విజయ్‌ కుమారుడి దర్శకత్వంలో దుల్కర్‌?

సినీతారలు తెరపై సందడి చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటే.. వారి పిల్లలు మాత్రం దర్శకత్వం వైపు మొగ్గుచూపుతున్నారు. అందులో ఒకరే తమిళ అగ్రకథానాయకుడు విజయ్‌ కుమారుడు జాసన్‌ సంజయ్‌. గతేడాది ఆగస్టులో ఆయన ఓ సినిమాకి త్వరలోనే దర్శకత్వం వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

Updated : 24 Feb 2024 04:13 IST

సినీతారలు తెరపై సందడి చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటే.. వారి పిల్లలు మాత్రం దర్శకత్వం వైపు మొగ్గుచూపుతున్నారు. అందులో ఒకరే తమిళ అగ్రకథానాయకుడు విజయ్‌ కుమారుడు జాసన్‌ సంజయ్‌. గతేడాది ఆగస్టులో ఆయన ఓ సినిమాకి త్వరలోనే దర్శకత్వం వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మితమవుతున్న ఆ చిత్రంలో ప్రముఖ మలయాళ హీరో దుల్కర్‌ సల్మాన్‌ ప్రధాన పాత్ర పోషించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ‘లక్కీ భాస్కర్‌’, ‘థగ్‌ లైఫ్‌’ చిత్రీకరణలతో బిజీగా ఉన్న దుల్కర్‌ తదుపరి సినిమాని జాసన్‌ సంజయ్‌ తెరకెక్కించేందుకు ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది. ఆ వార్త ప్రాజెక్టుపై ఆసక్తిని పెంచుతోంది. చిత్ర విషయాల్ని ఇతర నటీనటుల వివరాల్ని త్వరలోనే వెల్లడించనున్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. దుల్కర్‌ ఈ చిత్రంలో భాగం అవుతున్నారో లేదో జాసన్‌ అధికారికంగా పేర్కొనే వరకూ వేచి చూడాల్సిందే.


సేనాపతి వచ్చేది మేలో

వేేసవిలో సందడి కోసం వడివడిగా ముస్తాబవుతున్నాడు భారతీయుడు. మే నెలలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కమల్‌హాసన్‌ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘భారతీయుడు 2’. కాజల్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, ప్రియ భవానీ శంకర్‌, సిద్ధార్థ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 1996లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘భారతీయుడు’కి కొనసాగింపుగా రూపొందుతున్న చిత్రమిది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. 28 ఏళ్లవుతున్నా కమల్‌ చేసిన సేనాపతి పాత్ర గుర్తుండిపోయింది. రెండోసారి ఆ పాత్రతో ఆయన తెరపై సందడి చేయనున్నారు. దేశం కోసం ఈసారి సేనాపతి ఏమేం చేశాడో, ఎలాంటి సందేశం ఇచ్చాడో తెలియాలంటే వేసవి వరకూ ఆగాల్సిందే. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కూర్పు: శ్రీకర్‌ప్రసాద్‌, సంగీతం: అనిరుధ్‌, ఛాయాగ్రహణం: రవివర్మన్‌.


భయపెట్టే తంత్రం

నన్య నాగళ్ల ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన చిత్రం ‘తంత్ర’. శ్రీనివాస్‌ గోపిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. నరేశ్‌ బాబు.పి, రవిచైతన్య నిర్మాతలు. త్వరలోనే ట్రైలర్‌ని విడుదల చేయనున్నట్టు సినీ వర్గాలు తెలిపాయి. ‘‘భయపెట్టే అంశాలతో రూపొందిన చిత్రమిది. పల్లెటూరి అమ్మాయిగా అనన్య నాగళ్ల అభినయం ఆకట్టుకుంటుంది. ఆమెకి జోడీగా ధనుష్‌ రఘుముద్రి బలమైన పాత్రలో కనిపిస్తారు. సెన్సార్‌ బృందం ఏ సర్టిఫికెట్‌ ఇచ్చింది. హారర్‌ అంశాలున్న ఈ చిత్రాన్ని చూడటానికి చిన్న పిల్లలు రావొద్దని మేం ప్రచారం చేస్తున్నామ’’ని సినీ వర్గాలు తెలిపాయి. సలోనీ, టెంపర్‌ వంశీ, మీసాల లక్ష్మణ్‌, కుశాలిని తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సాయిరామ్‌ ఉదయ్‌, విజయ్‌ భాస్కర్‌ సద్దాల, సంగీతం: ఆర్‌.ఆర్‌.ధృవన్‌.


నవ్వులు పంచే లైన్‌ మ్యాన్‌

‘లైన్‌ మ్యాన్‌’గా ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమవుతున్నారు త్రిగుణ్‌. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని వి.రఘుశాస్త్రి తెరకెక్కించారు. పర్పుల్‌ రాక్‌ ఎంటర్‌టైనర్స్‌ సంస్థ నిర్మించింది. కాజల్‌ కుందెర్‌ కథానాయిక. ఈ సినిమా తెలుగు, కన్నడ భాషల్లో మార్చి 15న విడుదల కానుంది. ఈ మేరకు ఇటీవల ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘‘మాండ్య సమీప గ్రామాల్లోని వాతావరణాన్ని చక్కగా ఆవిష్కరిస్తూ.. ఆద్యంతం వినోదభరితంగా ఈ సినిమాని రూపొందించాం. ఓ లైన్‌ మ్యాన్‌ జీవితంలోని పలు ఆసక్తికరమైన అంశాల్ని దీంట్లో చూపించనున్నాం’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి సంగీతం: కాద్రి మణికాంత్‌, ఛాయాగ్రహణం: శాంతి సాగర్‌ హెచ్‌.జి.


‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’లో

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని