దుర్మార్గుల పాలిట అసురుడు

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో ఓ మాస్‌ యాక్షన్‌ చిత్రం రూపొందుతోంది. దీన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాబీ దేవోల్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.

Updated : 11 Jun 2024 09:13 IST

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో ఓ మాస్‌ యాక్షన్‌ చిత్రం రూపొందుతోంది. దీన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాబీ దేవోల్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. సోమవారం బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి గ్లింప్స్‌ విడుదల చేశారు. ‘‘దేవుడు చాలా మంచోడు అయ్యా. దుర్మార్గులకు కూడా వరాలిస్తాడు. వీళ్ల అంతు చూడాలంటే కావాల్సింది జాలి, కరుణ, దయ.. ఇలాంటి పదాలకు అర్థమే తెలియని అసురుడు’’ అంటూ ఓ శక్తిమంతమైన డైలాగ్‌తో బాలకృష్ణను యాక్షన్‌ కోణంలో పరిచయం చేసిన తీరు ఆసక్తిరేకెత్తించేలా ఉంది. ఆఖర్లో ఆయన శత్రువు తల నరికి.. గుర్రంపై కూర్చొని ఖడ్గం పైకెత్తి సింహనాదం చేసిన తీరు గ్లింప్స్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శరవేగంగా చిత్రీకరణ జరుగుతున్న ఈ సినిమాకి తమన్‌ సంగీతమందిస్తుండగా.. విజయ్‌ కార్తీక్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.  

‘‘బీబీ4’’ అధికారికం

కథానాయకుడు బాలకృష్ణ.. దర్శకుడు బోయపాటి శ్రీనుల కలయికకు సినీప్రియుల్లో మంచి క్రేజ్‌ ఉంది. వీళ్లిద్దరి నుంచి వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్‌’, ‘అఖండ’ బాక్సాఫీస్‌ ముందు భారీ విజయాలందుకున్నాయి. ఇప్పుడీ కాంబో నుంచి నాలుగో సినిమా రానుంది. సోమవారం బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ‘బీబీ4’ వర్కింగ్‌ టైటిల్‌తో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమాని 14రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మించనున్నారు. బాలయ్య కూతురు నందమూరి తేజస్విని సమర్పిస్తున్నారు. అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌లో ‘అఖండ’లో కనిపించిన రథచక్రం, రుద్రాక్షలు దర్శనమిచ్చాయి. దీన్ని బట్టి ఇది ఆ చిత్రానికి కొనసాగింపుగా ఉండే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్‌ పనులు పూర్తయినట్లు తెలిసింది. త్వరలోనే రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలు కానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని