ఉత్తమ దర్శకుడు.. కరణ్‌ జోహార్‌

దర్శకనిర్మాత కరణ్‌జోహార్‌ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్‌షిప్‌ కాన్‌క్లేవ్‌లో భారత ఉపరాష్ట్రపతి...

Published : 25 Apr 2024 00:55 IST

ర్శకనిర్మాత కరణ్‌జోహార్‌ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్‌షిప్‌ కాన్‌క్లేవ్‌లో భారత ఉపరాష్ట్రపతి జగ్దీప్‌ ధన్‌కర్‌ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. ‘రాకీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ’ చిత్రానికి గాను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్టు నిర్వాహకులు ప్రకటించారు. ఈ అవార్డు స్వీకరిస్తూ తన సినీ జీవితంలోని ఎత్తుపల్లాల గురించి చెప్పారు కరణ్‌. ఆదిత్య చోప్రా, షారుక్‌ ఖాన్‌లు తన సినీ కెరీర్‌కి మూలస్తంభాల్లా నిలిచారని ఈ సందర్భంగా వారిద్దరికీ కృతజ్ఞతలు తెలిపారు.


‘లవ్‌ మీ’ విడుదల ఖరారు

శిష్‌, వైష్ణవి చైతన్య జంటగా తెరకెక్కిన ‘లవ్‌ మీ’ విడుదల ఖరారైంది. వచ్చే నెల 25న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అరుణ్‌ భీమవరపు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ పతాకంపై హర్షిత్‌ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మిస్తున్నారు. బుధవారం విడుదల తేదీని ప్రకటిస్తూ, ఓ కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది చిత్రబృందం.

‘‘ఓ ఆత్మ ప్రేమకథతో రూపొందుతున్న చిత్రమిది. ప్రేక్షకుల వెన్నులో వణుకు పుట్టించే సన్నివేశాలు ఉన్నాయి. పీసీ శ్రీరామ్‌ సినిమాటోగ్రఫీ, కీరవాణి సంగీతం చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయ’’ని సినీవర్గాలు తెలిపాయి.


ఏఐతో అట్లాస్‌ పోరాటం

మానవాళిని అంతం చేయాలనుకుంటోంది కృత్రిమ మేధ రోబో హార్లన్‌. ఆ దుష్ట పన్నాగాన్ని అడ్డుకునే మిషన్‌ని తలకెత్తుకుంటుంది అత్యంత తెలివైన డేటా ఎనలిస్ట్‌ అట్లాస్‌ షెఫర్డ్‌. ఆమెకు అండగా మరో ఏఐ స్మిత్‌ బయల్దేరతాడు. కృత్రిమ మేధపై ఏమాత్రం నమ్మకం లేని అట్లాస్‌ అపనమ్మకంతోనే స్మిత్‌తో కలిసి పోరాటం కొనసాగిస్తుంది. ఈ క్రమంలో వాళ్లు అనుకున్న లక్ష్యం చేరుకున్నారా? అంటే ‘అట్లాస్‌’ చూడాల్సింది. అందాల నాయిక, గాయని జెన్నిఫర్‌ లోపెజ్‌ ప్రధాన పాత్రధారిగా రూపొందుతున్న హాలీవుడ్‌ చిత్రమిది. బ్రాడ్‌ పేటన్‌ తెరకెక్కిస్తున్నారు. హార్లన్‌ అనే ప్రతినాయకుడి పాత్రని సిము లియూ పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ‘‘ఏజెంట్‌ అట్లాస్‌ షెఫర్డ్‌.. హార్లన్‌ అనే ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ను వేటాడుతూ తన జీవితాన్ని త్యాగం చేసింది’, ‘హార్లన్‌ను నిజంగా పట్టుకోవాలనుకుంటే ఈ రహస్య మిషన్‌లో నేను భాగం కావాల్సిందే. నా శక్తియుక్తుల్ని వాడాల్సిందే’’ లాంటి సంభాషణలతో ఆద్యంతం ఆసక్తిగా సాగుతోంది ఈ ట్రైలర్‌. ప్రధానంగా దుష్ట ఏఐ నుంచి మానవాళిని రక్షించడానికి అట్లాస్‌ షెఫర్డ్‌ చేసే సాహసాలు ఇందులో చూపించారు. సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ మే 24న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతోంది.


సేతుపతి కుటుంబ వినోదం

విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి మరో కొత్త సినిమాకు సంతకం చేశారు. తన తదుపరి ప్రాజెక్టుకు పాండిరాజ్‌ దర్శకత్వం వహించనున్నారు. ఇది పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుంది. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాస్కరన్‌ నిర్మించే ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నట్టు సమాచారం. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నట్టు సన్నిహితవర్గాలు తెలిపాయి. విజయ్‌ సేతుపతి ప్రస్తుతం ‘మహారాజా’, ‘విడుదలై 2’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.


నాన్నే హీరో

శివాజీరాజా ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న చిత్రం ‘నాన్నా మళ్ళీ రావా..!’ నిర్దేశ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. డి.ఉమామహేశ్వరరావు నిర్మాత. ఈ సినిమా పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. టి.ప్రసన్నకుమార్‌, బాబ్జీ, వై.సురేందర్‌రెడ్డి, నరేశ్‌ వర్మ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నటుడు శివాజీరాజా మాట్లాడుతూ ‘‘కుటుంబసమేతంగా చూడదగ్గ చిత్రమిది. భావోద్వేగాలు మిళితమైన ఈ తరహా సినిమాలు అరుదుగా వస్తుంటాయి. తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంద’’న్నారు. ‘‘ప్రతి ఒక్కరి జీవితంలో నిజమైన సూపర్‌ హీరో అంటే నాన్నే. వెంకన్న అనే ఓ తండ్రి పాత్రే నాతో ఈ కథ రాయించింది. ప్రతి ఒక్కరిలోనూ భావోద్వేగాలు నింపే చిత్రమిది’’ అన్నారు దర్శకుడు. ఈ కార్యక్రమంలో రోసిరెడ్డి, సినిటేరియా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు