Cinema News: కొత్త పాత్రలు పిలుస్తున్నాయ్‌

కొత్త ప్రయాణం మొదలు పెట్టేందుకు పలువురు కథానాయకులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఎప్పట్నుంచో చేస్తున్న సినిమాల్ని దాదాపు ముగింపు దశకు చేర్చేశారు.

Updated : 06 Apr 2024 02:09 IST

కొత్త ప్రయాణం మొదలు పెట్టేందుకు పలువురు కథానాయకులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఎప్పట్నుంచో చేస్తున్న సినిమాల్ని దాదాపు ముగింపు దశకు చేర్చేశారు. వీళ్లంతా ఇకనుంచి పూర్తయిన ఆయా సినిమాల ప్రచార హంగామాతోనూ... మరోవైపు కొత్త సినిమాల ప్రయాణంతోనూ బిజీగా గడపనున్నారు.  

పాన్‌ ఇండియా సినిమా ట్రెండ్‌ మొదలయ్యాక ఒకొక్క సినిమా కోసం కథానాయకులు సుదీర్ఘంగా ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఇదివరకు ఏడాదికి ఒకట్రెండు సినిమాలతో సందడి చేసిన కథానాయకులు... ఇప్పుడు ఒక్కో సినిమా కోసం రెండు మూడేళ్లు కేటాయించాల్సి వస్తోంది. విడుదల తేదీలు పదే పదే మారిపోతుంటాయి. చిత్రీకరణల్లోనూ, నిర్మాణానంతర పనుల్లోనూ జరుగుతున్న జాప్యమే అందుకు కారణం. అభిమానులేమో తమ కథానాయకుడి సినిమా విడుదల ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటారు. సామాజిక మాధ్యమాల ద్వారా కథానాయకుల్ని, దర్శకనిర్మాతల్ని తొందర పెడుతుంటారు. అయితే ఈమధ్య చిత్రసీమలో పరిణామాల్ని గమనిస్తే... పాన్‌ ఇండియా సినిమాల్లోనూ వేగం కనిపిస్తోంది. వడి వడిగా ముగింపు దశకు చేరుకుంటున్నాయి. ప్రభాస్‌ ‘కల్కి 2898 ఎ.డి’, రామ్‌చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’, ఎన్టీఆర్‌ ‘దేవర’, అల్లు అర్జున్‌ ‘పుష్ప 2’, రామ్‌ ‘డబుల్‌ ఇస్మార్ట్‌’... ఇలా చాలా సినిమాల ప్రయాణం చివరి దశకు చేరుకుంది. ఇవి ఎప్పట్నుంచో చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఈ సినిమాలన్నీ పూర్తయితే, ఈ కథానాయకులంతా కూడా మరో దఫా కొత్త సినిమాలకి సంబంధించిన కొత్త కబుర్లతో అభిమానుల్లో జోష్‌ పెంచనున్నారు.

కథానాయకులు ఏకకాలంలో రెండు మూడు సినిమాలకి పచ్చజెండా ఊపుతున్నారు. ఒక సినిమా పూర్తవ్వగానే మరో సినిమా కోసం రంగంలోకి దిగుతున్నారు. ప్రభాస్‌, పవన్‌కల్యాణ్‌ తదితర కథానాయకులైతే ఏకకాలంలో రెండు మూడు సినిమాల్ని సెట్స్‌పైకి తీసుకెళుతున్నారు. ‘కల్కి 2898 ఎ.డి’ని దాదాపుగా పూర్తి చేసిన ప్రభాస్‌, త్వరలోనే ‘ది రాజాసాబ్‌’, ‘సలార్‌ 2’ సినిమాలపై దృష్టి పెట్టనున్నారు. పవన్‌కల్యాణ్‌ ‘ఓజీ’ సెప్టెంబరు 27న విడుదల ఖాయమని ఇటీవలే నిర్మాత ప్రకటించారు. మరోవైపు పవన్‌కల్యాణ్‌ చేతిలో ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ చిత్రం ఉంది. చాలా రోజులుగా ఒకే సినిమాతో సెట్స్‌పై ఉన్న రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌ల కోసం కొత్త కథలు, పాత్రలు ఎదురు చూస్తున్నాయి. రామ్‌చరణ్‌ ‘గేమ్‌ఛేంజర్‌’ తర్వాత బుచ్చిబాబు సానా దర్శకత్వంలో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే సినిమాని లాంఛనంగా ప్రారంభించారు. వచ్చే నెల నుంచే ఆ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనే లక్ష్యంతో సినిమాని పట్టాలెక్కిస్తున్నారు. ఎన్టీఆర్‌ ‘దేవర’ ఈ నెలలోనే టాకీ భాగం చిత్రీకరణని పూర్తి చేసుకోనుంది. మరోవైపు ఆయన ఈ నెల నుంచే బాలీవుడ్‌ చిత్రం ‘వార్‌ 2’ కోసం రంగంలోకి దిగుతున్నారు.

అల్లు అర్జున్‌ ‘పుష్ప 2’ చిత్రీకరణని మే నెలాఖరులోపు పూర్తి చేయనున్నట్టు తెలుస్తోంది. ఆగస్టు 15 అంటూ మరోసారి విడుదల తేదీని ఖరారు చేస్తూ పోస్టర్‌ని విడుదల చేసింది. ‘పుష్ప2’ ముగింపు దశకు చేరుకోవడంతో, ఆయన తదుపరి చేయనున్న సినిమా గురించి చర్చ ఊపందుకుంది. బన్నీ తదుపరి చిత్రం దాదాపు అట్లీ దర్శకత్వంలోనే రూపొందనుంది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఆ తర్వాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమా కూడా చేయనున్నారు. మరో అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో రూపొందనున్న కొత్త సినిమా కోసం రంగంలోకి దిగారు. ఈ నెలలోనే ఆ సినిమాకి సంబంధించిన కొత్త సంగతులు వినిపించే అవకాశాలున్నాయి. ఇందులో ఓ కొత్త లుక్‌లో మహేశ్‌ కనిపించనున్నారని, అందుకోసం సన్నద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.  

వేసవి తర్వాత చిత్రసీమలో కోలాహలం

రామ్‌, నాగచైతన్య తదితర యువ కథానాయకులు కూడా సెట్స్‌పై ఉన్న సినిమాల్ని పూర్తి చేసి కొత్త సినిమాలతో రంగంలోకి దిగేందుకు ప్రయత్నిస్తున్నారు. నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న ‘తండేల్‌’  చిత్రీకరణ సింహభాగం పూర్తి చేసుకుంది. ఆయన కార్తీక్‌ దండు దర్శకత్వంలో తదుపరి సినిమాని చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. రామ్‌ కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ దాదాపు పూర్తయింది. కొంత టాకీ, కొన్ని పాటలు మాత్రమే చిత్రీకరించాల్సి ఉంది. నాని కథానాయకుడిగా నటిస్తున్న ‘సరిపోదా శనివారం’ కూడా ఆగస్టు 29న విడుదల ఖరారైంది. ఇప్పటికే ఆయన ‘దసరా’ కలయికలో సినిమాని ప్రకటించారు. ‘ఫ్యామిలీస్టార్‌’తో శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన విజయ్‌ దేవరకొండ... వెంటనే గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా కోసం రంగంలోకి దిగనున్నారు. స్పై థ్రిల్లర్‌ కథతో భారీ హంగులతో రూపొందనున్న సినిమా ఇది. ఈ వేసవి తర్వాత పలువురు అగ్ర తారల సినిమాల విడుదలతోపాటు, వాళ్ల కొత్త సినిమాల చిత్రీకరణలతో చిత్రసీమలో కోలాహలం కనిపించనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని