రామోజీ ఫిల్మ్‌ సిటీలో ‘భీమునిపట్నం’

కంచర్ల ఉపేంద్ర, అపర్ణా దేవి జంటగా నటిస్తున్న చిత్రం ‘1920 భీమునిపట్నం’. నరసింహ నంది తెరకెక్కిస్తున్న ఈ సినిమాని ఎస్‌.ఎస్‌.ఎల్‌.ఎస్‌ క్రియేషన్స్‌ పతాకంపై కంచర్ల అచ్యుతరావు నిర్మిస్తున్నారు. బ్రిటిష్‌ ప్రభుత్వ పోలీసు అధికారి పాత్రలో ఉపేంద్ర నటిస్తుండగా, స్వాతంత్య్ర సమరయోధుడి కుమార్తె పాత్రలో అపర్ణ కనిపించనుంది.

Updated : 02 Mar 2024 06:04 IST

కంచర్ల ఉపేంద్ర, అపర్ణా దేవి జంటగా నటిస్తున్న చిత్రం ‘1920 భీమునిపట్నం’. నరసింహ నంది తెరకెక్కిస్తున్న ఈ సినిమాని ఎస్‌.ఎస్‌.ఎల్‌.ఎస్‌ క్రియేషన్స్‌ పతాకంపై కంచర్ల అచ్యుతరావు నిర్మిస్తున్నారు. బ్రిటిష్‌ ప్రభుత్వ పోలీసు అధికారి పాత్రలో ఉపేంద్ర నటిస్తుండగా, స్వాతంత్య్ర సమరయోధుడి కుమార్తె పాత్రలో అపర్ణ కనిపించనుంది. ఈ సినిమా చిత్రీకరణ తాజాగా రామోజీ ఫిల్మ్‌ సిటీలో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి కంచర్ల అచ్యుతరావు క్లాప్‌నిచ్చారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ...‘సీతారాం, సుజాత మధ్య నడిచే ప్రేమకథను దర్శకుడు అద్భుతంగా తయారు చేశారు. 1920 నేపథ్యం కావడంతో ఆనాటి అంశాలను ప్రతిబింబించాల్సిన ఆవశ్యకత ఉండటంతో సంగీతానికి ఇళయరాజాను సంప్రదించామ’ని అన్నారు. ‘భారత స్వతంత్ర పోరాట నేపథ్యంలో చక్కటి భావోద్వేగాల మేళవింపుతో సినిమాని తెరకెక్కిస్తున్నాం నిజజీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా రూపొందించనున్నామ’ని అన్నారు దర్శకుడు.  


‘జిగేల్‌’ పాట

త్రిగుణ్‌, మేఘ చౌదరి ప్రధాన పాత్రలుగా మల్లి ఏలూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘జిగేల్‌’. ఈ రొమాంటిక్‌ కామెడీ సినిమాని శ్రీ ఇందిరా కంబైన్స్‌, యాపిల్‌ క్రియేషన్స్‌ పతాకాలపై డీవై జగన్‌మోహన్‌, అల్లం నాగార్జున సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరుగుతోంది. నాయకానాయికలు, ఇతర తారాగణంపై పాటని తెరకెక్కిస్తున్నారు. దీంతో చిత్రీకరణ పూర్తవుతుందని నిర్మాతలు తెలిపారు. ఇప్పటికే డబ్బింగ్‌ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా, ఇతర కార్యక్రమాలను త్వరలో పూర్తి చేసుకొని ఏప్రిల్‌లో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోందని దర్శకుడు మల్లి తెలిపారు. ఈ చిత్రానికి మంత్ర ఆనంద్‌ సంగీతం అందిస్తున్నారు.


అనుభవాన్ని రంగరించి... ‘రికార్డ్‌బ్రేక్‌’

నిర్మాతగానే కాదు... అప్పుడప్పుడూ మెగాఫోన్‌ చేతపట్టి దర్శకత్వం కూడా చేస్తుంటారు చదలవాడ శ్రీనివాసరావు. చిత్ర పరిశ్రమలో సుదీర్ఘమైన అనుభవం సంపాదించిన  ఆయనకి కథల ఎంపికలో మంచి అభిరుచి ఉంది. సామాజిక బాధ్యతని గుర్తు చేస్తూ, నిజ జీవితాలకి దగ్గరగా ఉంటాయి ఆయన సినిమాలు. మరోసారి ఆయన సమాజానికి ఉపయోగపడే కథాంశాన్ని ఎంచుకుని ‘రికార్డ్‌బ్రేక్‌’ చిత్రాన్ని తెరకెక్కించారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాని ఎనిమిది భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిహార్‌, నాగార్జున, రగ్ధా ఇఫ్తాకర్‌, సత్యకృష్ణ, సంజన, టి.ప్రసన్నకుమార్‌  తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా సెట్లో  నటీనటులకి సన్నివేశం వివరింస్తున్న దృశ్యమే ఇది. అనుభవాన్నంతా రంగరించి, తనదైన విజన్‌తో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నట్టు ఈ చిత్రం స్పష్టం చేస్తోంది.


రక్తంతో రంగులద్దుతా!

జీవితానికి దగ్గరగా అనిపించే పాటలెన్నో. మరి ఆ పాటలను వినిపించే సంగీతకారులకు ఓ అద్భుతమైన, బాధకరమైన జీవితం ఉంటుంది. అలాంటి ఓ కథనే ‘చమ్కీలా’తో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు బాలీవుడ్‌ దర్శకుడు ఇంతియాజ్‌ అలీ. ప్రముఖ పంజాబీ గాయకుడు అమర్‌ సింగ్‌ చమ్కీలా జీవితం ఆధారంగా తెరకెక్కనున్న చిత్రమది. దిల్జీత్‌ దోసాంజ్‌, పరిణీతి చోప్రా కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని ‘ఇష్క్‌ మిటాయే...’ అంటూ సాగే తొలి పాటను సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేసింది చిత్రబృందం. ‘నా ముందున్న అందమైన ప్రపంచం రంగు వెలిసిపోయింది. నా రక్తంతో దానికి తిరిగి రంగులద్దుతాను...’ అనే వ్యాఖ్యల్ని జోడించింది. మోహిత్‌ చౌహాన్‌ ఆలపించిన ఈ పాటకి ఇర్షద్‌ కమిల్‌ సాహిత్యం అందించారు. ఏఆర్‌ రెహమాన్‌ బాణీలు సమకూర్చారు. ఏప్రిల్‌ 12న ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని