‘ఈటీవీ విన్‌’తో కలిసి పనిచేయడం కోసం ఎదురు చూస్తున్నా

ఓటీటీ విప్లవం వచ్చినప్పటి నుంచి ఈనాడు  గ్రూప్‌ నుంచి ఓటీటీ వేదిక ఎప్పుడొస్తుందా అని ఎదురు చూశా. ఆలస్యమైనా మంచి వేదికని తీసుకొచ్చారు.

Published : 01 Mar 2024 01:38 IST

దర్శకుడు హరీశ్‌ శంకర్‌

‘‘టీటీ విప్లవం వచ్చినప్పటి నుంచి ఈనాడు  గ్రూప్‌ నుంచి ఓటీటీ వేదిక ఎప్పుడొస్తుందా అని ఎదురు చూశా. ఆలస్యమైనా మంచి వేదికని తీసుకొచ్చారు. ఈటీవీ విన్‌తో కలిసి పనిచేయడం కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నా. ఆ వేదికలో వస్తున్న ‘వళరి’ తప్పకుండా ప్రేక్షకుల మెప్పు పొందుతుంద’’న్నారు ప్రముఖ దర్శకుడు హరీశ్‌ శంకర్‌. ఆయన ముఖ్య అతిథిగా గురువారం హైదరాబాద్‌లో ‘వళరి’ ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. శ్రీరామ్‌, రితికాసింగ్‌ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రమిది. ఎం.మృతిక సంతోషిణి దర్శకత్వం వహించారు. కె.సత్యసాయిబాబు ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత. మార్చి 6న ఈటీవీ విన్‌ ఓటీటీ వేదికలో ప్రదర్శితం కానుంది. ట్రైలర్‌ విడుదల అనంతరం హరీశ్‌ శంకర్‌ మాట్లాడుతూ ‘‘చిత్ర పరిశ్రమ మహిళా దర్శకులు తక్కువ మంది ఉంటారు. దర్శకురాలు సంతోషిణి ఎంతో సృజనాత్మకతతో చిత్రాన్ని తీర్చిదిద్దారు. ట్రైలర్‌, సినిమా పేరు ఎంతో ఆసక్తికరంగా ఉంది. ఎడిటర్‌ తమ్మిరాజు సహా ఎంతోమంది ప్రతిభావంతులు ఈ సినిమాకి పనిచేశారు. వాణిజ్య ప్రధానమైన సినిమాలు తీస్తున్నప్పుడు మాకు ఎన్నో పరిధులు ఉంటాయి. ఎన్నో కథలు చెప్పాలనుకుంటాం కానీ కుదరదు. నేను చలం ‘మైదానం’ తెరకెక్కిద్దామనే పరిశ్రమకి వచ్చా. కానీ ‘మిరపకాయ్‌’, ‘డీజే’, ‘గబ్బర్‌సింగ్‌’ తదితర చిత్రాలు తీశా. ఇంకాస్త కథా ప్రాధాన్యమున్న సినిమాలు తీయాలనుకున్నప్పుడు ఓటీటీ వేదికలు పనికొస్తాయి. ఈ వేదికలతో మాకు భాష పరంగా చాలా సమస్యలొస్తున్నాయి. ఈ దశలో తెలుగు నుంచి ఎంతో అనుభవం ఉన్న ఈనాడు, ఈటీవీ సంస్థల నుంచి ఓటీటీ రావడం చాలా ఆనందంగా ఉంది. కథానాయకుడు శ్రీరామ్‌కి కథ చెప్పడానికి నేను సహాయ దర్శకుడిగా ఉన్నప్పుడు చాలా ప్రయత్నించా. కానీ కుదరలేదు. శ్రీరామ్‌, రితికా కలిసి చేసిన ఈ చిత్రం ప్రేక్షకుల మెప్పు పొందాలని కోరుకుంటున్నా’’ అన్నారు. శ్రీరామ్‌ మాట్లాడుతూ ‘‘ఎంతో స్పష్టతతో ఈ సినిమాని తెరకెక్కించారు సంతోషిణి. కథ, కథనం ప్రేక్షకులకు కొత్త అనుభవాన్ని పంచుతాయి’’ అన్నారు. రితికాసింగ్‌ మాట్లాడుతూ ‘‘చాలా రోజుల  తర్వాత నేను చేసిన తెలుగుసినిమా ఇది. నా పాత్రలో ఎన్నో పార్శ్వాలున్నాయి. శ్రీరామ్‌, సుబ్బరాజు, ఉత్తేజ్‌ తదితరులతో కలిసి పనిచేయడం మంచి అనుభవం’’ అన్నారు. దర్శకురాలు మాట్లాడుతూ ‘‘వళరి అనేది ఒక ఆయుధం. మనం ఏం చేసినా కర్మ తిరిగి మన వద్దకే వస్తుందనే అంశం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. వళరి ఆయుధం కూడా అలాగే ఉంటుంది. అందుకే ఆ పేరు పెట్టాం. ఎంతో స్వేచ్ఛతో చిత్రాన్ని తీర్చిదిద్దా. నటీనటులు, సాంకేతిక బృందం చక్కటి సహకారం అందించార’’న్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తేజ్‌, సుబ్బరాజు, తమ్మిరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని