గెలుపుతో ప్రతీకారం తీరాలి

భారత ఫుట్‌బాల్‌ జట్టు సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజేయడానికి ‘మైదాన్‌’తో సిద్ధమవుతున్నాడు అజయ్‌ దేవగణ్‌. ఆనాటి జట్టు దిగ్గజ కోచ్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీంగా ఆయన నటిస్తున్న చిత్రమే ‘మైదాన్‌’.

Published : 03 Apr 2024 01:05 IST

భారత ఫుట్‌బాల్‌ జట్టు సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజేయడానికి ‘మైదాన్‌’తో సిద్ధమవుతున్నాడు అజయ్‌ దేవగణ్‌. ఆనాటి జట్టు దిగ్గజ కోచ్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీంగా ఆయన నటిస్తున్న చిత్రమే ‘మైదాన్‌’. ఆయనకు జోడీగా ప్రియమణి కనిపిచనుండగా.. అమిత్‌ రవీంద్రనాథ్‌ శర్మ తెరకెక్కిస్తున్నారు. అజయ్‌ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘భారత ఫుట్‌బాల్‌ జట్టు పతకం గెలుస్తుందని భారత్‌లోనే ఎవరికీ నమ్మకం లేదు. కానీ మీరెలా నమ్ముతున్నారు..?’ అనే ప్రియమణి సంభాషణతో ట్రైలర్‌ మొదలవుతుంది. అజయ్‌ దేశమంతా తిరుగుతూ ఒక్కో ఆటగాణ్ని ఎంపిక చేయడం.. తన సర్వశక్తులూ ధారపోసి మేటి జట్టుగా తీర్చిదిద్దడం.. ఆఖరికి ఆ జట్టు.. అప్రతిహత విజయాలతో ఏషియన్‌ గేమ్స్‌లో పతకాలు గెలవడం, 1956 ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలవడం.. వరుసగా చూపించారు. ‘నేను దేశం గురించి మాట్లాడటానికి ఇక్కడికొచ్చాను. కానీ మనం ఇక్కడ బెంగాల్‌, హైదరాబాద్‌ గురించే మాట్లాడుకోవాల్సి రావడం దురదృష్టకరం’, ‘ఈ జనం నుంచి మీకు ప్రోత్సాహం దక్కుతుందని నమ్మకం పెట్టుకోవద్దు. చెవులు మూసుకొని మీ ఆట మీరు ఆడండి’, ‘నాకు మాటలొద్దు.. గెలుపుతో ప్రతీకారం కావాలి’ లాంటి డైలాగులు చిత్రంలోని భావోద్వేగాల గాఢతని తెలియజేస్తున్నాయి. జీ స్టూడియోస్‌, బోనీ కపూర్‌, అరుణవ జాయ్‌ సేన్‌గుప్తా, ఆకాశ్‌ చావ్లా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్‌ రెహమాన్‌ స్వరాలు సమకూర్చుతున్నారు.


‘బేబీ జాన్‌’ చాలా కష్టమైన చిత్రీకరణ

బాలీవుడ్‌ కథానాయకుడు వరుణ్‌ ధావన్‌ యాక్షన్‌ సినిమాల పట్ల తనకున్న ప్రేమను ఎప్పుడూ వ్యక్తపరుస్తుంటాడు. పూర్తి స్థాయి యాక్షన్‌ చిత్రాల్లో నటించాలన్న తన కల ‘బేబీ జాన్‌’తో నెరవేరింది. కాలీస్‌ తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు అట్లీ, మురాద్‌ ఖేతాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో హిందీలో అడుగుపెట్టనుంది కీర్తి సురేశ్‌. కీలక పాత్రలో వామికా గబ్బి కనిపించనుంది. తాజాగా వరుణ్‌ సామాజిక మాధ్యమాల వేదికగా తన ఫొటోని పంచుకున్నాడు. సినిమా పేరున్న దుస్తులతో, నెత్తురోడుతున్న నుదుటితో ఉన్న ఫొటో ఆసక్తిగా కనిపిస్తోంది. ‘‘బేబీ జాన్‌’ చిత్రీకరణ 70వ రోజు. సూర్యుడు ఉదయించే వరకూ అవిశ్రాంతంగా షూటింగ్‌లో పాల్గొంటూనే ఉన్నాం. నేను చేసిన కష్టతరమైన చిత్రీకరణలలో ఇది ఒకటి’ అంటూ వ్యాఖ్యల్ని జోడించాడు.


యుద్ధం ముగిసింది

తేడాది ‘2018’తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు మలయాళ కథానాయకుడు టోవినో థామస్‌. భిన్నమైన కథనాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈయన ప్రస్తుతం ‘ఐడెంటిటీ’ చిత్రంతో బిజీగా ఉన్నారు. టోవినో ప్రధాన పాత్రలో అనాస్‌ ఖాన్‌, అఖిల్‌ పాల్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. త్రిష కథానాయిక. తాజాగా ఈ సినిమాలోని యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ పూర్తైనట్లు టోవినో సామాజిక మాధ్యమాల వేదికగా తెలుపుతూ ఫొటోని పంచుకున్నారు. ‘యుద్ధం ముగిసింది. యానిక్‌ బెన్‌ పర్యవేక్షణలో కొన్ని అద్భుతమైన యాక్షన్‌ సన్నివేశాలను ముగించాము. ఆకట్టుకునే యాక్షన్‌ రైడ్‌ మీ ముందుకు రాబోతుంది’ అంటూ వ్యాఖ్యల్ని జోడించారు. మందిరా బేడీ, వినాయ్‌ రాయ్‌లు కీలక పాత్రల్లో నటించనున్నారు.


ప్రేమా.. నీవెక్కడ?

తొమ్మిదేళ్ల తర్వాత ప్రముఖ గాయకుడు లక్కీ అలీ తన గళాన్ని బాలీవుడ్‌లో వినిపించారు. ప్రతీక్‌గాంధీ, విద్యాబాలన్‌ జంటగా తెరకెక్కుతున్న ‘దో ఔర్‌ దో ప్యార్‌’లో ఆయన పాడిన ‘తూ హై కహా..’ అంటూ హృద్యంగా సాగే ఈ గీతాన్ని మంగళవారం విడుదల చేశారు. ది లోకల్‌ ట్రైన్‌ ఈ పాటని రచించి, స్వరాలు సమకూర్చారు. నాయికానాయకులైన జంట పాతరోజుల్లోని తమ మధ్య జ్ఞాపకాలను గుర్తు చేసుకునేలా ఈ మెలోడీ గీతం సాగుతుంది. ఈ చిత్రానికి శిరీష గుహ ఠాకూర్తా దర్శకురాలు. ఇలియానా, సెంథిల్‌ రామమూర్తి ఇతర కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్‌ 19న ప్రేక్షకుల ముందుకొస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని