవకాశాలు దక్కుతున్నాయి కానీ... సీనియర్‌ హీరోయిన్లకి మాత్రం ఎప్పుడూ ఏదో ఒక సినిమా ఎర్రతివాచీ పరిచి స్వాగతం పలుకుతూనే ఉంది. వాళ్లకున్న అనుభవం, అందుకు తగ్గట్టుగా సిద్ధమవుతున్న కథలు, పాత్రలే   అందుకు కారణం.

  • త్రిష ఇరవయ్యేళ్ల కిందట చేసిన ‘వర్షం’ సినిమా రీరిలీజ్‌ థియేటర్లలో సందడి చేస్తోంది. త్రిష అందాన్ని, ఆమె సందడిని మరోమారు ఆస్వాదిస్తూ ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’... అంటూ కుర్రకారు థియేటర్లలో స్టెప్పులేస్తున్నారు. ఆమె అదే అందంతో ఇప్పుడు కూడా కొత్త అవకాశాలతో జోరు ప్రదర్శిస్తోంది. ఇటీవలే చిరంజీవి సరసన ‘విశ్వంభర’లో అవకాశాన్ని అందుకుని సెట్లోకి అడుగుపెట్టింది. మరోవైపు తమిళంలో ఆమె వరుసగా సినిమాలు చేస్తోంది. మరో సీనియర్‌ భామ అనుష్క కూడా బిజీ అయిపోయింది. క్రిష్‌ దర్శకత్వంలో ఆమె ఓ నాయికా ప్రధానమైన చిత్రం చేస్తోంది. ఇప్పటికే చిత్రీకరణ మొదలైంది. అనుష్క మలయాళంలోనూ ఓ సినిమా చేయడానికి అంగీకారం తెలిపింది.
  • పెళ్లి తర్వాత కాజల్‌ జోరు ఏమాత్రం ఆగలేదు. ఆమె వరుసగా సినిమాలు చేస్తోంది. ‘భగవంత్‌ కేసరి’తో విజయాన్ని అందుకున్న ఆమె ప్రస్తుతం ‘సత్యభామ’ అనే నాయికా ప్రధానమైన సినిమా చేస్తోంది. త్వరలోనే ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘భారతీయుడు2’లోనూ కాజల్‌ ఓ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. హిందీలో ‘ఉమా’ అనే ప్రాజెక్టులో నటిస్తోంది. తెలుగులో చేయడం కోసం మరిన్ని కథలు ఆమె పరిశీలనలో ఉన్నట్టు సమాచారం.  శ్రుతిహాసన్‌ ఇటీవలే ‘డెకాయిట్‌’ చిత్రం కోసం రంగంలోకి దిగింది. అడివి శేష్‌ కథానాయకుడిగా పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న చిత్రమిది. దీంతోపాటు శ్రుతి ఈ వేసవి నుంచి ‘సలార్‌2’తోనూ బిజీ కానుంది. వీళ్లే కాకుండా... శ్రియ, ప్రియమణిలాంటి కథానాయికలు అప్పుడప్పుడూ కీలకమైన అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ సత్తా చాటుతున్నారు.

అగ్ర హీరోల ఎదురుచూపు

సీనియర్‌ హీరోల కొన్ని చిత్రాలు హీరోయిన్ల కోసం ఎదురు చూస్తున్నాయి.. బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో ముగ్గురు కథానాయికలకి చోటుంది. ప్రధాన కథానాయిక పాత్ర కోసం ఇప్పటికీ కసరత్తులు సాగుతున్నట్టు తెలుస్తోంది. మొదట శ్రద్ధా శ్రీనాథ్‌ పేరు వినిపించినా ఇంకా ఖరారు కాలేదని సమాచారం. బాలకృష్ణతో కలిసి నటించిన ఓ సీనియర్‌ హీరోయిన్‌ని ఎంపిక చేయడంపైనే చిత్రబృందం దృష్టి పెట్టినట్టు సమాచారం. మరో సీనియర్‌ హీరో వెంకటేశ్‌ త్వరలోనే అనిల్‌ రావిపూడితో కలిసి రంగంలోకి దిగనున్నారు. ఇందులోనూ ఓ సీనియర్‌ భామ నటించనుంది. మరి ఆ అవకాశం ఎవరికో చూడాలి. మునుపటితో పోలిస్తే అగ్ర హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్‌, నాగార్జున ఇప్పుడు వేగంగా సినిమాలు చేయడంపై దృష్టి పెడుతున్నారు. వీళ్లకి తగిన జోడీ అంటే సీనియర్‌ భామలే గుర్తొస్తున్నారు. నాయికా ప్రధానమైన కథలు కూడా విరివిగా సిద్ధమవుతున్నాయి. దాంతో అనుభవాన్ని వెనకేసుకున్న భామలకి ఇప్పుడు గిరాకీ పెరిగినట్టైంది. ఇదివరకు పది, పదిహేనేళ్లకి హీరోయిన్ల కెరీర్‌ దాదాపు ముగిసిపోయేది. మారిన పరిణామాలతో ఇప్పుడు కెరీర్‌ మొదలై రెండు దశాబ్దాలు గడుస్తున్నా అవకాశాలు అందుకుంటూనే ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని