లవ్‌ మీ... సీక్వెల్‌కు ఆస్కారం ఉంది!

‘‘ఆశ్చర్యానికి గురిచేసే చాలా విషయాలు మా సినిమాలో ఉన్నాయి. ప్రేక్షకులు ‘లవ్‌ మీ’ చూస్తూ... ఓ కొత్త రకమైన అనుభూతికి గురవుతార’’ని చెప్పారు ఆశిష్‌.

Updated : 23 May 2024 06:07 IST

‘‘ఆశ్చర్యానికి గురిచేసే చాలా విషయాలు మా సినిమాలో ఉన్నాయి. ప్రేక్షకులు ‘లవ్‌ మీ’ చూస్తూ... ఓ కొత్త రకమైన అనుభూతికి గురవుతార’’ని చెప్పారు ఆశిష్‌. ‘రౌడీబాయ్స్‌’తో కథానాయకుడిగా పరిచయమైన ఆయన... తన రెండో ప్రయత్నంగా చేసిన సినిమానే ‘లవ్‌ మీ’. ఇఫ్‌ యు డేర్‌... అనేది ఉపశీర్షిక. వైష్ణవి చైతన్య కథానాయిక. అరుణ్‌ భీమవరపు దర్శకత్వం వహించారు. హర్షిత్‌ రెడ్డి, నాగ మల్లిడి నిర్మాతలు. హారర్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు ఆశిష్‌. 

‘‘దెయ్యం నేపథ్యంలో సినిమాలు మనకు కొత్త కాదు. అవి ఎక్కువగా ప్రతీకారం చుట్టూనే సాగుతుంటాయి. ఈ సినిమా చేయడానికి ముందు నేను ‘చంద్రముఖి’, ‘ముని’ తరహా సినిమాలు చాలానే చూశా. అందులో ప్రతి పాత్రకీ ఓ సమస్య ఉంటుంది. కానీ ఇందులో నాది సమస్యకి పరిష్కారాన్ని వెతికే పాత్ర. ఇందులో దెయ్యం నేపథ్యం ఉన్నప్పటికీ హారర్‌ అనేది ఓ భాగం మాత్రమే. మిగతాదంతా ఓ మంచి ప్రేమకథలానే సాగుతుంది. కథ, కథనాలు, సాంకేతికత...ఇలా ఏ కోణంలో చూసినా ఇదొక కొత్త రకమైన వినోదాన్ని పంచుతుంది. దర్శకుడు అరుణ్‌ ఈ కథ చెప్పినప్పుడే ఆ అభిప్రాయం కలిగింది. అందుకు తగ్గట్టుగానే  సినిమా రూపుదిద్దుకుంది’’. 

  • ‘‘ప్రతి విషయాన్నీ ఒకొక్కరు ఒక్కో కోణంలో చూస్తుంటాం. అదే తరహాలో నడుచుకునే పాత్రలోనే నేను కనిపిస్తా. ఎవరైనా ఓ పని చేయొద్దని అంటే... అదే పని చేయడానికి పూనుకునే యువకుడిగా కనిపిస్తా. ఓ యూట్యూబర్‌గా కనిపిస్తా. యూట్యూబ్‌లో స్టోరీస్‌ అప్‌లోడ్‌ చేసే ఆ కుర్రాడి దగ్గరికి దెయ్యానికి సంబంధించిన ఓ స్టోరీ వచ్చాక, అతని జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలు ఎలాంటివనేది తెరపైనే చూడాలి. వైష్ణవి ఇందులో దెయ్యంగా కనిపిస్తుందని అనుకుంటున్నారు. కానీ ఆమె నా సరసన ఓ కథానాయికగానే కనిపిస్తారు. మా సినిమాలో దివ్యావతి దెయ్యంగా కనిపిస్తుంది. ఆ పాత్రలో దివ్యావతినే కనిపిస్తుంది. అదెలా అనేది తెరపైనే చూడాలి. ఇందులో ఐదారుగురు కథానాయికలు ఉంటారు. ఇంకా చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఉంటాయి’’. 
  • ‘‘నిర్మాత దిల్‌రాజు ప్రమేయం లేకుండానే మా దర్శకుడు, నిర్మాత నాగ వెళ్లి ఈ కథని పి.సి.శ్రీరామ్‌ సర్‌కి చెప్పారు. ఆయన కథ విని చేస్తానని చెప్పారు. అలాగే కీరవాణిసర్‌ ఈ కథ విని చేయడానికి ఒప్పుకున్నారు. వాళ్లిద్దరూ ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చాక మాలో మరింత ఉత్సాహం కలిగింది. వాళ్లు సినిమాకి ప్రధాన బలం. ‘లవ్‌ మీ’ పతాక సన్నివేశాల్లో ఓ మంచి మలుపు ఉంది. అది కథని కొనసాగించేలానే ఉంటుంది. మరి కొనసాగింపు చిత్రం ఉంటుందా లేదా అనేది నిర్మాత దిల్‌రాజు నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. తదుపరి నేను ‘సెల్ఫిష్‌’ పూర్తి చేయాలి. ఆ తర్వాత సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలో ఓ సినిమా చేస్తున్నా’’.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని