ఆ విషయాన్ని చాటేలా నా తదుపరి చిత్రం

‘‘నాకు దర్శకత్వంలో అమ్మ ప్రేమ కనిపిస్తే... నిర్మాణంలో నాన్న తరహా బాధ్యత అనుభవంలోకి వచ్చింది. ఈ కొత్త పాత్ర కారణంగా సినిమాని మరో కొత్త కోణంలో, మరింత విస్తృతమైన పరిధిలో చూసే అవకాశం కలిగింది’’ అన్నారు శశికిరణ్‌ తిక్క.

Published : 07 Jun 2024 00:35 IST

‘‘నాకు దర్శకత్వంలో అమ్మ ప్రేమ కనిపిస్తే... నిర్మాణంలో నాన్న తరహా బాధ్యత అనుభవంలోకి వచ్చింది. ఈ కొత్త పాత్ర కారణంగా సినిమాని మరో కొత్త కోణంలో, మరింత విస్తృతమైన పరిధిలో చూసే అవకాశం కలిగింది’’ అన్నారు శశికిరణ్‌ తిక్క. ‘గూఢచారి’, ‘మేజర్‌’ చిత్రాలతో తన ప్రతిభని చాటి చెప్పిన దర్శకుడీయన. ‘సత్యభామ’తో నిర్మాణంలోకి అడుగుపెట్టి సమర్పకుడిగా కొత్త బాధ్యతల్ని నిర్వర్తించారు. కాజల్‌ ప్రధాన పాత్రధారిగా నటించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా శశికిరణ్‌ తిక్క గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.

‘‘ర్శకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు సృజనాత్మక కోణంలో ఆలోచిస్తూ ముందుకు వెళుతుంటాం. అది తప్ప మరో ధ్యాస ఉండదు. కానీ నిర్మాణంలో సృజనాత్మక కోణంతోపాటు, ఆర్థిక వ్యవహారాలు, సమన్వయ బాధ్యతలు ఇలా చాలానే ఉంటాయి. చాలా ఆసక్తికరమైన పని. ఈ సినిమా ప్రయాణంతో నిర్మాతలపై నాకు మరింత గౌరవం పెరిగింది. ‘గూఢచారి’ సమయం నుంచే నిర్మాణంపై దృష్టి ఉండేది. అవురమ్‌ ఆర్ట్స్‌ పతాకంపై సినిమాలు చేయాలనుకున్నాం. అప్పుడే యూకేలో ఉండే మా మిత్రులు రమేశ్, ప్రశాంత్‌ ఈ కథ చెప్పారు. అది నచ్చి దాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నంలో ఉండగానే ‘మేజర్‌’ మొదలైంది. అది పూర్తయ్యాక మళ్లీ ‘సత్యభామ’ స్క్రిప్ట్‌పై దృష్టిపెట్టాం. కాజల్‌కి కథ చెబితే ఆమె వెంటనే అంగీకారం తెలిపారు’’. 

  • ‘‘ఈ సినిమాకి నేను దర్శకత్వం చేయకపోవడానికి కారణం నాకున్న వేరే ఒప్పందాలే. నేను, సుమన్, శ్రీచరణ్‌ పాకాల... మేమంతా ఎప్పటినుంచో కలిసి ప్రయాణం చేస్తున్నాం. మేమంతా కలిసే ఈ సినిమా చేశాం. ఈ కథకి కాజల్‌ని ఎంచుకోవడానికి కారణం హుషారైన ఆమె వ్యక్తిత్వమే. భావోద్వేగాలు, యాక్షన్‌ ప్రధానంగా సాగే కథ ఇది. కాజల్‌ శైలికి ఈ కథకి బాగా నప్పుతుంది. ఆమె ఇదివరకు చేసిన పాత్రలు గ్లామర్‌ ప్రధానంగానే సాగినా, సినిమాలో కంటే ఆమె బయట ఉండే తీరుని గమనించే సంప్రదించాం. ఆమె చక్కటి అభినయం ప్రదర్శించారు. ఇందులో ఓ సరికొత్త కాజల్‌ని చూస్తారు. నవీన్‌చంద్ర, ప్రకాశ్‌రాజ్, నాగినీడు, రవివర్మ, హర్షవర్ధన్‌ తదితరులు పాత్రలు ఆకట్టుకుంటాయి’’.
  • ‘‘దర్శకుడిగా నేను చేసే చిత్రాన్ని త్వరలోనే ప్రకటిస్తా. నా నుంచి థ్రిల్లర్స్‌ మాత్రమే కాకుండా,  అన్ని రకాల చిత్రాలూ వస్తాయని చాటేలా ఉంటుంది నా తదుపరి చిత్రం. నిర్మాణం కోసం కూడా కొన్ని కథలు ఉన్నాయి. దర్శకత్వం, నిర్మాణం, ఎడిటింగ్‌... ఇలా నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి’’.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని