బెల్లా కాదు.. కాల్‌ మీ బె

బాలీవుడ్‌ నాయికలు దాదాపు ఓటీటీవైపే మొగ్గుచూపుతున్నారు. ఇప్పుడా జాబితాలోకే చేరింది కథానాయిక అనన్య పాండే. ‘కాల్‌ మీ బె’ సిరీస్‌తో అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది అనన్య.

Published : 28 May 2024 01:18 IST

బాలీవుడ్‌ నాయికలు దాదాపు ఓటీటీవైపే మొగ్గుచూపుతున్నారు. ఇప్పుడా జాబితాలోకే చేరింది కథానాయిక అనన్య పాండే. ‘కాల్‌ మీ బె’ సిరీస్‌తో అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది అనన్య. అనివార్య కారణాల వల్ల కుటుంబానికి దూరమైన బెల్లా చౌదరీ అనే అమ్మాయి..ఒంటరిగా జీవిస్తూ ఎలాంటి సవాళ్లను ఎదుర్కొందనే కథనంతో కొలిన్‌ డీ కున్హా రూపొందిస్తున్నారు. కరణ్‌ జోహార్‌ నిర్మాత. తాజాగా ఈ సిరీస్‌ సెప్టెంబరు 6 నుంచి ఓటీటీలో అందుబాటులో ఉండనున్నట్లు తెలుపుతూ కొత్త ఫొటోను పంచుకుంది సిరీస్‌ బృందం. ఎనిమిది భాగాలుగా అభిమానుల ముందుకు రానున్న ఈ ప్రాజెక్టులో వీర్‌దాస్, వరుణ్‌ సూద్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 


నవ్వులు పంచే ‘నమో’ 

విశ్వంత్‌ దుద్దుంపూడి, అనురూప్‌ కటారి హీరోలుగా ఆదిత్య రెడ్డి కుందూరు తెరకెక్కించిన చిత్రం ‘నమో’. ఎ.ప్రశాంత్‌ నిర్మించారు. విస్మయ కథానాయిక. ఈ సినిమా జూన్‌ 7న థియేటర్లలోకి రానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోమవారం ప్రకటించింది. ‘‘చక్కటి వినోదం నిండిన కథాంశంతో సర్వైవల్‌ కామెడీ జానర్‌లో ఈ చిత్రం తెరకెక్కించాం. ఇది ఆద్యంతం ప్రేక్షకుల్ని నవ్విస్తూనే ఉంటుంది. త్వరలోనే ట్రైలర్, పాటల్ని విడుదల చేస్తాం’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి సంగీతం: క్రాంతి ఆచార్య వడ్లూరి, ఛాయాగ్రహణం: రాహుల్‌ శ్రీవాత్సవ్‌. 


‘మిషన్‌ మంగళ్‌’ దర్శకుడితో అజయ్‌ చిత్రం? 

‘షైతాన్‌’తో హిట్టు కొట్టి..‘మైదాన్‌’తో ప్రేక్షకులను అలరించారు బాలీవుడ్‌ అగ్రహీరో అజయ్‌ దేవగణ్‌. ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో బిజీగా గడుపుతున్న ఈయన కొత్త సినిమా కోసం సమాయత్తమవున్నట్లు తెలుస్తోంది. బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకున్న ‘మిషన్‌ మంగళ్‌’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన జగన్‌ శక్తి తెరకెక్కించనున్న ఓ సినిమాలో అజయ్‌ భాగం కానున్నట్లు సమాచారం. గత కొన్ని నెలలుగా వీరిద్దరూ కలిసి కొత్త సినిమా చర్చలు జరుపుతున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. ‘జగన్‌ వినిపించిన కథ పట్ల అజయ్‌ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ కలయిక చిత్రంపై అంచనాలను పెంచుతోంది. 2025 ప్రారంభంలోనే ఈ సినిమా చిత్రీకరణను మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేసుకుంటోంది చిత్రబృందం’ అని తెలిపాయి. ప్రస్తుతం అజయ్‌ ‘దే దే ప్యార్‌ దే 2’, ‘రెయిడ్‌ 2’, ‘సన్‌ ఆఫ్‌ సర్దార్‌ 2’, ‘సింగమ్‌ అగైన్‌’ లాంటి సీక్వెల్స్‌ చిత్రాలతో బిజీగా ఉన్నారు.


యాక్షన్‌ షురూ? 

‘పఠాన్‌’, ‘ఫైటర్‌’ చిత్రాల దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ పదిహేడేళ్ల తర్వాత తన తొలి సినిమా హీరో సైఫ్‌ అలీఖాన్‌తో కలిసి పని చేస్తున్నానని ప్రకటించారు. హంగరీలోని బుడాపెస్ట్‌లో ఈ సినిమా చిత్రీకరణ సైతం మొదలైంది. సైఫ్‌తో కలిసి ఉన్న రెండు ఫొటోల్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ.. ‘నా ఫస్ట్‌ హీరోతో సెట్లోకి వచ్చాను. మాలో మీకేమైనా మార్పు కనిపిస్తోందా? లవ్యూ సైఫ్‌’ అనే వ్యాఖ్యలు జోడించారు సిద్ధార్థ్‌. అయితే సినిమా పేరు, ఇతర వివరాలేవీ తెలియజేయలేదు. ఇది ‘జ్యువెల్‌ థీఫ్‌’కి సంబంధించిన చిత్రీకరణనే కావొచ్చు అంటూ అభిమానులు కామెంట్‌ చేశారు. గతంలో ‘జ్యువెల్‌ థీఫ్‌’కి రాబీ గ్రేవాల్‌ దర్శకత్వం వహిస్తారని సినీవర్గాలు తెలిపాయి. దీన్ని సిద్ధార్థ్‌ ఆనంద్‌ నిర్మాణ సంస్థ మార్‌ఫ్లిక్స్‌ పిక్చర్స్‌ నిర్మిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని