రామోజీరావుకు భారతరత్న ఇవ్వడం సముచితం

అక్షర శిల్పిగా పాత్రికేయంతో సమాజంపై చెరగని ముద్ర వేసిన రామోజీరావు.. నిర్మాతగా ఉషాకిరణ్‌ మూవీస్‌తో చైతన్యదీప్తుల్లాంటి చిత్రరాజాలను అందించి తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఓ పేజీ రాసుకున్నారు.

Updated : 09 Jun 2024 17:08 IST

అక్షర శిల్పిగా పాత్రికేయంతో సమాజంపై చెరగని ముద్ర వేసిన రామోజీరావు.. నిర్మాతగా ఉషాకిరణ్‌ మూవీస్‌తో చైతన్యదీప్తుల్లాంటి చిత్రరాజాలను అందించి తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఓ పేజీ రాసుకున్నారు. ఇక ఆయన సృష్టించిన రామోజీ ఫిల్మ్‌ సిటీ భారతీయ చిత్ర పరిశ్రమకే మకుటాయమానం. అందుకే రామోజీ మరణం యావత్‌ సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ నేపథ్యంలోనే ఆయన సినీ రంగానికి చేసిన సేవల్ని కొనియాడుతూ.. వారితో అనుబంధాన్ని గుర్తు చేసుకుని నివాళులు అర్పించారు పలువురు సినీతారలు.

‘‘ఎవరికీ తలవంచని మేరు పర్వతం దివికేగింది. ఆయన కలల్ని, ఆశయాల్ని కుటుంబ సభ్యులు ముందుకు తీసుకెళ్లాలి. అందరూ ఆయనలో ఒక గంభీరమైన వ్యక్తిని చూస్తే.. నేను పసి పిల్లవాణ్ని చూశాను. 2009 సమయంలో వారిని తరచూ కలిసి ప్రజారాజ్యం పార్టీకి సంబంధించి సలహాలు, సూచనలు తీసుకునేవాణ్ని. అప్పట్లో ఆయనకు ఒక పెన్ను ఇస్తే ఎంతో సంతోషంగా తీసుకున్నారు. తెగ సంబరపడిపోయారు. అంతేకాదు ఆయన దాచుకున్న పెన్నుల్ని నాకు చూపించారు. సమాజానికి ఏం చేయాలో నిత్యం అక్షర రూపంలో రాసేవారు ఆయన. రామోజీరావు మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు’’. 

నటుడు చిరంజీవి


‘‘నా గురువు.. శ్రేయోభిలాషి రామోజీరావు మరణవార్త నన్ను ఎంతగానో బాధించింది. జర్నలిజం, సినిమా రంగాల్లో ఆయన చరిత్ర సృష్టించారు. రాజకీయాల్లో ఆయన కింగ్‌ మేకర్‌’’.

రజనీకాంత్‌


‘‘భారతీయ మీడియా, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుడు, ఈనాడు గ్రూపు ఛైర్మన్‌ రామోజీరావు మరణ వార్త తెలిసి చాలా బాధపడ్డా. రామోజీ ఫిల్మ్‌ సిటీ సినిమా గౌరవార్థం అంకితం చేయబడింది. ఇది షూటింగ్‌ లొకేషన్‌ మాత్రమే కాదు. ప్రముఖ పర్యటక కేంద్రం కూడా. అంత దూరదృష్టి ఉన్న వినూత్న ఆలోచనాపరుడు మరణించడం భారతీయ సినిమాకు తీరని లోటు’’.

కమల్‌హాసన్‌


‘‘రామోజీరావు నిజమైన దార్శనికుడు. భారతీయ మీడియాలో ఆయన విప్లవాత్మక కృషి చేశారు. జర్నలిజం, సినీ రంగంలో ఆయన చేసిన కృషి ఎంతోమందికి స్ఫూర్తి. ఆయన ఆత్మకు శాంతి కలగాలి’’.

వెంకటేశ్‌


‘‘రామోజీరావు గొప్ప దార్శనికుడు. ప్రతి రంగంలోనూ విజయాల్ని అందుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’’.

నాగార్జున


‘‘ఒక్క మనిషి అనేక రంగాల్లో వివిధ సంస్థలు స్థాపించి వాటిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు. ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచారు. మరెంతో మందికి ఉపాధి కల్పించారు. అలాంటి రామోజీరావుకు కచ్చితంగా భారతరత్న ఇవ్వాలి. ఆ పురస్కారం వారికి ఇవ్వడం సముచితమని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా’’.

దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి


‘‘ఉత్తమ విలువలతో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిన మన అందరి శ్రేయోభిలాషి..రామోజీరావు. మనస్ఫూర్తిగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’’.

దర్శకుడు కె. రాఘవేంద్రరావు


‘‘ఎప్పుడూ ముందుండే.. దూరదృష్టి గల రామోజీరావు ఇక లేరని తెలిసి చాలా బాధపడ్డాను. రామోజీ ఫిల్మ్‌ సిటీ సినిమాపై ఆయనకున్న అభిరుచికి నిదర్శనం. ఆయన వారసత్వం మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుంది’’.

మహేశ్‌బాబు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని