ఉపేంద్ర ‘ఎ’ మరోసారి

ఉపేంద్ర సినిమాల్లో ‘ఎ’ ఒక సంచలనం. 1998లో విడుదలైన ఆ సినిమా అప్పట్లో ఘన విజయాన్ని అందుకుంది.

Updated : 08 Jun 2024 05:51 IST

పేంద్ర సినిమాల్లో ‘ఎ’ ఒక సంచలనం. 1998లో విడుదలైన ఆ సినిమా అప్పట్లో ఘన విజయాన్ని అందుకుంది. ఉపేంద్ర నటన, ఆయన దర్శకత్వం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. ఆ చిత్రాన్ని ఈ నెల 21న మరోసారి  తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. చందు ఎంటర్‌టైన్‌మెంట్, ఉప్పి క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాయి. నిర్మాత లింగం యాదవ్‌ మాట్లాడుతూ ‘‘26 ఏళ్ల కిందట ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం అప్పట్లోనే రూ. 20కోట్లకుపైగా వసూళ్లు సాధించి సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. కన్నడ పరిశ్రమలో ఓ ప్రత్యేకమైన ట్రెండ్‌ని సెట్‌ చేసిన ఈ సినిమా, ఇటీవలే మరోసారి విడుదలై మంచి స్పందనని సొంతం చేసుకుంది. తెలుగు ప్రేక్షకుల్నీ అదే స్థాయిలో అలరిస్తుందని ఆశిస్తున్నాం’’ అన్నారు. 


పుట్టినరోజు హంగామా 

వికృష్ణ, సమీర్‌ మళ్లా, రాజీవ్‌ కనకాల ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘ది బర్త్‌డే బాయ్‌’. విస్కి దర్శకుడు. బొమ్మా బొరుసా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రచార చిత్రాన్ని శుక్రవారం విడుదల చేసింది చిత్రబృందం. ఇద్దరు స్నేహితులు మాట్లాడుకుంటున్న సరదా సంభాషణలతో ప్రారంభమై, చిత్రంలోని పాత్రల్ని పరిచయం చేస్తుంది టైటిల్‌తో కూడిన ఈ ప్రచార చిత్రం. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఇదొక కామెడీ డ్రామా చిత్రం. ఎం.ఎస్‌ చదవడానికి విదేశాలకి వెళ్లినప్పుడు ఐదుగురు చిన్ననాటి స్నేహితులకు ఎదురైన  సంఘటనల ఆధారంగా తెరకెక్కించాం. ఈ సినిమా సహజత్వం కోసం సింక్‌ సౌండ్‌ని వాడాం. మంచి సాంకేతిక విలువలతో, నాణ్యమైన సినిమాని ప్రేక్షకులకు అందిస్తాం. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకుల్ని అలరిస్తుంది’’ అన్నారు. ప్రమోదిని, వాకా మణి, రాజా అశోక్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: ఐ. భరత్, ఛాయాగ్రహణం: సంకీర్త్‌ రాహుల్, సంగీతం: ప్రశాంత్‌ శ్రీనివాస్‌.


న్యాయం కోసం వస్తున్నాం

‘‘ఎలా పోరాడాలో తెలియదు.. కానీ నాకు తెలిసిందల్లా యుద్ధమొక్కటే’’ అంటూ ఇటీవలే తన రాబోయే చిత్రం ‘వేదా’ ప్రపంచాన్ని పరిచయం చేసింది బాలీవుడ్‌ నాయికా శార్వరీ వాఘ్‌. ఆమె, జాన్‌ అబ్రహం, అభిషేక్‌ బెనర్జీ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రమిది. నిఖిల్‌ అడ్వాణీ తెరకెక్కిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా జులై 12న విడుదల కానున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా కొత్త విడుదల తేదీని తెలుపుతూ.. ఇన్‌స్టా వేదికగా ఓ పోస్టర్‌ను పంచుకుంది నిర్మాణసంస్థ. ‘‘న్యాయం కోసం వచ్చేస్తున్నాము. ఆగస్టు 15న రాబోతుంది ‘వేదా’’ అని వ్యాఖ్యల్ని జోడించింది. యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో తమన్నా కీలక పాత్రలో మెరవనుంది. జీ స్టూడియోస్‌తో కలిసి జాన్‌ అబ్రహం, మోనీషా అడ్వాణీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


పురాణాలు + సైన్స్‌ = ‘ఎ మాస్టర్‌పీస్‌’ 

‘‘సూపర్‌ హీరో పాత్రకు... మన పురాణాల నేపథ్యాన్ని జోడించి రూపొందించిన చిత్రమే  ‘ఎ మాస్టర్‌ పీస్‌’ అన్నారు సుకు పూర్వజ్‌. ‘శుక్ర’, ‘మాటరాని మౌనమిది’ చిత్రాల్ని తెరకెక్కించిన ఆయన దర్శకత్వంలో రూపొందిన సినిమానే ‘ఎ మాస్టర్‌ పీస్‌’. మనీష్‌ గిలాడ, అరవింద్‌ కృష్ణ, జ్యోతి పూర్వజ్, ఆషురెడ్డి ప్రధాన పాత్రధారులు. శ్రీకాంత్‌ కండ్రేగుల, మనీష్‌ గిలాడ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ విడుదల కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. దర్శకుడు మాట్లాడుతూ ‘‘భాగవతంలోని జయ విజయలు నేపథ్యంలో హీరో, విలన్‌ పాత్రల్ని డిజైన్‌ చేస్తూ రూపొందిస్తున్న చిత్రమిది. పురాణాల్ని, సైన్స్‌నీ కలిపి చేశాం. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామ’’న్నారు. కథానాయకుడు అరవింద్‌ కృష్ణ మాట్లాడుతూ ‘‘నాకు ఈ అవకాశం వచ్చే ముందు అబ్బాయి పుట్టాడు. మా అబ్బాయికి నేను ఓ సూపర్‌ హీరోలా ఉండాలనుకన్నా. అలా అనుకున్న సమయంలోనే నాకు సూపర్‌ హీరో సినిమాలో అవకాశం రావడం ఎంతో థ్రిల్లింగ్‌గా అనిపించింది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత శ్రీకాంత్‌ కండ్రేగుల,  ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత మాధవ్, కథానాయిక జ్యోతి పూర్వజ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు