ఈసారీ వర్షం పడింది.. విజయమే

‘గం.. గం.. గణేశా’తో థియేటర్లలో సందడి చేయనున్నారు ఆనంద్‌ దేవరకొండ. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని ఉదయ్‌ శెట్టి తెరకెక్కించారు.

Published : 21 May 2024 00:56 IST

‘గం.. గం.. గణేశా’తో థియేటర్లలో సందడి చేయనున్నారు ఆనంద్‌ దేవరకొండ. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని ఉదయ్‌ శెట్టి తెరకెక్కించారు. కేదార్‌ సెలగంశెట్టి, వంశీ కారుమంచి సంయుక్తంగా నిర్మించారు. ప్రగతి శ్రీవాస్తవ, నయన్‌ సారిక కథానాయికలు. ఈ సినిమా ఈ నెల 31న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం హైదరాబాద్‌లో ట్రైలర్‌ను విడుదల చేశారు. దర్శకుడు వంశీ పైడిపల్లి, రచయిత విజయేంద్ర ప్రసాద్‌ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘‘దర్శకుడు ఉదయ్‌ నా దగ్గర పని చేశాడు. అంకిత భావం, కష్టపడే తత్వం ఉన్న వ్యక్తి. ఈ సినిమా తప్పకుండా విజయవంతమవ్వాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘బేబి’ ట్రైలర్‌ జులైలో విడుదల చేశాం. అప్పుడు వర్షం పడింది. ఇప్పుడు మేలో ఈ ట్రైలర్‌ విడుదల చేశాం. ఇప్పుడూ వర్షం పడింది. ‘బేబి’లాగే ఈ సినిమాతోనూ ఆనంద్‌కు విజయం దక్కాలని కోరుకుంటున్నా’’ అన్నారు దర్శకుడు వంశీ పైడిపల్లి. హీరో ఆనంద్‌ దేవరకొండ మాట్లాడుతూ.. ‘‘తొలిసారి ఈ సినిమాలో ఓ హుషారైన విభిన్నమైన పాత్ర పోషించా. భయం, అత్యాస, కుట్ర అనే అంశాల్ని కేంద్రంగా చేసుకుని అల్లుకున్న క్రైమ్‌ కామెడీ ఇది. చిత్రసీమలో ఎవరైనా ఏదైనా సాధిస్తే కొన్ని గ్రూప్స్‌ మాత్రమే సెలబ్రేట్‌ చేస్తున్నాయి. అది సరికాదు. మనమంతా మన ఇండస్ట్రీ వాళ్లు సాధించే విజయాల్ని వేడుక చేసుకోవాలి’’ అన్నారు. ‘‘వినాయక చవితి చుట్టూ తిరిగే కథతో ఈ సినిమా రూపొందించాం. వినోదాత్మకంగా ఉంటూనే ట్విస్ట్‌లు థ్రిల్‌ పంచుతాయి’’ అన్నారు దర్శకుడు ఉదయ్‌. కార్యక్రమంలో సాయి రాజేశ్, సారిక, కేదార్, అనురాగ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని