చాలా రకాలుగా ప్రత్యేకం.. సత్యభామ

‘‘నాయికా ప్రధానమైన సినిమాలు చాలా వచ్చాయి. కానీ ఇప్పటికీ వాటిలో మొదట గుర్తొచ్చేది విజయశాంతి ‘కర్తవ్యం’. అంతకంటే బలమైన నాయిక  పాత్రతో రూపొందిన సినిమానే మా ‘సత్యభామ’.

Published : 05 Jun 2024 01:06 IST

‘‘నాయికా ప్రధానమైన సినిమాలు చాలా వచ్చాయి. కానీ ఇప్పటికీ వాటిలో మొదట గుర్తొచ్చేది విజయశాంతి ‘కర్తవ్యం’. అంతకంటే బలమైన నాయిక  పాత్రతో రూపొందిన సినిమానే మా ‘సత్యభామ’. అసాధ్యమైన పనిని ఓ మహిళ సాధించిన తీరు ఈ కథలో హైలెట్‌’’ అన్నారు నిర్మాతలు బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి. అవురమ్‌ ఆర్ట్స్‌ పతాకంపై ఆ ఇద్దరూ తొలి ప్రయత్నంగా నిర్మించిన సినిమానే ‘సత్యభామ’. కాజల్‌ ముఖ్యభూమిక పోషించారు. సుమన్‌ చిక్కాల దర్శకుడు. ‘మేజర్‌’ దర్శకుడు శశికిరణ తిక్క సమర్పణలో.. ఆయన రచించిన  స్క్రీన్‌ప్లేతో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు నిర్మాతలు. 

‘‘ఇరవయ్యేళ్ల కిందట జరిగిన ఓ వాస్తవ సంఘటనని స్ఫూర్తిగా తీసుకుని ఈ కథ తయారు చేశాడు దర్శకుడు. ఈ కథని తెరపైకి తీసుకు రావాలని నిర్ణయించుకున్నాక, హీరోయిన్‌ విషయంలో ముగ్గురు, నలుగురు పేర్లు అనుకున్నా, తొలి పేరు మాత్రం కాజల్‌దే. ఒకవేళ ఆమె ఈ కథని తిరస్కరిస్తే మరో కథానాయిక దగ్గరికి వెళ్లాలనుకున్నాం. కానీ కాజల్‌ ఈ కథ విన్న వెంటనే చేయడానికి ముందుకొచ్చారు. వాస్తవానికి ఆమె ఓ కథ విన్నాక రెండు మూడు రోజుల తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తారట. కానీ ‘సత్యభామ’ కథ విషయంలో సమయమే తీసుకోలేదు. నిర్మాతలుగా మేం ఆ కథ విన్నాక ఎంత ఆత్రుతకి గురయ్యామో, ఆమె కూడా అదే అనుభూతికి గురయ్యారు. కథ, హీరోయిజం మొదలుకొని చాలా రకాలుగా ఇది ప్రత్యేకమైన సినిమా. ఓ బలమైన సందేశం కూడా  ఉంటుంది. షి సేఫ్‌ యాప్‌ గురించి  మా సినిమాలో చెప్పిన విషయాలు ఆలోచనని రేకెత్తిస్తాయి’’. 

‘‘శశికిరణ్‌ తిక్క నాకు సోదరుడు (బాబీ తిక్క). ఆయన వల్లే మేం చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాం. కొంతకాలంగా నేను, శ్రీనివాసరావు సినీ పంపిణీలో కొనసాగుతున్నాం. శశి ‘మేజర్‌’ పూర్తి చేశాక మేం సొంత నిర్మాణ సంస్థని ఏర్పాటు చేయాలనుకున్నాం. మనకు నచ్చిన కథల్ని నచ్చినట్టు తెరపైకి తీసుకు రావచ్చనే ఉద్దేశంలో భాగంగానే నిర్మాణంలోకి వచ్చాం. శశి చేతిలో వేరే ప్రాజెక్టులు ఉండటంతో మేం ‘సత్యభామ’ కథని విని ఈ సినిమాతో ప్రయాణం మొదలుపెట్టాం. తొలి సినిమాని హీరోతో కాకుండా, హీరోయిన్‌ ప్రధానమైన సినిమా తీస్తున్నారేమిటి అని చాలా మంది అడిగారు. అయితే దీన్ని హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమా అనడం కంటే, హీరోయిజం ఓరియెంటెడ్‌ సినిమా అని చెప్పాలి. అంత బలమైన పాత్రలు ఇందులో ఉన్నాయి. కాజల్‌ చక్కటి సహకారం అందించారు. ఇది నా సొంత నిర్మాణ సంస్థ అన్నారు. అంతగా ఆమెతో మాకు అనుబంధం పెరిగింది. తెలుగులో విజయవంతమైన తర్వాత, దీన్ని ఇతర భాషల్లోకి తీసుకెళ్లడంపై ఆలోచన చేస్తాం. మా తదుపరి సినిమాలు పాన్‌ ఇండియా స్థాయిలో తీసుకు రావడానికి ప్రయత్నిస్తాం’’.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని