అమ్మాయి వలకి.. గిలగిల

సంప్రదాయబద్ధమైన అమ్మాయి.. ఒక అమాయకుడైన బ్రహ్మచారికి వలపు వల విసిరితే.. ఏమవుతుంది? అతడి జీవితం సర్వనాశమే అవుతుంది అంటున్నాడు కార్తిక్‌ ఆర్యన్‌. ఆయన ‘చందు ఛాంపియన్‌’గా నటిస్తున్న చిత్రంలోని ‘సత్యనాశ్‌..’ అనే గీతంలో.

Updated : 26 May 2024 08:45 IST

సంప్రదాయబద్ధమైన అమ్మాయి.. ఒక అమాయకుడైన బ్రహ్మచారికి వలపు వల విసిరితే.. ఏమవుతుంది? అతడి జీవితం సర్వనాశమే అవుతుంది అంటున్నాడు కార్తిక్‌ ఆర్యన్‌. ఆయన ‘చందు ఛాంపియన్‌’గా నటిస్తున్న చిత్రంలోని ‘సత్యనాశ్‌..’ అనే గీతంలో. ఈ సాంగ్‌ని తాజాగా విడుదల చేశారు. కబీర్‌ఖాన్‌ ఈ సినిమాకి దర్శకుడు. ఈ ఎనర్జిటిక్‌ డ్యాన్స్‌ పాటలో కార్తిక్‌ స్టెప్పులు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ పాటకి ప్రీతమ్‌ స్వరాలు సమకూర్చగా అరిజిత్‌ సింగ్, నకాష్‌ అజీజ్, దేవ్‌ నేగి ఆలపించారు. అమితాబ్‌ భట్టాచార్య రాయగా.. బాస్కో సీజర్‌ నృత్యరీతులు సమకూర్చారు. జూన్‌ 14న విడుదలవుతున్న ఈ సినిమాని కబీర్‌ఖాన్, సాజిద్‌ నడియాడ్‌వాలా నిర్మిస్తున్నారు. భారతీయ పారాలింపియన్‌ మురళీకాంత్‌ పేట్కర్‌ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే.

జోడీ ఆమేనా..?: ‘చందు ఛాంపియన్‌’ విడుదలకు దగ్గరవుతున్నా.. ఇంతవరకు కార్తిక్‌ ఆర్యన్‌కి జోడీగా నటించేదెవరనే విషయాన్ని బయట పెట్టలేదు చిత్రబృందం. అయితే గత వారం భోపాల్‌లో నిర్వహించిన చిత్ర ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో యువ నాయిక భాగ్యశ్రీ బోర్సె ప్రత్యక్షమవడం.. కార్తిక్‌ ఆర్యన్‌ వేదిక ఎక్కుతున్నప్పుడు ఆమె చప్పట్లు కొట్టడం.. ఆమెను చూసి కార్తిక్‌ చిరునవ్వులు చిందించడంతో.. ఆయనకు జోడీగా నటించేది తనేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు భాగ్యశ్రీ సైతం తన సామాజిక మాధ్యమ ఖాతాల్లో ‘చందు ఛాంపియన్‌’లో నా పాత్ర ప్రత్యేకం’ అని పేర్కొనడంతో కథానాయిక ఆమేననే నిర్ణయానికొస్తున్నారు అభిమానులు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని