ఆ ప్రశ్నలకు సమాధానం.. లవ్‌ మౌళి

‘‘ఇరవయ్యేళ్ల ప్రయాణం తర్వాత... నా నటనలోని మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ చేసిన ప్రయత్నమే ఈ సినిమా’’ అన్నారు నవదీప్‌.

Published : 27 May 2024 01:08 IST

‘‘ఇరవయ్యేళ్ల ప్రయాణం తర్వాత... నా నటనలోని మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ చేసిన ప్రయత్నమే ఈ సినిమా’’ అన్నారు నవదీప్‌. ఆయన కథానాయకుడిగా... అవనీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవ్‌ మౌళి’. పంఖురి గిద్వానీ, భావన సాగి కథానాయికలు. సి స్పేస్‌ నిర్మించింది. ఈ చిత్రం జూన్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించింది. నవదీప్‌ మాట్లాడుతూ ‘‘నా వ్యక్తిగత జీవితంలోని ప్రేమకథలు, వాటిలోని కొన్ని అంశాల్ని స్పృశిస్తుందీ కథ. ఈ కథకీ, ఇందులో స్పృశించిన అంశాలకీ ప్రేక్షకులు కనెక్ట్‌ అయితే వాళ్ల జీవితాల్లో చాలా మార్పులు వస్తాయి. ప్రస్తుతం అన్ని భాషల్లోనూ కొత్త రకమైన కథలతో సినిమాలు రూపొందుతున్నాయి. అదే కోవలో తెలుగులో రానున్న మరో విభిన్నమైన సినిమా ఇది. కథ వినగానే చేయాలనిపించింది. చిత్రీకరణలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. చిరపుంజి, మేఘాలయా తదితర అందమైన ప్రదేశాల్లో, ఓ అందమైన సినిమా తీశాం. ప్రేక్షకుడు థియేటర్‌కి ఎందుకు రావాలనే ప్రశ్నకి ఈ చిత్రంతో సమాధానం దొరుకుతుంది’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘యువతరం ప్రేక్షకులకు నచ్చే అంశాలన్నీ ఇందులో ఉంటాయి. కథానాయకుడు నవదీప్‌ చాలా కష్టపడ్డారు. ఆయన కష్టానికి తగిన ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకున్నా భార్యాభర్తలు ఎందుకు విడిపోతుంటారు? రాజీ పడితేనే బంధాలు నిలుస్తాయా? తదితర ప్రశ్నలకి సమాధానం మా సినిమాలో చూపిస్తున్నాం’’ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని