తెరపై మ్యాజిక్‌ సృష్టిస్తా..

‘దర్శకులు నాకు సరిపోయే పాత్రలు ఇస్తే.. తెరపై మ్యాజిక్‌ చేసి చూపిస్తా’’ అంటోంది బాలీవుడ్‌ నాయిక  సోనాక్షి సిన్హా. ఇటీవలే ‘హీరామండీ:ది డైమండ్‌ బజార్‌’తో ప్రేక్షకులను ఆకట్టుకుందీమె.

Published : 20 May 2024 01:42 IST

‘దర్శకులు నాకు సరిపోయే పాత్రలు ఇస్తే.. తెరపై మ్యాజిక్‌ చేసి చూపిస్తా’’ అంటోంది బాలీవుడ్‌ నాయిక  సోనాక్షి సిన్హా. ఇటీవలే ‘హీరామండీ:ది డైమండ్‌ బజార్‌’తో ప్రేక్షకులను ఆకట్టుకుందీమె. సంజయ్‌లీలా భన్సాలీ రూపొందించిన ఈ సిరీస్‌లో బాలీవుడ్‌ అందాల భామలతో కలిసి సోనాక్షి చేసిన సందడి సినీ ప్రియుల్ని మెప్పించింది. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాక్షి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. 

చిత్ర పరిశ్రమకి వచ్చినప్పటి నుంచి ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించాను. కానీ కెరీర్‌ తొలినాళ్లలో అంతగా గుర్తింపు రాలేదు. ఆ సమయంలోనే నన్ను సవాలు చేసే పాత్రలను ఎంచుకోవడం మొదలు పెట్టాను. అలాంటి పాత్రల కోసమే అన్వేషిస్తున్నాను. నేను భిన్నమైన పాత్రలను, ప్రాజెక్టులను ఎంపిక చేసుకోవడం మొదలు పెట్టాను కాబట్టే.. నా జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. ఇదే నన్ను ‘దహాద్‌’, ‘హీరామండీ’ లాంటి ప్రాజెక్టులను ఎంచుకునేలా చేసింది. నాకు ఎన్నో పాఠాలు నేర్పిన నా అనుభవాలే.. ఈ రోజు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయి.

  • ప్రస్తుతం వస్తోన్న సినిమాల్లో హీరోలకు దీటుగా కథానాయికలు యాక్షన్‌ సన్నివేశాలు చేస్తూ వారి ప్రతిభను నిరూపించుకుంటున్నారు. దీంతో పాటు చిత్రపరిశ్రమలో ఎక్కువగా మహిళా ప్రాధాన్యమున్న చిత్రాలు వచ్చి బాక్సాఫీసు వద్ద మంచి కమర్షియల్‌ వసూళ్లను సాధిస్తున్నందుకు సంతోషంగా ఉంది. నేను కూడా కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి సినిమాలనే ఎంచుకుంటున్నాను. మహిళా ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటించినప్పుడు ఆ కథకు నేనే హీరోనని ఎంతో సంతోషంగా అనిపిస్తుంటుంది.
  • ఒక దర్శకుడి దృష్టిలో నేను ఏ జానర్‌లో అయినా.. ఎలాంటి పాత్రలో అయినా మెప్పించగల నటిగా ఉండాలనుకుంటున్నాను. ‘దహాద్‌’లో మాదిరిగా ఒక గ్రామీణ పోలీసు అధికారిగా నటించగలను. ‘హీరామండీ’లో వేశ్యలాంటి పాత్రను పోషించగలను. ‘లుటేరా’ లాంటి చిత్రాల్లో ప్రేమికురాలిగా సినీప్రియుల్ని మెప్పించగలను. సరైన దర్శకుడు, సరిపోయే పాత్ర నాకు ఇస్తే.. నేనెంటో నిరూపించుకొని తెరపై మ్యాజిక్‌ చేసే సత్తా నాకు ఉంది. 
  • చిత్రపరిశ్రమలో నటీనటులు వారి నటనతో ప్రశంసలు అందుకోవడం చాలా సహజం. కానీ.. దీంతో పాటు విమర్శలను సైతం వారు స్వీకరించే విధంగా ఉండాలి. ప్రతి ఒక్కరికి భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. వారి అభిరుచికి తగ్గట్లు సినిమాలు తీసి ప్రేక్షకులందరినీ మెప్పించాలంటే చాలా కష్టం.  సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగతంగా, వృత్తిపరంగా నాపై వచ్చే విమర్శలను నేను ఎప్పుడూ పట్టించుకోను.
  • ఇంతియాజ్‌ అలీ, రాజ్‌కుమార్‌ హిరాణీ, రోహిత్‌ శెట్టి లాంటి దర్శకులతో ఒక్కసారైనా పని చేయాలనే కోరిక ఎప్పట్నుంచో ఉంది. ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నాను.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని