ఆసక్తి కరమైన థ్రిల్లర్‌.. యేవమ్‌

చాందినీ చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాశ్‌ దంతులూరి తెరకెక్కించిన చిత్రం ‘యేవమ్‌’. నవదీప్, పవన్‌ గోపరాజు సంయుక్తంగా నిర్మించారు. వశిష్ఠ సింహా, భరత్‌రాజ్, ఆషు రెడ్డి ముఖ్య పాత్రలు పోషించారు.

Published : 12 Jun 2024 00:34 IST

చాందినీ చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాశ్‌ దంతులూరి తెరకెక్కించిన చిత్రం ‘యేవమ్‌’. నవదీప్, పవన్‌ గోపరాజు సంయుక్తంగా నిర్మించారు. వశిష్ఠ సింహా, భరత్‌రాజ్, ఆషు రెడ్డి ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ఇటీవల విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. హీరో విష్వక్‌ సేన్, దర్శకుడు సందీప్‌ రాజ్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విష్వక్‌ మాట్లాడుతూ.. ‘‘బాగా టెన్షన్‌ పడే వ్యక్తి చాందిని. ఆమె ఈ సినిమాతో ఆ భయాన్ని పోగొట్టుకుంది. ఈ నాయికా ప్రాధాన్య చిత్రానికి సంగీత దర్శకత్వం, ఎడిటింగ్‌ మహిళలు చేయడం చాలా ఆనందంగా ఉంది. అన్ని రంగాల్లో అమ్మాయిలు ఉండాలనేది నా కోరిక. ఈ సినిమా చిత్ర బృందానికి మంచి బ్రేక్‌ ఇవ్వాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘మంచి నాయికా ప్రాధాన్య కథ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఈ సినిమా నా దగ్గరకొచ్చింది. దీంట్లో నేను పోలీసు పాత్రలో కనిపిస్తా. యాక్షన్‌తో పాటు అన్ని కోణాలు నా పాత్రలో ఉంటాయి. ఇది కచ్చితంగా అందర్నీ అలరిస్తుందని నమ్ముతున్నా’’ అంది నటి చాందిని. నిర్మాత నవదీప్‌ మాట్లాడుతూ.. ‘‘మంచి కథతో నిజాయతీగా చేసిన చిత్రమిది. ఇది చాందిని కెరీర్‌లో ఉత్తమ సినిమాగా నిలవాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘అందర్నీ అలరించే ఆసక్తికరమైన థ్రిల్లర్‌ ఇది. మేము ఊహించిన దానికన్నా మంచి అవుట్‌పుట్‌ ఇచ్చాం’’ అన్నారు దర్శకుడు ప్రకాశ్‌. 


ఛాంపియన్‌ అని నిరూపించుకున్నాడు 

చందు ఛాంపియన్‌’గా కార్తిక్‌ ఆర్యన్‌ ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. మురళీకాంత్‌ పేట్కర్‌ జీవితం ఆధారంగా వస్తున్న ఈ చిత్రాన్ని కబీర్‌ ఖాన్‌ తెరకెక్కించారు. సాజిద్‌ నడియాడ్‌వాలా నిర్మాత. శుక్రవారం ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఈ చిత్రం నుంచి మరో ట్రైలర్‌ని సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు నిర్మాత. ‘ప్రపంచం అతణ్ని కేవలం చందులా చూసింది. కానీ, అతను ఛాంపియన్‌ అని నిరూపించుకున్నాడు’ అంటూ రాసుకొచ్చారు. కార్తిక్, ఇతర సైనికులు జవాన్లుగా కఠిన శిక్షణ పొందుతున్నట్లు కనిపిస్తున్న ట్రైలర్‌ చిత్రంపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమా కార్తిక్‌ ఆర్యన్‌ సినీ జీవితంలో ఓ మైలురాయిగా నిలుస్తుందని చిత్రబృందం పేర్కొంది. 


విలువలతో... కల్యాణ వైభోగమే 

సుమన్‌ తేజ్, గరీమ చౌహాన్‌ జంటగా... డ్రీమ్‌ గేట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సీతా కళ్యాణ వైభోగమే’. సతీశ్‌ పరమవేద దర్శకత్వం వహించారు.  రాచాల యుగంధర్‌ నిర్మాత. ఈ సినిమా 21న రానుంది. ఈ సందర్భంగా ఇటీవల హైదరాబాద్‌లో ట్రైలర్‌ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. నిర్మాత హర్షిత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్‌ని ఆవిష్కరించారు. ‘‘దర్శకుడు సతీశ్‌ నాకు ‘ఓ మై ఫ్రెండ్‌’ నుంచే తెలుసు. ఈ కథాలోచనని ఏడాదిన్నర కిందటే చెప్పాడు. ప్రేక్షకుల మెప్పు పొందాలని కోరుకుంటున్నా’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘శ్రీరాముడి గుడి లేని ఊరు అరుదు. ఆయన బతికిన విధానం వల్లే అందరికీ గుర్తుండిపోయారు. అలాంటి విలువలతోనే కుటుంబ సమేతంగా చూసేలా ఈ సినిమాని తీర్చిదిద్దా’’న్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘ఊరికి ఉత్తరాన’  సినిమాతో దర్శకుడు సతీశ్‌ తన ప్రతిభని చాటి చెప్పారు. మరో మంచి కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. సుమన్‌తేజ్, గరీమ నటనకి మంచి పేరొస్తుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో బెక్కం వేణుగోపాల్, గగన్‌ విహారి, చరణ్‌ అర్జున్, సత్య నారాయణ, దేవరాజ్‌ పాలమూరి, రమణారెడ్డి, నీరూస్‌ ఆసిం తదితరులు పాల్గొన్నారు. 


దేవకీ నందనుడు పూర్తి చేశాడు 

దేవకీ నందన వాసుదేవ’గా ప్రేక్షకుల్ని పలకరించనున్నారు అశోక్‌ గల్లా. ఆయన హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అర్జున్‌ జంధ్యాల తెరకెక్కిస్తున్నారు. సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. వారణాసి మానస కథానాయిక. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్లు చిత్ర బృందం మంగళవారం ప్రకటించింది. ‘‘ఆధ్యాత్మిక అంశాలతో కూడిన ఫ్యామిలీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా ఉంటుంది. నిర్మాణానంతర పనులు పూర్తి చేసి త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని