Siva: ‘శివ’లో ఆ పాత్ర కోసం మోహన్‌బాబు.. వద్దంటే వద్దన్న వర్మ!

Siva: నాగార్జున కథానాయకుడిగా వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘శివ’ ఓ పాత్ర కోసం మోహన్‌బాబును అనుకున్నారట.

Published : 24 Jul 2023 10:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగు సినిమా చరిత్రను రాయాల్సి వస్తే, ‘శివ’(siva)కు ముందు తర్వాత అంటూ పేర్కొంటారు సినీ విశ్లేషకులు. కేవలం తెలుగు మూవీపైనే కాదు, భారతీయ సినిమాలో ఒక ట్రెండ్‌ను సృష్టించింది. రాంగోపాల్‌వర్మ (Ram Gopal Varma) దర్శకత్వంలో నాగార్జున (Nagarjuna) కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం కల్ట్‌ మూవీగా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. అయితే, ఇందులోని ఓ పాత్ర కోసం విలక్షణ నటుడు మోహన్‌బాబు పేరును చిత్ర బృందం పరిశీలించింది.

‘శివ’ సినిమాలో నటించిన నాగార్జున, రఘువరన్‌, అమల ఇలా ఓ నలుగురైదుగురు మినహాయిస్తే, అందరూ కొత్తవారు. అటు దర్శకత్వశాఖతో పాటు, ఇతర టెక్నీషియన్స్‌ కూడా అప్పుడే ఇండస్ట్రీకి వచ్చారు. ఈ సినిమా కథా చర్చలు జరుగుతుండగా, రఘువరన్‌ దగ్గర రౌడీగా పనిచేసే గణేశ్‌ పాత్రకు ఎవరిని తీసుకోవాలా?అని చర్చిస్తుండగా, నిర్మాత అక్కినేని వెంకట్‌ మోహన్‌బాబు పేరును సూచించారు. హీరోకు వార్నింగ్‌ ఇచ్చే స్థాయి ఉండాలంటే అందరికీ తెలిసిన నటుడు అయితే బాగుంటుందని సలహా ఇచ్చారు. పైగా అప్పటికే ఆయన ప్రతినాయకుడిగా పలు పాత్రల్లో నటించి మెప్పించారు. ఆయనతో తనకున్న పరిచయంతో సులభంగా ఒప్పిస్తానని కూడా చెప్పారు. అయితే, ఇందుకు రాంగోపాల్‌వర్మ ససేమిరా అన్నారు. ఆ పాత్రలో మోహన్‌బాబును పెట్టుకుంటే ఆ సీన్‌ ఎఫెక్ట్‌వ్‌గా ఉండదని అన్నారట. అందుకు కారణం కూడా వర్మ చెప్పారు. ‘తెలుగు ప్రేక్షకులకు మోహన్‌బాబు సుపరిచితులు. ఆయన నటన, డైలాగ్‌ డిక్షన్‌ ప్రత్యేకంగా ఉంటుంది. అలాంటి వ్యక్తి ‘శివ’ పాత్రకు వార్నింగ్‌ ఇస్తుంటే, ఆ పాత్రలో ప్రేక్షకుడికి మోహన్‌బాబు కనపడతారు తప్ప, కరుడుగట్టిన రౌడీ కనిపించడ’ని వర్మ అన్నారట. దీంతో ఆ పాత్రలో విశ్వనాథ్‌ అనే నటుడుని తీసుకున్నారు.

నాగార్జున షాట్ హైదరాబాద్‌లో.. రఘువరన్‌ షాట్ చెన్నైలో..

ఇక ‘శివ’లో ఎలాంటి డూప్‌ లేకుండా నాగార్జున ఒక స్టంట్‌ చేశారు. అదే లారీని పట్టుకుని సైకిల్‌పై వెళ్లడం. తనని చంపడానికి వచ్చిన రౌడీల నుంచి తప్పించుకునే క్రమంలో పాపను సైకిల్‌పై ఎక్కించుకుని నాగార్జున వెళ్తుంటారు. అప్పట్లో అది అంత డేంజరస్‌ షాట్‌ అని వర్మకు అనిపించలేదట. సైకిళ్లపై వెళ్లేవాళ్లు చాలా మంది లారీ చైన్‌లు, బస్సులను పట్టుకుని వెళ్లడం గమనించిన ఆయన అలాంటి సన్నివేశాన్నే ఇందులోనూ తీశారు. నాగార్జున కూడా ఎలాంటి భయం లేకుండా ఆ షాట్‌ చేశారు. ఇక క్లైమాక్స్‌లో భవంతిపై జరిగే ఫైట్‌ సీన్‌లో గాలి ఎఫెక్ట్‌ కోసం పెద్ద ప్రొఫెల్లర్‌ను మోసుకుంటూ పది అంతస్తులు ఎక్కింది చిత్ర బృందం. ఈ ఫైట్‌ సీక్వెన్స్‌లో నాగార్జున, రఘువరన్‌ ఒకరి మెడను మరొకరు నొక్కుకుంటూ కనిపిస్తారు. ఈ సన్నివేశం తీసే సమయానికి రఘువరన్‌కు డేట్స్‌ కుదరలేదు. దీంతో నాగార్జున కనిపించే సీన్‌లో డూప్‌ను పెట్టి,  హైదరాబాద్‌లో షూట్‌ చేయగా, రఘువరన్‌ కనిపించే సీన్‌ను చెన్నైలో తీశారు. ఆ తర్వాత కాల క్రమంలో  మోహన్‌బాబు నటించిన ‘అధిపతి’ చిత్రంలో నాగార్జున అతిథి పాత్రలో కనిపించగా, రాంగోపాల్‌ వర్మ దర్శకత్వంలో మోహన్‌బాబు ‘రౌడీ’  చిత్రంలో నటించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని