కలిశారు తొలిసారి

విజయవంతమైన కలయికలకు చిత్రసీమలో ఓ ప్రత్యేకమైన మార్కెట్‌ ఉంది. బాక్సాఫీస్‌ లెక్కల్ని బలంగా ప్రభావితం చేసే ఈ కలయికలపై ఇటు సినీప్రియులూ, అటు వ్యాపార వర్గాలు ఎంతో ఆసక్తి కనబరుస్తుంటారు.

Published : 15 Apr 2024 06:06 IST

అయినా.. అంచనాలు పైౖపైకి

విజయవంతమైన కలయికలకు చిత్రసీమలో ఓ ప్రత్యేకమైన మార్కెట్‌ ఉంది. బాక్సాఫీస్‌ లెక్కల్ని బలంగా ప్రభావితం చేసే ఈ కలయికలపై ఇటు సినీప్రియులూ, అటు వ్యాపార వర్గాలు ఎంతో ఆసక్తి కనబరుస్తుంటారు. ప్రస్తుతం తెలుగులో సెట్స్‌పై ముస్తాబవుతున్న పలు క్రేజీ ప్రాజెక్ట్‌ల్లో ఈ తరహా కలయికలే ఎక్కువ ఉన్నాయి. అయితే వీటికి దీటుగా అదే స్థాయిలో ఆకర్షిస్తూ.. అంచనాలు పెంచేస్తున్న తొలి కలయికలూ అనేకం తెలుగు చిత్రసీమలో కనిపిస్తున్నాయి. వీటిలో కొన్ని కాంబినేషన్లు ఇప్పటికే పట్టాలెక్కగా.. మరికొన్ని సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. మరి తొలిసారి జట్టు కట్టి ఆకర్షిస్తున్న ఆ కలయికలేవి? ఆ చిత్ర సంగతులేంటి? చూసేద్దాం పదండి..

కప్పుడు కొత్త కలయిక విషయంలో అగ్రతారలు ఆచితూచి వ్యవహరించేవారు. ముఖ్యంగా తమ స్టార్‌డమ్‌, ఇమేజ్‌ను సమంగా బ్యాలెన్స్‌ చేస్తూ అభిమానుల అంచనాలకు తగ్గట్లుగా సినిమాలు చేసే సీనియర్‌ దర్శకుల వైపే మొగ్గు చూపేవారు. కానీ, ఇప్పుడా లెక్కలన్నీ మారిపోయాయి. ఇమేజ్‌ సంకెళ్లను తెంచుకొని అనుభవాల లెక్కలు పక్కకు నెట్టి కొత్తతరం దర్శకులతో ప్రయాణం చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఫలితంగా తెరపై మునుపెన్నడూ చూడని విభిన్నమైన కలయికలకు  అవకాశం దొరుకుతోంది.

చిరంజీవి చిత్రసీమలోకి పునరాగమనం చేసినప్పటి నుంచి తన కెరీర్‌ను వైవిధ్యభరితంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నమే చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎక్కువగా యువ దర్శకులతో కలిసి పని చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీనికి ఫలితంగానే ‘సైరా నరసింహరెడ్డి’, ‘గాడ్‌ఫాదర్‌’, ‘వాల్తేరు వీరయ్య’ విజయాలు దక్కాయి. ఇప్పుడీ క్రమంలోనే మరో యువ దర్శకుడు వశిష్ఠతో ‘విశ్వంభర’ను పట్టాలెక్కించారు చిరు. ‘బింబిసార’ విజయం తర్వాత వశిష్ఠ రూపొందిస్తున్న మరో సోషియో ఫాంటసీ సినిమా కావడం.. ‘అంజి’ తర్వాత చిరు మళ్లీ ఈ తరహా కథలో నటిస్తుండటంతో దీనిపై అంచనాల్ని రెట్టింపు చేస్తోంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత చిరు నటించే చిత్రమేదన్నది ఇంకా ఖరారు కాకున్నా.. దాదాపు అరడజను మందికి పైగా దర్శకులు కథలతో సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో హరీశ్‌ శంకర్‌, మారుతి, కల్యాణ్‌ కృష్ణ, అనుదీప్‌, త్రినాథరావు నక్కిన తదితరుల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.


నాగ్‌ కోసం మరో ఇద్దరు..

కొత్తదనాన్ని అందిపుచ్చుకోవడంలో.. కొత్త ప్రతిభను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు నాగార్జున. ఇప్పుడాయన తొలిసారి శేఖర్‌ కమ్ములతో జట్టు కట్టి ‘కుబేర’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత ఆయన చేయనున్న సినిమా కూడా కొత్త కలయికలోనే రూపొందనుంది. ఈ చిత్రంతో తమిళ యువ దర్శకుడు నవీన్‌ తెలుగు తెరకు పరిచయం కానున్నారు.  ఈ సినిమాని కె.ఇ.జ్ఞానవేల్‌ రాజా నిర్మించనున్నారు.  ఇక నాగ్‌ దీంతో పాటే సుబ్బు అనే మరో కొత్త దర్శకుడి కథకు పచ్చజెండా ఊపినట్లు ప్రచారం వినిపిస్తోంది. ఒకవేళ అదే నిజమైతే తన నుంచి మరో కొత్త కలయికను చూసే అవకాశం దొరుకుతుంది.


ప్రభాస్‌.. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా!

నాగ్‌అశ్విన్‌ ‘కల్కి 2898ఎ.డి’, మారుతి ‘రాజాసాబ్‌’, సందీప్‌రెడ్డి వంగా ‘స్పిరిట్‌’.. ఇలా ప్రస్తుతం ప్రభాస్‌ చేస్తున్న సినిమాలన్నీ తొలి కలయికలో రూపొందుతోన్నవే. ఇప్పుడీ జాబితాలో కొత్తగా హను రాఘవపూడి ప్రాజెక్ట్‌ వచ్చి చేరింది. ‘సీతారామం’ విజయం తర్వాత హను చేయనున్న సినిమా ఇది. ఇప్పుడాయన ప్రభాస్‌ కోసం చారిత్రక అంశాలతో నిండిన ఓ ఫిక్షనల్‌ పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాను సిద్ధం చేశారు. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ ప్రాజెక్ట్‌ కోసం ఇప్పటికే సంగీత దర్శకుడు విశాల్‌ చంద్రశేఖర్‌ మూడు పాటలు కూడా సిద్ధం చేశారు. మరి హను ఈ చిత్రంలో ప్రభాస్‌ను ఎలా చూపించనున్నారు.. తనతో ఎలాంటి సాహసాలు చేయించనున్నాడో తెలియాలంటే ఇంకొన్నాళ్లు వేచి చూడక తప్పదు.


రవితేజ.. నానిల జోరు

ప్రస్తుతం వరుసగా కొత్త కలయికల్ని ఖరారు చేస్తూ.. సినీప్రియుల్ని ఊరిస్తున్న కథానాయకుల్లో రవితేజ, నాని ముందు వరుసులో ఉన్నారు. వీళ్లిద్దరూ కొత్త ప్రతిభను ప్రోత్సహించడంలో ముందుంటారన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రవితేజ చేస్తున్న ‘మిస్టర్‌ బచ్చన్‌’.. ఆ మధ్య చేసిన ‘వాల్తేరు వీరయ్య’ మినహా ఇటీవల కాలంలో ఆయన నుంచి వచ్చిన సినిమాలన్నీ తొలి కలయికల్లో రూపొందినవే. అందులో ఇద్దరు కొత్త దర్శకుల సినిమాలూ ఉన్నాయి. ఆయన ఇప్పుడిదే పంథాలో భాను భోగవరపు అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. ఇది రవితేజకు 75వ చిత్రం. పూర్తిగా తెలంగాణ నేపథ్యంలో సాగే ఓ ఆసక్తికర కథాంశంతో రూపొందనున్న ఈ చిత్రంలో లక్ష్మణ్‌ భేరి అనే మాస్‌ పాత్రలో ప్రేక్షకుల్ని అలరించనున్నారు రవితేజ. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. రవితేజ దీని తర్వాత అనుదీప్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారని తెలిసింది. ఇదీ వీళ్లిద్దరికి తొలి కాంబోనే కానుంది. ఇక నాని విషయానికొస్తే.. తను ప్రస్తుతం ‘సరిపోదా శనివారం’తో సెట్స్‌పై బిజీగా ఉన్నారు. దీని తర్వాత సుజీత్‌ దర్శకత్వంలోనూ.. అలాగే ‘బలగం’ దర్శకుడు వేణు యెల్దండితోనూ వరుస సినిమాలు చేయనున్నారు.


మహేశ్‌.. అంచనాలు పెంచే కలయిక

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాతో జాతీయ స్థాయిలోనే కాక అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు సాధించుకున్నారు దర్శకుడు రాజమౌళి. ఇప్పుడాయన తొలిసారి కథానాయకుడు మహేశ్‌బాబుతో కలిసి ఓ భారీ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కించనున్న సంగతి తెలిసిందే. దీన్ని జక్కన్న ఓ అంతర్జాతీయ సినిమాలా భారీ హంగులతో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం కోసం తన లుక్‌ను మార్చుకునే పనిలో ఉన్నారు మహేశ్‌. శరవేగంగా పూర్వ నిర్మాణ పనులు జరుగుతున్న ఈ సినిమా త్వరలోనే చిత్రీకరణ ప్రారంభించుకోనుంది.


వీళ్లూ ఉన్నారు..

అగ్ర కథానాయకుడు బాలకృష్ణ దర్శకుడు బాబీతో కలిసి ఓ యాక్షన్‌ చిత్రాన్ని పట్టాలెక్కించారు. ఇది ఏడాది ద్వితీయార్ధంలోనే సినీప్రియుల ముందుకు రానుంది. విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్‌ తిన్ననూరితో ఓ స్పై థ్రిల్లర్‌ చేస్తున్నారు. ఇదీ తొలి కలయికనే. ఇక ఇప్పటికే పట్టాలెక్కిన పవన్‌ కల్యాణ్‌ - సుజీత్‌ల ‘ఓజీ’, పవన్‌ - క్రిష్‌ల ‘హరిహర వీరమల్లు’, రామ్‌చరణ్‌ - బుచ్చిబాబుల సినిమా, వరుణ్‌తేజ్‌ - కరుణ కుమార్‌ల ‘మట్కా’.. ఇవన్నీ కొత్త కాంబినేషన్లే. వీటితో పాటు అల్లు అర్జున్‌ - అట్లీ, వరుణ్‌తేజ్‌ - మేర్లపాక గాంధీ, నాగచైతన్య - కార్తీక్‌ దండు.. తదితర కాంబోలు సరికొత్త వినోదానికి సంకేతాలిస్తూ సినీప్రియుల్ని ఊరిస్తున్నాయి. మరి ఈ కలయికలన్నీ ప్రేక్షకుల్ని ఎలా అలరిస్తాయన్నది వేచి చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని