ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?

‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు.

Published : 25 Apr 2024 01:09 IST

‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. ఆ ప్రేమే నన్ను హైదరాబాద్‌కి మారిపోయేలా చేసింది. ‘శబరి’తో మరోసారి తెలుగువాళ్ల మనసుల్ని గెలుస్తాననే నమ్మకం ఉంది’’ అన్నారు వరలక్ష్మి శరత్‌కుమార్‌. ఇటీవల ఆమె ప్రధాన పాత్రధారిగా ‘శబరి’ తెరకెక్కింది. అనిల్‌ కాట్జ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 3న పాన్‌ ఇండియా స్థాయిలో  ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్బంగా వరలక్ష్మి శరత్‌కుమార్‌ బుధవారం హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...

‘‘ఇదొక సైకలాజికల్‌ థ్రిల్లర్‌ కథ. అంతకుముందు నేను చేసిన పాత్రలతో పోలిస్తే కొత్తగా అనిపించింది. భర్త నుంచి వేరు పడిన ఓ మహిళ, తన కూతురిని కాపాడుకోవడం కోసం ఏం చేసిందనేదే ఈ చిత్రం. ఇదివరకు యాక్షన్‌ ప్రధానంగా సాగే పాత్రలు చేశా కానీ ఇందులో చేసిన యాక్షన్‌ భిన్నం. ఓ సగటు తల్లి ఎలా పోరాటం చేస్తుందో, అలాగే ఉంటుంది నా పాత్ర’’.

  • ‘‘నేనొక నటిని. మనసుకు నచ్చిన ఏ పాత్రనైనా చేయడానికి సిద్ధమే. తల్లిగా నటించడం నాకు కొత్త కాదు. తమిళంలో నేను చేసిన తొలి చిత్రంలోనే ఓ బిడ్డకి తల్లిగా నటించా. ఇమేజ్‌ని పట్టించుకోకుండా నటించడం మొదట్నుంచీ నాకున్న అలవాటు. ప్రేక్షకులు మనం ఏం ఇస్తే అది స్వీకరిస్తారు. ప్రేక్షకుల పేరుతో మనం కొన్ని అభిప్రాయాల్ని రుద్దుతుంటాం కానీ, వాళ్లు మాత్రం నేను లాయర్‌గా, చెల్లెలిగా నటించినా.. ప్రతినాయిక ఛాయలున్న పాత్ర వేసినా స్వీకరించారు. వాళ్లకు కావాల్సింది మంచి కథ’’.
  • ‘‘తెలుగులో నా ప్రయాణం చాలా బాగుంది. దర్శకులు కథలు రాస్తున్నప్పుడు, వాళ్లు సృష్టిస్తున్న పాత్రల్లో నన్ను ఊహించుకుంటున్నారు. ఒక నటికి అంతకుమించి ఏం కావాలి? ఇక జయాపజయాలు ఎవరి చేతుల్లో ఉండవు. థియేటర్‌ నుంచి బయటికి వచ్చే ప్రేక్షకుడు నా నటనని వేలెత్తి చూపించకూడదనేదే నా నియమం. తెలుగుతోపాటు, తమిళ, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేస్తున్నా. ఈ ఏడాదిలోనే పెళ్లి చేసుకోబోతున్నా’’.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు