కొత్త చిత్రానికి శ్రీకారం

అవినాష్‌ తిరువీధుల, సిమ్రాన్‌ చౌదరి జంటగా కార్తి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. శాంతనూపతి, ఆలపాటిరాజా, అవినాష్‌ బుయాని, అంకిత్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Published : 10 Jun 2024 00:53 IST

వినాష్‌ తిరువీధుల, సిమ్రాన్‌ చౌదరి జంటగా కార్తి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. శాంతనూపతి, ఆలపాటిరాజా, అవినాష్‌ బుయాని, అంకిత్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రముఖ రచయిత సాయిమాధవ్‌ బుర్రా ఈ చిత్ర స్క్రిప్ట్‌ను పర్యవేక్షించడంతో పాటు స్వయంగా సంభాషణలందించారు. ఈ సినిమా ఆదివారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముఖ్య అతిథులుగా విచ్చేసిన నిర్మాత టి.జి.విశ్వప్రసాద్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా.. దర్శకుడు బాబీ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం దర్శకుడు కార్తి మాట్లాడుతూ.. ‘‘కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ట్రీట్‌ లాంటి చిత్రమిది. కథకు తగ్గట్లుగా మంచి నటీనటులు, సాంకేతిక నిపుణులు కుదిరారు. సోమవారం నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తాం. దీన్ని మూడు షెడ్యూల్స్‌లో పూర్తి చేస్తాం’’ అన్నారు. ‘‘మంచి హిట్‌ సినిమాకి కావాల్సిన అన్ని అంశాలు దీంట్లో ఉన్నాయి. సాయిమాధవ్‌ సంభాషణలు ఈ చిత్రానికి ఆకర్షణగా నిలుస్తాయి’’ అన్నారు నిర్మాత శాంతనూపతి. ఈ కార్యక్రమంలో తాండూర్‌ ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్‌ నాయుడు, అవినాష్, సాక్షి చౌదరి, విశ్వజిత్, అంబిక కృష్ణ, దామోదర్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 


గుజరాతీ చిత్రంలో.. దేవుడి పాత్రలో 

రికొద్ది రోజుల్లో ‘కల్కి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు బాలీవుడ్‌ అగ్రకథానాయకుడు అమితాబ్‌ బచ్చన్‌. ఈయన 2022లో విడుదలైన ‘ఫక్త్‌ మహిళా వో మాతే’ అనే గుజరాతీ చిత్రంలో వ్యాఖ్యాతగా కనిపించి సినీప్రియుల్ని మెప్పించిన సంగతి తెలిసిందే. ఇటీవలే దీనికి సీక్వెల్‌గా ‘ఫక్త్‌ పురుషో మాతే’ను ప్రకటించింది చిత్రబృందం. జేబోదాస్, పార్థ్‌ త్రివేది సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఇప్పుడు రాబోయే ప్రాజెక్టులో కూడా ఆయన మరోసారి అతిథి పాత్రలో మెరవనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత ఆనంద్‌ పండిట్‌ మాట్లాడుతూ..‘‘తొలి భాగంలో కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించారాయన. ఇప్పుడు రాబోయే సీక్వెల్‌లో బచ్చన్‌ దేవుడి పాత్రను పోషించారు. ఈ సినిమాకే ఆయన పాత్ర చాలా కీలకం. ఆయన లేనిదే ఈ ప్రాజెక్టును ఊహించుకోవడం కష్టమ’’ని చెప్పుకొచ్చారు. ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో యశ్‌ సోని, మిత్రా గాధ్వి, దర్శన్‌ జరీవాలా తదితరులు నటిస్తున్నారు. త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నట్లు తెలిపారు.


వినోదాల ఎక్స్‌ప్రెస్‌ 

చైతన్యరావు, హెబ్బా పటేల్‌ జంటగా బాల రాజశేఖరుని తెరకెక్కించిన చిత్రం ‘హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌’. కేకేఆర్, బాలరాజ్‌ సంయుక్తంగా నిర్మించారు. తనికెళ్ల భరణి, సుహాసిని, అలీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర టీజర్‌ను నటి అమల అక్కినేని ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘టీజర్‌ ఫన్నీగా, రొమాంటిక్‌గా ఉంది. ప్రస్తుత సమాజంలోని వివాహ బంధాల గురించి ఒక బలమైన కథను చూపించనున్నట్లు అర్థమవుతోంది. దీన్ని అందరూ ఆదరించి, ఆశీర్వదించాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘ఇది మంచి రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌. ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుంది. తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుంది’’ అన్నారు దర్శకుడు బాల రాజశేఖరుని. ఈ సినిమాకి సంగీతం: కల్యాణి మాలిక్, ఆర్పీ పట్నాయక్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని