రంగనాయకి ఏమైనాదే!

నార్నే నితిన్, నయన్‌ సారిక జంటగా అంజి కె.మణిపుత్ర తెరకెక్కించిన చిత్రం ‘ఆయ్‌’. బన్నీ వాస్, విద్యా కొప్పినీడి సంయుక్తంగా నిర్మించారు. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు.

Updated : 26 May 2024 08:46 IST

నార్నే నితిన్, నయన్‌ సారిక జంటగా అంజి కె.మణిపుత్ర తెరకెక్కించిన చిత్రం ‘ఆయ్‌’. బన్నీ వాస్, విద్యా కొప్పినీడి సంయుక్తంగా నిర్మించారు. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ఈ సినిమా త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో ప్రచార పర్వాన్ని వేగవంతం చేశారు. ఇందులో భాగంగా శనివారం ఈ చిత్రం నుంచి రెండో గీతాన్ని విడుదల చేశారు. ‘‘నాయకి ఏమైనాదే.. రంగనాయకి ఏమైనాదే’’ అంటూ హుషారుగా సాగిన ఈ మాస్‌ పాటకు రామ్‌ మిరియాల స్వరాలు సమకూర్చగా.. సురేష్‌ బనిశెట్టి సాహిత్యమందించారు. అనురాగ్‌ కులకర్ణి ఆలపించారు. భాను మాస్టర్‌ నృత్యరీతులు అందించారు. ‘‘కొత్తదనం నిండిన కథతో రూపొందిన చక్కటి ఎంటర్‌టైనర్‌ ఇది. నిర్మాణానంతర పనులు ముగింపు దశలో ఉన్నాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తామ’’ని చిత్ర వర్గాలు తెలిపాయి. 


మూర్తి మ్యూజిక్‌

జయ్‌ ఘోష్, చాందినీచౌదరి ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన ‘మ్యూజిక్‌షాప్‌ మూర్తి’ జూన్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.  హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మాణంలో... శివ పాలడుగు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ధీరజ్‌ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ ద్వారా విడుదలవుతున్నట్టు సినీ వర్గాలు ప్రకటించాయి. ‘‘కుటుంబ వినోదంతో రూపొందిన చిత్రమిది. డీజే కావాలనే ప్రయత్నాల్లో ఉన్న మ్యూజిక్‌ షాప్‌ యజమానిగా అజయ్‌ ఘోష్‌... ఆయన లక్ష్యాన్ని చేరుకోవడానికి సహకారం అందించే స్ఫూర్తిదాయకమైన పాత్రలో చాందినీ చౌదరి కనిపించనున్నారు. భావోద్వేగాలు చిత్రానికి ప్రధానబలం. మరో  మూడు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రచార చిత్రాలు, పాటలు ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయ’’ని  సినీ వర్గాలు తెలిపాయి. ఆమని, అమిత్‌ శర్మ, భానుచందర్, దయానంద్‌ రెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్రీనివాస్‌ బెజుగం, కూర్పు: బొంతల నాగేశ్వరరెడ్డి, సంగీతం: పవన్‌.


ప్రేమకు నిర్వచనం ‘ఉషా పరిణయం’ 

‘‘నువ్వే కావాలి’, ‘మన్మథుడు’, ‘మల్లీశ్వరి’ సినిమాలతో ప్రేక్షకుల్ని మెప్పించిన దర్శకుడు కె.విజయ్‌భాస్కర్‌. ఇప్పుడాయన స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ఉషా పరిణయం’. విజయ్‌భాస్కర్‌ తనయుడు శ్రీకమల్‌ హీరోగా నటిస్తున్నారు. తాన్వీ ఆకాంక్ష కథానాయిక. ఈ చిత్ర టీజర్‌ను శనివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత విజయ్‌భాస్కర్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా ప్రేమకు నా నిర్వచనం. ఇదొక మంచి ప్రేమకథతో రూపొందుతోంది. ఇది సినీప్రియులకు ఫుల్‌మీల్స్‌లా ఉంటుంది. అన్ని రకాల భావోద్వేగాలు దీంట్లో ఉన్నాయి’’ అన్నారు. ‘‘అందరి సమష్టి కృషితో ఈ చిత్రాన్ని పూర్తి చేశాం. ఆర్‌.ఆర్‌.ధ్రువన్‌ దీనికి మంచి సంగీతమందించారు’’ అన్నారు హీరో శ్రీకమల్‌. ఈ కార్యక్రమంలో తాన్వీ, సూర్య, రవి, ఆర్‌.ఆర్‌.ధ్రువన్, శివతేజ తదితరులు పాల్గొన్నారు. 


‘పరాక్రమం’ కోసం ఓ యజ్ఞం చేశాం 

బండి సరోజ్‌ కుమార్‌ హీరోగా నటిస్తూ.. స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘పరాక్రమం’. బిఎస్‌కె మెయిన్‌ స్ట్రీమ్‌ సంస్థ నిర్మించింది. శ్రుతి సమన్వి, నాగలక్ష్మి, శశాంక్‌ వెన్నెలకంటి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్ర టీజర్‌ను శనివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. విష్వక్‌ సేన్, బుచ్చిబాబు, జ్ఞానసాగర్‌ ద్వారక, ఎస్‌కెఎన్‌ తదితరులు అతిథులుగా హాజరయ్యారు. విష్వక్‌ మాట్లాడుతూ.. ‘‘ట్రైలర్‌ చాలా బాగుంది. సరోజ్‌ కుమార్‌ దర్శకుడిగా కన్నా నటుడిగా బాగా పర్‌ఫార్మ్‌ చేస్తున్నారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు’’ అన్నారు. ‘‘ఈ చిత్రం కోసం మేము ఓ యజ్ఞం చేశాం. నా గత సినిమాలు కొన్ని వర్గాల ప్రేక్షకులకే పరిమితమయ్యాయి. కానీ, ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులు చూసేలా ఉంటుంద’’న్నారు సరోజ్‌ కుమార్‌. కార్యక్రమంలో మోహన్, శ్రుతి సమన్వి, నిఖిల్‌ తదితరులు పాల్గొన్నారు. 


ప్రేమే.. దెయ్యంగా మారితే! 

ప్రేమించిన అమ్మాయి ప్రేమ అందుకోకుండానే.. చనిపోతాడో అబ్బాయి. తర్వాత హీరో శరీరంలోకి ప్రవేశించి ఆమె ప్రేమను తిరిగి పొందాలనుకుంటాడు. అలా దెయ్యంగా మారి అతడు చేసిన చిత్రమైన చేష్టలు.. ఇతరుల్ని భయపెట్టడం.. మధ్యలో వచ్చే కామెడీ సన్నివేశాలతో రూపొందిన చిత్రమే ‘ముంజ్యా’. ఆదిత్య సర్పోత్‌దార్‌ దర్శకుడు. ‘స్త్రీ’, ‘భేడియా’ లాంటి హారర్‌ కామెడీ చిత్రాల నిర్మాత దినేష్‌ విజన్‌ అందిస్తున్న ఆ తరహా మరో సినిమా ఇది. శనివారం ట్రైలర్‌ విడుదలైంది. ఇందులో భారతీయ తొలి కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ నటుడు ‘ముంజ్యా’నే ప్రధాన పాత్రధారిగా కనిపించనున్నాడు. అభయ్‌ వర్మ, శార్వరీ వాఘ్‌ జోడీగా నటిస్తున్న ఈ చిత్రం జూన్‌ 7న ప్రేక్షకుల ముందుకొస్తోంది.


దర్శకుడు సికందర్‌ భారతీ కన్నుమూత 

‘దో ఫంటూష్‌’, ‘సైనిక్‌’, ‘సర్‌ ఉఠాకే జీయో’ చిత్రాల దర్శకుడు సికందర్‌ భారతీ (60) కన్నుమూశారు. శనివారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు ముంబయిలో నిర్వహించారు. దాదాపు రెండు దశాబ్దాలపాటు సాగిన ఆయన సినీ ప్రస్థానంలో గోవిందా, అక్షయ్‌కుమార్, రాజేశ్‌ఖన్నా, అంజాద్‌ఖాన్‌లాంటి ఎందరో అగ్ర కథానాయకులతో కలిసి పని చేశారు. యాక్షన్, డ్రామా, కామెడీ.. ఇలా విభిన్నమైన జానర్స్‌లో ఆయన సినిమాలు తెరకెక్కించారు. ఆయన మృతి బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమకు తీరని లోటని పరిశ్రలోని ప్రముఖులు నివాళి అర్పించారు. సికందర్‌కి భార్య, ముగ్గురు పిల్లలున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని