నువ్వు ఏడిస్తే.. నా హృదయానికి కన్నీళ్లు..

‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’ చిత్రం నుంచి ‘రోయా..’ అనే కొత్త పాట విడుదలైంది. రాజ్‌కుమార్‌రావ్, జాన్వీ కపూర్‌ నాయకానాయికలుగా శరణ్‌ శర్మ తెరకెక్కిస్తున్న రొమాంటిక్‌ స్పోర్ట్స్‌ డ్రామా చిత్రమిది.

Updated : 30 May 2024 06:23 IST

‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’ చిత్రం నుంచి ‘రోయా..’ అనే కొత్త పాట విడుదలైంది. రాజ్‌కుమార్‌రావ్, జాన్వీ కపూర్‌ నాయకానాయికలుగా శరణ్‌ శర్మ తెరకెక్కిస్తున్న రొమాంటిక్‌ స్పోర్ట్స్‌ డ్రామా చిత్రమిది. ఇందులోని ‘నువ్వు ఏడ్చినప్పుడు.. నా హృదయం కన్నీళ్లు పెట్టుకుంటుంది.. నీ కోసం ఆరాటపడుతుంది.. ఓదార్పు కోసం వెతుక్కుంటుంది.. అప్పుడిక నీ కళ్లలోకి చూసే ధైర్యం నాకుండదు..’ అనే అర్థంలో సాగే పంక్తులు హృదయాన్ని తాకేలా ఉన్నాయి. ఆట కోసం దూరమైన యువ జంట మధ్య వచ్చే ఈ గీతాన్ని విశాల్‌ మిశ్రా స్వయంగా రాసి, పాడి, స్వరాలు సమకూర్చారు. కరణ్‌ జోహార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 31న విడుదలవుతోంది. 


సెప్టెంబరులో ‘లక్కీ భాస్కర్‌’ 

‘సీతారామం’తో తెలుగు ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకున్న దుల్కర్‌ సల్మాన్‌ ‘లక్కీ భాస్కర్‌’గా మరోసారి అలరించడానికి వస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయిక. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం సెప్టెంబరు 27న విడుదల కానున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. 1980-90 కాలం నాటి కథాంశంతో తెరకెక్కుతోంది. సాధారణ బ్యాంకు క్యాషియర్‌ అయిన భాస్కర్‌ ఆసక్తికరమైన, అసాధారణమైన జీవిత ప్రయాణాన్ని ఇందులో చూపించనున్నారు. సంగీతం: జీవీ ప్రకాశ్‌ కుమార్, ఛాయగ్రహణం: నిమిష్‌ రవి.


ఎలాన్‌ మస్క్‌కి బుజ్జి ఆహ్వానం 

‘కల్కి 2898 ఎ.డి’ కోసం తయారైన బుజ్జి కారు ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. దేశం మొత్తం చుట్టేందుకు బయల్దేరిన ఆ కారు ప్రస్తుతం చెన్నై వీధుల్లో విహరిస్తోంది. బుజ్జి కారుని చూసేందుకు, నడిపేందుకు రావాలంటూ అంతర్జాతీయ వ్యాపార దిగ్గజం ఎలాన్‌ మస్క్‌కి ఎక్స్‌ ద్వారా ఆహ్వానం పలికారు చిత్ర దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. ఆరు టన్నులు బరువున్న బుజ్జి పూర్తిగా భారతదేశంలో తయారైన ఎలెక్ట్రిక్‌ వాహనమనీ, మీ సైబర్‌ ట్రక్‌ (టెస్లా), బుజ్జి కలిస్తే చూసేందుకు చాలా బాగుంటుందంటూ అందులో పేర్కొన్నారు. ఇప్పటికే బుజ్జి కారుని భారతీయ తొలి  ఫార్ములా వన్‌ రేసర్‌ కార్తికేయన్‌ నారాయణ్‌ సహా పలువురు ప్రముఖులు నడిపి మెచ్చుకున్నారు.


సత్యం కోసం పోరాటం 

అగ్ర నటుడు ఆమిర్‌ఖాన్‌ తనయుడు జునైద్‌ఖాన్‌ హీరోగా నటిస్తున్న తొలి చిత్రం ‘మహరాజ్‌’. జైదీప్‌ అహ్లావత్, షాలినీ పాండే కీలక పాత్రలు పోషిస్తున్నారు. సిద్ధార్థ్‌ పి మల్హోత్రా దర్శకుడు. తాజాగా ఈ సినిమా నుంచి జునైద్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌పాటు, విడుదల తేదీని పంచుకుంది చిత్ర బృందం. సత్యం కోసం పోరాటం అంటూ రాసుకొచ్చింది. జూన్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. 1857 సిపాయిల తిరుగుబాటు, స్వాతంత్య్ర సంగ్రామానికి ముందుకాలం నాటి వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. ‘మహిళల హక్కులు, సామాజిక సంస్కరణల కోసం అలుపెరుగని పోరాటం చేసిన ఆనాటి పాత్రికేయుడు, సంఘ సంస్కర్త కరణ్‌దాస్‌ ముల్జీ జీవితమే ఈ చిత్ర నేపథ్యం’ అని సినీవర్గాలు తెలిపాయి. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఆదిత్య చోప్రా ఈ హిస్టారికల్‌ పీరియాడిక్‌ డ్రామాని నిర్మిస్తున్నారు.


ది గాడ్‌ఫాదర్‌’ నిర్మాత కన్నుమూత 

‘ది గాడ్‌ఫాదర్‌’, ‘మిలియన్‌ డాలర్‌ బేబీ’ లాంటి ఆల్‌టైం గ్రేట్‌ చిత్రాల నిర్మాత, ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఆల్బర్ట్‌ ఎస్‌ రూడీ (94) లాస్‌ఏంజెలిస్‌లోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన పలు చిత్రాలకు రచయితగానూ పని చేశారు. కెనడాలో జన్మించిన రూడీ.. హాలీవుడ్‌లో 30 చిత్రాలు నిర్మించారు. తన జీవితకాలంలో ఆర్నాల్డ్‌ స్క్వార్జ్‌నెగర్, ఫ్రాన్సిస్‌ కొపోలా, ఫ్రాంక్‌ సినాట్రా, క్లింట్‌ ఈస్ట్‌వుడ్, ఆల్‌ పసీనో, మార్లన్‌ బ్రాండ్‌..లాంటి ఎందరో దిగ్గజాలతో కలిసి పని చేశారు. హాలీవుడ్‌లో అండర్‌వరల్డ్, మాఫియా కథాంశాలతో వచ్చిన సినిమాలకు ఆయనే ఆద్యుడుగా పేర్కొంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు