మాట పెళుసైనా... మనసులో వెన్న

‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి వుంటాడే నా సామే... మెత్తానీ పత్తిపువ్వులామరి సంటోడే నా సామీ...’ అంటూ పుష్ప గురించి శ్రీవల్లి తన మనసుని విప్పింది.

Updated : 30 May 2024 09:14 IST

‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి వుంటాడే నా సామే... మెత్తానీ పత్తిపువ్వులామరి సంటోడే నా సామీ...’ అంటూ పుష్ప గురించి శ్రీవల్లి తన మనసుని విప్పింది. మొరటోడు.. మొండోడిలా కనిపించే పుష్పరాజ్‌పై ఇంకా ఆమె అంతరంగం ఏమిటో తెలియాలంటే ‘సూసేకి...’ పాట వినాల్సిందే. ‘పుష్ప 2’ చిత్రంలోని మరో పాట ఇది. బుధవారం విడుదల చేశారు. ‘వీడు మొరటోడు అని వాళ్లు వీళ్లు... ఎన్నెన్ని అన్న పసిపిల్లవాడు నావాడు...’ అంటూ మొదలయ్యే ఈ పాటని దేవిశ్రీ ప్రసాద్‌ స్వరపరచగా, చంద్రబోస్‌ రచించారు. ఐదు భాషల్లో శ్రేయాఘోషల్‌ ఈ పాటని ఆలపించారు. మేకింగ్‌ విజువల్స్‌తో విడుదలైన ఈ లిరికల్‌ గీతం సామాజిక మాధ్యమాల్ని ఊపేస్తోంది. ‘వీడు మొండోడు అనని ఊరువాడ అనుకున్నగానీ... మహరాజు నాకు నావాడు.. ఓ మాట పెళుసైనా... మనసులో వెన్న... రాయిలా ఉన్నవాడిలోన దేవుడెవరికి తెలుసును నా కన్నా...’ అంటూ సాగుతుందీ పాట. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమే ‘పుష్ప2’. రష్మిక కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. విజయవంతమైన ‘పుష్ప: ది రైజ్‌’కి కొనసాగింపుగా రూపొందుతోంది. ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫహాద్‌ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, అనసూయ తదితరులు ఇందులో నటిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని