డబుల్‌ ధమాకా.. వినోదాల సీక్వెల్స్‌ రాక!

సినీ రంగంలో సీక్వెల్‌ చిత్రాలు జోరు చూపిస్తున్నాయి. ఇప్పుడంతా అదే ట్రెండ్‌ ఫాలో అవుతోంది. ఈ విషయంలో ఎన్నో ఏళ్ల నుంచి బాలీవుడ్‌ మంచి హవా చూపిస్తోంది.

Published : 12 Jun 2024 00:38 IST

సినీ రంగంలో సీక్వెల్‌ చిత్రాలు జోరు చూపిస్తున్నాయి. ఇప్పుడంతా అదే ట్రెండ్‌ ఫాలో అవుతోంది. ఈ విషయంలో ఎన్నో ఏళ్ల నుంచి బాలీవుడ్‌ మంచి హవా చూపిస్తోంది. హిందీ ఫ్రాంచైజీ చిత్రాల్లో నవ్వులు పూయించి, ప్రేక్షకులను అలరించిన సినిమాల్లో ‘ధమాల్‌’ ఒకటి.  2007లో ఇంగ్లిష్‌ ఎపిక్‌ కామెడీ చిత్రం ‘ఇట్స్‌ ఎ మ్యాడ్, మ్యాడ్, మ్యాడ్, మ్యాడ్‌ వరల్డ్‌’ ఆధారంగా ఇంద్ర కుమార్‌ తెరకెక్కించారు. దానికి కొనసాగింపుగా వచ్చిన ‘డబుల్‌ ధమాల్‌’, ‘టోటల్‌ ధమాల్‌’ సినిమాలు అభిమానుల్ని ఆకట్టుకున్నాయి. అజయ్‌ దేవగణ్, అనిల్‌ కపూర్, సంజయ్‌ దత్, రితేష్‌ దేశ్‌ముఖ్, మాధురి దీక్షిత్, అర్షద్‌ వార్సి తదితరులు నటించారు. ఇప్పుడీ ఫ్రాంచైజీలో నాలుగో చిత్రం రూపొందనున్నట్లు సమాచారం. ‘‘ధమాల్‌4’ని భూషణ్‌ కుమార్‌ నిర్మిస్తారు. ఈ సిరీస్‌ చిత్రాల్లో భారీ చిత్రం ఇదే అవుతుంది. దర్శకుడు ఇంద్ర కుమార్‌ ఇప్పటికే కథను సిద్ధం చేశారు. నటీనటులంతా ఈ చిత్రంలో ఒక కొత్త ప్రపంచాన్ని చూపించేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ ఏడాది చివరి నాటికి చిత్రీకరణను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్రబృందం. మాధురి, అజయ్, అనిల్‌ కపూర్‌ మళ్లీ సందడి చేస్తారు’ అని సన్నిహిత వర్గాలు తెలిపాయి. 


‘మస్తీ’..మరోసారి

ముగ్గురు బ్యాచ్‌లర్స్‌ చుట్టూ తిరిగే కథనంతో ఇంద్ర కుమార్‌ తెరకెక్కించిన చిత్రం ‘మస్తీ’. రితేష్‌ దేశ్‌ముఖ్, వివేక్‌ ఒబేరాయ్, అఫ్తబ్‌ శివదాసని కీలక పాత్రలు పోషించారు. 2004లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు ముందు మంచి వసూళ్లనే అందుకుంది. కొనసాగింపుగా వచ్చిన ‘గ్రాండ్‌ మస్తీ’, ‘గ్రేట్‌ గ్రాండ్‌ మస్తీ’ చిత్రాలు కూడా మంచి విజయాన్నే అందుకున్నాయి. ఇప్పుడీ ఈ ఫ్రాంచైజీలో కూడా ‘మస్తీ4’ రానున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఒక ఆసక్తికరమైన ట్విస్ట్‌ ఉంటుందని సమాచారం. త్వరలో చిత్రీకరణను పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతుందట చిత్రబృందం. వచ్చే ఏడాది విడుదల కానున్నట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని