నవ్విస్తూ.. కవ్విస్తూ.. కంటతడి పెట్టిస్తూ

‘రాజు యాదవ్‌’తో థియేటర్లలో సందడి చేయనున్నారు గెటప్‌ శ్రీను. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని కె.కృష్ణమాచారి తెరకెక్కించారు. అంకిత కారాట్‌ కథానాయిక. ఈ సినిమా ఈనెల 24న థియేటర్లలోకి రానుంది.

Published : 20 May 2024 01:39 IST

‘రాజు యాదవ్‌’తో థియేటర్లలో సందడి చేయనున్నారు గెటప్‌ శ్రీను. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని కె.కృష్ణమాచారి తెరకెక్కించారు. అంకిత కారాట్‌ కథానాయిక. ఈ సినిమా ఈనెల 24న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే గెటప్‌ శ్రీను తాజాగా అగ్ర కథానాయకుడు చిరంజీవిని కలిశారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ ‘‘రాజు యాదవ్‌’ ట్రైలర్‌ చూశాను. దీంట్లో శ్రీను చూపించిన అభినయం మనల్ని నవ్విస్తుంది, కవ్విస్తుంది, కంటతడి పెట్టిస్తుంది. ఈ చిత్రం ద్వారా శ్రీను హీరోగా అందరి మన్ననలు అందుకుంటాడని ఆశిస్తున్నా. చిత్ర బృందానికి నా అభినందనలు’’ అని చిరు ఒక వీడియోలో అభినందించారు.


ఏస్‌ గేమ్‌ ఛేంజర్‌ 

విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి తన 51వ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారు. అర్ముగ కుమార్‌ దర్శకనిర్మాణంలో తమిళంలో తెరకెక్కనుందీ సినిమా. ఈ సినిమాతో కన్నడ భామ రుక్మిణీ వసంత్‌ తమిళ పరిశ్రమలో అడుగు పెట్టనుంది. తాజాగా ఈ సినిమాకి ‘ఏస్‌’ (ఏసీఈ) అనే టైటిల్‌ని ప్రకటించారు. దానికి  సంబంధించిన ప్రచార చిత్రాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంది రుక్మిణి. ‘ఇది కేవలం సాధారణ కార్డ్‌ మాత్రమే కాదు..గేమ్‌ ఛేంజర్‌ కూడా’ అనే వ్యాఖ్యల్ని జోడించింది. పూర్తిస్థాయి యాక్షన్‌ ప్యాక్డ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో జూదం ఆట కీలక పాత్ర పోషించనున్నట్లు ప్రచార చిత్రాన్ని చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాలో యోగిబాబు, పృథ్వీరాజ్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించునున్నారు.


కశ్మీర్‌లో సింగమ్‌ యాక్షన్‌

‘‘సింహం బీభత్సం సృష్టిస్తుంది. గాయపడిన సింహం విధ్వంసం సృష్టిస్తుంది’’ అంటూ ఇటీవలే తన రాబోయే ప్రాజెక్టు ‘సింగమ్‌ అగైన్‌’ను పరిచయం చేశారు కథానాయకుడు అజయ్‌ దేవగణ్‌. ఆయన.. అక్షయ్‌ కుమార్, రణ్‌వీర్‌ సింగ్, టైగర్‌ ష్రాఫ్, జాకీ ష్రాఫ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రమిది. రోహిత్‌ శెట్టి తెరకెక్కిస్తున్నారు. ఇందులో బాజీరావ్‌ సింగమ్‌గా కనిపించనున్నారు అజయ్‌. తాజాగా కశ్మీర్‌లో ఈ సినిమా చివరి షెడ్యూల్‌ చిత్రీకరణను ప్రారంభించినట్లు తెలుస్తోంది. ‘‘ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఇందులో భాగంగా అజయ్, జాకీ ష్రాఫ్‌ మధ్య ముఖ్యమైన సన్నివేశాలను కశ్మీర్‌లో తెరకెక్కిస్తున్నారు. వీరిద్దరి మధ్య వచ్చే యాక్షన్‌ సీక్వెన్స్‌లు ఈ ప్రాజెక్టుకే ప్రధాన ఆకర్షణగా ఉండనున్నాయి’’ అని సన్నిహితవర్గాలు తెలిపాయి. కరీనా కపూర్, దీపికా పదుకొణె కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.


చందు కాదు.. ఛాంపియన్‌

‘‘ఛాంపియన్‌ కావాలని కలలు కన్న నాలాంటి ఎంతో మంది చందుల కోసం నేను ఈరోజు కచ్చితంగా పోరాడాలి’’ అంటూ ‘చందు ఛాంపియన్‌’ ప్రపంచాన్ని పరిచయం చేశాడు కార్తిక్‌ ఆర్యన్‌. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రమిది. కబీర్‌ ఖాన్‌ తెరకెక్కిస్తున్నారు. భారతదేశం నుంచి తొలి పారాలింపిక్‌ గోల్డ్‌ మెడల్‌ సాధించిన స్విమ్మర్‌ మురళీకాంత్‌ పేట్కర్‌ జీవితం ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను ఇన్‌స్టా వేదికగా విడుదల చేశాడు కార్తిక్‌. ‘‘భారతదేశం గర్వించదగిన వ్యక్తి మురళీకాంత్‌ జీవిత ప్రయాణం లక్ష్యాలను సాధించడంలో మిమ్మల్ని ప్రేరేపిస్తుందని ఆశిస్తున్నాన’’ని వ్యాఖ్యల్ని జోడించాడు. చిన్నప్పటి నుంచే ఛాంపియన్‌గా ఎదగాలనే కోరికతో పారాలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించడం కోసం హీరో ఎదుర్కొన్న సవాళ్లను, అవమానాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తూ ఆద్యంతం ఆసక్తిగా సాగుతోంది ఈ ట్రైలర్‌. ‘చందు కాదు.. ఛాంపియన్‌’’ లాంటి డైలాగులు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. సాజిద్‌ నడియాడ్‌వాలా నిర్మిస్తున్న ఈ సినిమా జూన్‌ 14న విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని