‘మనమే’.. విడుదల ఖరారు

శర్వానంద్‌ కథానాయకుడిగా శ్రీరామ్‌ ఆదిత్య తెరకెక్కించిన చిత్రం ‘మనమే’. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై వివేక్‌ కూచిభొట్ల నిర్మించారు. కృతి శెట్టి కథానాయిక.

Published : 25 May 2024 00:42 IST

ర్వానంద్‌ కథానాయకుడిగా శ్రీరామ్‌ ఆదిత్య తెరకెక్కించిన చిత్రం ‘మనమే’. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై వివేక్‌ కూచిభొట్ల నిర్మించారు. కృతి శెట్టి కథానాయిక. విక్రమ్‌ ఆదిత్య కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా జూన్‌ 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని శుక్రవారం అధికారికంగా ప్రకటిస్తూ.. కొత్త పోస్టర్‌ను పంచుకున్నారు. అందులో శర్వా స్టైలిష్‌ లుక్‌లో చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. ‘‘ఇదొక న్యూఏజ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌. శ్రీరామ్‌ ఆదిత్య శైలి వినోదంతో నిండి ఉంటుంది. దీంట్లో శర్వా, కృతిల కెమిస్ట్రీ అందర్నీ ఆకట్టుకుంటుంది’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి సంగీతం: హేషమ్‌ అబ్దుల్‌ వహబ్, ఛాయాగ్రహణం: విష్ణుశర్మ, వి.ఎస్‌.జ్ఞానశేఖర్‌. 


రాజస్థాన్‌లో టైసన్‌!

టైసన్‌ నాయుడు’గా థియేటర్లలో సందడి చేయనున్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌. ఆయన హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సాగర్‌ కె.చంద్ర తెరకెక్కిస్తున్నారు. రామ్‌ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ రాజస్థాన్‌లో శుక్రవారం ప్రారంభమైంది. దాదాపు రెండు వారాల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో స్టంట్‌ శివ నేతృత్వంలో బెల్లంకొండపై భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ను తెరకెక్కించనున్నారు. రాజస్థాన్‌ పరిసర ప్రాంతాల్లోని కోటల్లో పదిరోజుల పాటు రాత్రి వేళ ఈ పోరాట ఘట్టాల్ని చిత్రీకరించనున్నారు. ఆ తర్వాత అక్కడే సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాల్ని షూట్‌ చేయనున్నారు. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ముస్తాబవుతోన్న ఈ చిత్రంలో బెల్లంకొండ శక్తిమంతమైన పోలీసు పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకి భీమ్స్‌ సిసిరోలియో సంగీతమందిస్తున్నారు. ముఖేష్‌ జ్ఞానేష్, అనిత్‌ ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు. 


ఏది మంచి? ఏది చెడు?

 

యామ్‌ యుగంధర్‌. హారికని నేనే చంపా’ అంటూ ఏకంగా పోలీస్‌ అధికారికే ఫోన్‌ చేశాడు ఓ ఆగంతుకుడు. ఇంతకీ ఆ యుగంధర్‌ ఎవరు? హారికని ఎందుకు చంపాడు? పోలీస్‌ పరిశోధనలో వెలుగులోకి వచ్చిన విషయాలేమిటి? తదితర విషయాలు తెలియాలంటే ‘యేవమ్‌’ చూడాల్సిందే. చాందినీ చౌదరి, ఆషూరెడ్డి, వశిష్ట సింహా, భరత్‌ రాజ్‌ కీలక పాత్రలు పోషించిన చిత్రమిది. ప్రకాశ్‌ దంతులూరి దర్శకత్వం వహిస్తున్నారు. నవదీప్, పవన్‌ గోపరాజు నిర్మాతలు. ఈ సినిమా టీజర్‌ని ప్రముఖ దర్శకుడు హరీశ్‌ శంకర్‌ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘సినిమా పేరు, ప్రచార చిత్రాలు చాలా బాగున్నాయని మెచ్చుకున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘విభిన్నమైన కథతో రూపొందించిన చిత్రమిది. మహిళా సాధికారికతని చాటుతూ సాగే ఈ కథ, కథనాల్ని తెరపై ఆవిష్కరించిన తీరు కూడా కొత్తగా ఉంటుంది. ఏది మంచి? ఏది చెడు? అనే విషయాలు  ఈ కథలో కీలకం’’ అన్నారు. గోపరాజు రమణ, దేవిప్రసాద్, కల్పిత తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఎస్‌.వి.విశ్వేశ్వర్, సంగీతం: కీర్తన శేషు, నీలేష్‌ మందలపు, కూర్పు: సుజనా అడుసుమిల్లి. 


తిరుపతికి పెళ్లైందా? 

శ్రీకాకుళం జిల్లా పెంటపాడుకు చెందిన ఐదెకరాల యువ రైతు తిరుపతి. ఏడో తరగతి వరకూ చదువుకున్నాడు. మనిషి మంచోడు. కానీ రైతు వృత్తే అతని పెళ్లికి అడ్డుగా మారుతుంది.  ఆ ఊళ్లో అంతా అమెరికా సంబంధాలు, ఉద్యోగస్తుల సంబంధాల కోసం చూస్తుంటారు కానీ.. రైతుకి పిల్లని ఇవ్వడానికి మాత్రం ఎవ్వరూ ముందుకు రారు. మరింతకీ తిరుపతి పెళ్లైందా లేదా తెలియాలంటే ‘కన్యాకుమారి’ చూడాల్సిందే. గీత్‌ సైని, శ్రీచరణ్‌ రాచకొండ జంటగా నటిస్తున్న చిత్రమిది. సృజన్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. తిరుపతి పాత్రని పరిచయం చేస్తూ టీజర్‌ని  విడుదల చేసింది చిత్రబృందం. బాగా చదువుకున్న అమ్మాయినే పెళ్లి చేసుకుంటానంటూ కథానాయకుడు సవాల్‌ విసరడం, పెళ్లి కోసం చేసే ప్రయత్నాలు టీజర్‌కి ఆకర్షణగా నిలిచాయి. ఈ చిత్రానికి సంగీతం: రవి నిడమర్తి, ఛాయాగ్రహణం: శివ గాజుల, హరిచరణ్‌.కె.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని