Anjali: ‘గీతాంజలి’ డబుల్‌ బొనాంజా

‘నేను చేసిన తొలి నాయికా ప్రధానమైన చిత్రం ‘గీతాంజలి’. పదేళ్ల తర్వాత దానికి కొనసాగింపుగా, నా యాభయ్యో సినిమాగా ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ చేశాం. ఇది నా కెరీర్‌లో ఎంతో ప్రత్యేకమైన చిత్రం’’ అన్నారు కథానాయిక అంజలి.

Updated : 26 Feb 2024 06:40 IST

‘‘నేను చేసిన తొలి నాయికా ప్రధానమైన చిత్రం ‘గీతాంజలి’. పదేళ్ల తర్వాత దానికి కొనసాగింపుగా, నా యాభయ్యో సినిమాగా ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ చేశాం. ఇది నా కెరీర్‌లో ఎంతో ప్రత్యేకమైన చిత్రం’’ అన్నారు కథానాయిక అంజలి. ఆమె ప్రధాన పాత్రధారిగా... శివ తుర్లపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’. ఎం.వి.వి.సినిమాస్‌తో కలిసి కోన ఫిలిం కార్పొరేషన్‌ పతాకంపై కోన వెంకట్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 22న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో టీజర్‌ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీవిష్ణు, బుచ్చిబాబు సానా, బాబీ, గోపీచంద్‌ మలినేని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

అంజలి మాట్లాడుతూ ‘‘రచయిత కోన వెంకట్‌ ‘నిశ్శబ్దం’ సమయంలో ఈ కథాలోచన గురించి చెప్పారు. ఆయన స్క్రిప్ట్‌ కోసం ఇంత సమయం తీసుకుని సిద్ధం చేశారు. డబుల్‌ బొనాంజాలా తొలి సినిమాని మించి నవ్విస్తుంది, భయపెడుతుందీ చిత్రం. థియేటర్ల నుంచి ఒక మంచి అనుభూతితో ప్రేక్షకులు బయటికెళతారు’’ అన్నారు. కోన వెంకట్‌ మాట్లాడుతూ ‘ఇందులోని ప్రతి పాత్ర ప్రేక్షకుడికి కనెక్ట్‌ అవుతుంది. ప్రవీణ్‌, శివ, శ్రీజో అందరికీ ఈ చిత్రం మంచి ఫలితాన్నిస్తుంది’’ అన్నారు. శివ తుర్లపాటి మాట్లాడుతూ ‘కోన వెంకట్‌ వల్లే మళ్లీ పరిశ్రమలోకి వచ్చా. ఆయన చేసిన ప్రతి సినిమాకీ నృత్య దర్శకత్వం చేశా. దర్శకత్వం కోసం కథ సిద్ధం చేసుకున్నా. కానీ ముందు ఈ సినిమాని తీయమని కోన చెప్పారు.ఇంతమంది నటులతో కలిసి సినిమా చేయడం చాలా తృప్తినిచ్చింది’’ అన్నారు.

‘‘అంజలి యాభై సినిమాలు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఓ తెలుగమ్మాయి ఇన్ని సినిమాలతో విజయవంతంగా కెరీర్‌ని కొనసాగిస్తున్నందుకు గర్వంగా ఉంది. గతేడాదిగా కోన వెంకట్‌తో పనిచేస్తున్నా. త్వరలోనే ఆయనతో ఓ సినిమాని చేస్తున్నా. శ్రీనివాస్‌రెడ్డి, సత్యం రాజేశ్‌... ఇలా అందరూ నాకు కావల్సినవాళ్లే ఇందులో నటించారు. దీంతో రచయితలు మరో స్థాయికి చేరుకుంటున్నారు. అందరినీ నవ్వించి, భయపెట్టి వసూళ్లు కొల్లగొట్టాలని కోరుకుంటున్నా’’ అన్నారు శ్రీవిష్ణు. ఈ కార్యక్రమంలో అలీ, అవినాష్‌ తదితర చిత్రబృందం పాల్గొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని