రూహ్‌బాబాతో సీనియర్‌ నాయికల ఆటాపాటా

కార్తిక్‌ ఆర్యన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘భూల్‌ భులయ్యా 3’. అనీస్‌ బాజ్మీ తెరకెక్కిస్తున్నారు. త్రిప్తి దిమ్రి కథానాయిక. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.

Published : 21 Apr 2024 00:57 IST

కార్తిక్‌ ఆర్యన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘భూల్‌ భులయ్యా 3’. అనీస్‌ బాజ్మీ తెరకెక్కిస్తున్నారు. త్రిప్తి దిమ్రి కథానాయిక. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాలో సీనియర్‌ నాయికలు విద్యాబాలన్‌, మాధురి దీక్షిత్‌లతో ఓ ప్రత్యేక గీతాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. ‘‘అమి జే తోమర్‌’ అనే ప్రత్యేక గీతంలో విద్యాబాలన్‌, మాధురి ఆడిపాడనున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ పాటలో రూహ్‌బాబా చేసే సందడి ఈ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతుంది. రెట్టింపు వినోదంతో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతుంది చిత్రబృందం’’ అని సన్నిహిత వర్గాలు తెలిపాయి.


అందుకే సాహసాలు చేస్తా

‘‘హరి దర్శకత్వంలో ఇదివరకు ‘భరణి’, ‘పూజ’ చేశా. అవి పెద్ద విజయాల్ని అందుకున్నాయి. అదే తరహాలో ‘రత్నం’ ఓ మంచి కుటుంబ వినోదాత్మక చిత్రంగా ప్రేక్షకుల్ని అలరిస్తుంద’’న్నారు విశాల్‌. ఆయన కథానాయకుడిగా, హరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రత్నం’. ప్రియా భవానీ శంకర్‌ కథానాయిక. కార్తికేయన్‌ సంతానం నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఈ నెల 26న శ్రీ సిరి సినిమాస్‌ పతాకంపై సీహెచ్‌ సతీష్‌కుమార్‌, కె.రాజ్‌కుమార్‌ విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రబృందం శనివారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించింది. విశాల్‌ మాట్లాడుతూ ‘‘నన్ను నమ్మి డబ్బు పెట్టిన నిర్మాత బాగుండాలనేదే నా ప్రథమ కర్తవ్యం. అందుకే సినిమా కోసం సాహసాలు చేస్తూ కష్టపడుతుంటా. ప్రేక్షకుడు పెట్టే డబ్బులకి సరిపడా వినోదం ఇస్తాం. కచ్చితంగా ‘రత్నం’  పైసా వసూల్‌ చిత్రం అవుతుంది. ఈ చిత్రంతో అందరికీ లాభాలు వస్తాయి’’ అన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో కొత్త ఓటర్లంతా తప్పకుండా పాల్గొని ఓటు హక్కుని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.


సీత ఎప్పటికీ రాముడిదే

సుమన్‌ తేజ్‌, గరీమ చౌహాన్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘సీతా కళ్యాణ వైభోగమే’. సతీష్‌ పరమవేద తెరకెక్కిస్తున్నారు. రాచాల యుగంధర్‌ నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా టీజర్‌ను మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి విడుదల చేసి సినిమా విజయవంతం కావాలని కోరుకున్నారు. ‘నల్ల నల్ల నీళ్లలోనా నా తెల్లని చేప.. ’అనే నేపథ్య గీతంతో ప్రారంభమైన ఈ టీజర్‌.. యాక్షన్‌ సన్నివేశాలతో ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ‘సీతమ్మ లేని గుడి రాముడి గుడే కాదు’, ‘సీత ఎప్పటికీ రాముడిదే’ అంటూ చివర్లో హీరో చెప్పిన సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ నెల 26న విడుదల కానుందీ చిత్రం.


ఆ అమ్మాయే పెళ్లాం అయితే..!

‘హను - మాన్‌’ తరహాలోనే ‘డార్లింగ్‌’ కూడా పెద్ద విజయం సాధించాలని, ఈ సంస్థ నుంచి మరిన్ని సినిమాలు రావాలని కోరుకుంటున్నా అన్నారు ప్రశాంత్‌ వర్మ. ఆయన ముఖ్య
అతిథిగా  శనివారం హైదరాబాద్‌లో ‘డార్లింగ్‌’ గ్లింప్స్‌ విడుదల కార్యక్రమం జరిగింది. ప్రియదర్శి, నభా నటేశ్‌ జంటగా నటిస్తున్న చిత్రమిది. ‘..వై దిస్‌ కొలవెరి?’ అనేది ఉపశీర్షిక. అశ్విన్‌రామ్‌ దర్శకుడు. ‘హను - మాన్‌’తో విజయాన్ని అందుకున్న కె.నిరంజన్‌రెడ్డి నిర్మిస్తున్న చిత్రమిది. చైతన్య సమర్పిస్తున్నారు. ‘ఓ అమ్మాయి ప్రేమికురాలిగా ఉన్నప్పుడు ఎంతో అందంగా, మనల్ని అర్థం చేసుకుంటుంది. ఆ పిల్లే పెళ్లాం అయితే మన జీవితాల్ని తలకిందులు చేసి తాట తీస్తుందని’ ప్రియదర్శి చెప్పే సంభాషణతో గ్లింప్స్‌ సరదాగా సాగుతుంది. కథానాయకుడు ప్రియదర్శి మాట్లాడుతూ ‘‘ప్రభాస్‌ అన్నని ప్రేమతో పిలుచుకునే మాట మా సినిమాకి పేరుగా పెట్టుకోవడం గర్వకారణం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో మోహనకృష్ణ ఇంద్రగంటి, కరుణకుమార్‌, హర్ష కొనుగంటి, సునీల్‌ నారంగ్‌, గాంధీ, వివేక్‌ సాగర్‌ తదితరులు పాల్గొన్నారు.


మనసుల్ని హత్తుకునేలా కథ చెప్పాం

భావోద్వేగాల్ని ఓ సరికొత్త కోణంలో ఆవిష్కరించిన చిత్రమే మా ‘శబరి’ అన్నారు మహేంద్రనాథ్‌ కూండ్ల. ఆయన నిర్మాతగా, వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన చిత్రం ‘శబరి’. అనిల్‌ కాట్జ్‌ దర్శకుడు. తెలుగుతోపాటు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మే 3న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ‘‘ఒక బిడ్డ కోసం తల్లి పడిన తపనని ఆధారంగా చేసుకుని, సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా చేశాం. ప్రతి ఒక్కరికీ కనెక్ట్‌ అయ్యే అంశం ఇందులో ఉంది. ఇలాంటి సినిమాల్లో కథల్ని ఎంత బాగా చెబితే ప్రేక్షకులకు అంతగా కనెక్ట్‌ అవుతుంది. మనసుల్ని హత్తుకునేలా ఇందులో కథ చెప్పాం’’ అన్నారు మహేంద్రనాథ్‌ కూండ్ల.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని