ఆ లెక్కలన్నింటినీ పక్కనపెట్టి ‘లవ్‌ మౌళి’ తీశా!

‘‘పదేళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకున్నా... తొలి సినిమాని నిజాయతీగా చేశానని చెప్పుకునేలా ‘లవ్‌ మౌళి’ ఉంటుంది. నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో... ప్రేమని కొత్తగా ఆవిష్కరించాలని చేసిన ప్రయత్నమే ఈ చిత్రం’’

Published : 06 Jun 2024 01:14 IST

‘‘పదేళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకున్నా... తొలి సినిమాని నిజాయతీగా చేశానని చెప్పుకునేలా ‘లవ్‌ మౌళి’ ఉంటుంది. నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో... ప్రేమని కొత్తగా ఆవిష్కరించాలని చేసిన ప్రయత్నమే ఈ చిత్రం’’ అన్నారు అవనీంద్ర. రచయితగా పలు భాషల్లో పనిచేసిన అనుభవం ఆయన సొంతం. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికీ అసోసియేట్‌ రచయితగా పనిచేశారు. దర్శకుడిగా తన తొలి ప్రయత్నంగా... ‘లవ్‌ మౌళి’ చిత్రాన్ని తెరకెక్కించారు. నవదీప్‌ కథానాయకుడిగా... సి స్పేస్‌ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా అవనీంద్ర బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.

‘‘ఫాంటసీతో ముడిపడిన కథ ఇది. వాస్తవికతకి పెద్దపీట వేస్తూ... ప్రతి ప్రేక్షకుడినీ ఎక్కడో ఒక చోట బలంగా  కనెక్ట్‌ అయ్యే పాత్రలతో తెరకెక్కించా. మన చుట్టూ చాలా మందిని చూస్తుంటాం. రెండు మూడేళ్లు ప్రేమగా గడిపిన జంటలు ఆ తర్వాత విడిపోతుంటారు. అంతకుముందు వాళ్ల మధ్య ఉన్న ప్రేమ ఆ తర్వాత కనిపించదు. ఆ ప్రేమ ఏమవుతోందనే ఆలోచన నుంచి పుట్టిన కథే ఇది. ప్రేమంటే మనకు నచ్చినట్టుగా ఎదుటివ్యక్తి ఉండాలని చెప్పడం కాదు. మనకు నచ్చకపోయినా సరే... ఎదుటివ్యక్తిని తనకి నచ్చినట్టుగా తనని ఉండనివ్వాలి. ఆ విషయాన్నే ఇందులో నాదైన శైలిలో చెబుతున్నా’’. 

  • ‘‘రచయితగా పలు భాషల్లో పనిచేశా. నేను రాసినవన్నీ కమర్షియల్‌ సినిమాలే. ఒక దశలో వెగటు పుట్టింది. ఏదైనా కొత్తగా చేయాలనే ఆలోచన ఉండేది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకి పనిచేస్తున్న సమయంలోనే, సమాంతరంగా ఈ కథని రాసుకున్నా. ఆ సినిమా చేస్తున్నప్పుడే రచయితలు విజయేంద్రప్రసాద్‌ సర్,  కాంచీ అన్న ‘నువ్వు దర్శకుడయ్యే సమయం వచ్చింది’ అంటూ ప్రోత్సహించేవారు. ఆ సినిమాకి పనిచేయడం పూర్తవ్వగానే ‘లవ్‌ మౌళి’పై దృష్టిపెట్టా. మొదట ఈ కథని ఓ నవలలాగా, ఎవ్వరినీ దృష్టిలో ఉంచుకోకుండా రాశా. ఆ తర్వాత నవదీప్‌ని ఊహించుకుని ఆయనకి కథ చెప్పా. ఇలాంటి కథ కోసమే నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నానంటూ ఈ సినిమా చేయడానికి ముందుకొచ్చాడు. ఆ తర్వాత మార్కెట్‌ లెక్కలు, సమస్యల గురించి ప్రస్తావన వచ్చినా... తొలి సినిమా కాబట్టి ఈ ఒక్క సినిమాని నిజాయతీగా చేయాల్సిందే అని ఆ లెక్కలన్నింటినీ పక్కనపెట్టి ముందడుగు వేశాం’’. 
  • ‘‘ఇందులో ముద్దు సన్నివేశాలు, ఘాటైన సంభాషణలు చాలానే ఉంటాయి. అవన్నీ కథకు అవసరం కావడంతోనే. కమర్షియల్‌ సినిమాలకి భిన్నమైన కథే అయినా, ఆ తరహా చిత్రాలకి  పనిచేసిన అనుభవం ఉండటంతో ఆ మీటర్‌కి తగ్గట్టుగా సన్నివేశాల్ని రాసుకున్నా. నా దృష్టిలో ఇది కూడా కమర్షియల్‌ సినిమానే. ప్రేమతో ప్రశాంతంగా కూర్చున్న శివుడిని   మౌళి అంటారు. ఈ సినిమాకి ఆ పేరు పెట్టడానికి ఓ బలమైన కారణం ఉంది. అది సినిమా చూశాక తెలుస్తుంది. మరో 20 ఏళ్ల తర్వాత కూడా ఈ కథని మార్చడానికి ఏమీ ఉండదు. అలా అన్నీ పక్కాగా కుదిరాయి. ఇప్పటికే విశాఖపట్నంలో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించాం. మంచి స్పందన లభించింది. ముఖ్యంగా అమ్మాయిలు ఈ సినిమాకి బాగా కనెక్ట్‌ అయ్యారు’’.   

‘ప్రేమ్‌’లో కార్తిక్‌? 

త్వరలో ‘చందు ఛాంపియన్‌’గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు కథానాయకుడు కార్తిక్‌ ఆర్యన్‌. ఈ చిత్ర విడుదల అనంతరం కుటుంబ చిత్రాల దర్శకుడు సూరజ్‌ బర్జాత్యా తెరకెక్కించనున్న ‘ప్రేమ్‌’ కథలో కార్తిక్‌ భాగం కానున్నాడా?...అవుననే అంటున్నాయి చిత్ర వర్గాలు. సూరజ్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఫ్యామిలీ డ్రామా సినిమా ‘ప్రేమ్‌’. ఈ చిత్రంలో కార్తిక్‌ ఆర్యన్‌ కీలక పాత్ర పోషించనున్నాడని సమాచారం. ‘ఈ కథకు కార్తిక్‌ మాత్రమే సరిపోతాడని సూరజ్‌ నమ్ముతున్నారు. వారిద్దరి మధ్య కథ చర్చల జరిగాయి. కార్తిక్‌ కూడా ఈ సినిమా పట్ట ఆసక్తి కనబరుస్తున్నారు. జులైలో ఈ చిత్ర పూర్తి విషయాల్ని వెల్లడించనున్నార’ని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ‘భూల్‌ భులయ్యా 3’తో నవ్వులు పంచేందుకు సమాయత్తమవుతున్నాడు కార్తిక్‌ ఆర్యన్‌.


ఆస్కార్‌ ఉత్తమ నటుడి చిత్రం ‘పీకీ బ్లైండర్స్‌’

‘పీకీ బ్లైండర్స్‌’..ఇదొక బ్రిటిష్‌ పీరియాడిక్‌ క్రైమ్‌ డ్రామా సిరీస్‌. మొదటి ప్రపంచ యుద్ధం అనంతరం పీకీ బ్లైండర్స్‌ అనే ముఠా చేసిన దోపిడీల కథనంతో దీన్ని రూపొందించారు. ఆరు భాగాలుగా అలరించిన ఈ సిరీస్‌కు స్టీవెన్‌ నైట్‌ కథను సమకూర్చారు. ఈ ఏడాది ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ అవార్డు అందుకున్న సిలియన్‌ మర్ఫి ఇందులో గ్యాంగ్‌స్టర్‌ టామీ షెల్బీ అనే కీలక పాత్ర పోషించారు. ఇప్పుడీ సిరీస్‌ చిత్రంగా అభిమానుల ముందుకు రానుంది. ఇంకా పేరు ఖరారు కాని ఈ చిత్రానికి టామ్‌ హర్పర్‌ దర్శకత్వం వహించనున్నారు. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్‌ తన ట్విటర్‌ ఖాతాలో ప్రేక్షకులతో పంచుకుంది. ‘టామీ షెల్బీ తిరిగి వస్తున్నాడు. సిలియన్‌ మర్ఫీ నటించిన ‘పీకీ బ్లైండర్స్‌’ నెట్‌ఫ్లిక్స్‌లో రానుంది’ అంటూ వ్యాఖ్యల్ని జోడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని