Vidudhala Part1: తమిళ బ్లాక్‌బస్టర్‌ ‘విడుదల: పార్ట్‌1’ ఇప్పుడు తెలుగులో.. ట్రైలర్‌ చూశారా?

Vidudhala Part1: విజయ్‌సేతుపతి, సూరి కీలక పాత్రల్లో వెట్రిమారన్‌ తెరకెక్కించిన ‘విడుదల పార్ట్‌-1’ తెలుగులో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ విడుదలైంది.

Updated : 11 Apr 2023 14:19 IST

హైదరాబాద్‌:  ‘మనిషి పుట్టగానే ఒకరు పైన.. ఒకరు కింద.. మరొకరు ఇంకా కింద.. అని వేరు చేసే మీరు వేర్పాటు వాదులా? లేదు అందరూ సమానమే అని పోరాడే మేము వేర్పాటు వాదులమా?’ అని ప్రశ్నిస్తున్నారు విజయ్‌ సేతుపతి (VijaySethupathi). వెట్రిమారన్‌ (Vetri Maaran) దర్శకత్వంలో సూరి(Soori)తో కలిసి ఆయన కీలక పాత్రలో నటించిన చిత్రం ‘విడుదల: పార్ట్‌-1’ (Vidudhala Part1). ఇప్పటికే తమిళంలో ‘విడుదలై-1’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. వెట్రిమారన్‌ టేకింగ్‌, సూరి, విజయ్‌ సేతుపతిల నటనకు ప్రేక్షకులు నిరాజనం పట్టారు. విమర్శకులను సైతం మెప్పించిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగులోనూ విడుదల కాబోతోంది. ఏప్రిల్‌ 15వ తేదీన తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే ‘కాంతారా’ వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాన్ని తెలుగువారికి అందించిన గీతా ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఈ చిత్రాన్ని విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసే ప్రజాదళం ఏంటి? దాని మాస్టర్‌ పెరుమాళ్‌ (విజయ్‌ సేతుపతి) అతడి అనుచరులను పట్టుకునేందుకు పోలీసులు ఏం చేశారు? ఈ క్రమంలో వారికి ఎదురైన పరిస్థితులు ఏంటి? నిజాయతీ కలిగిన కానిస్టేబుల్‌ కుమార్‌ (సూరి) పట్ల పై అధికారులు ఎలా ప్రవర్తిస్తారు? పెరుమాళ్‌ను పట్టుకునేందుకు కుమార్‌ చేసిన ప్రయత్నం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

మరోవైపు ఈ సినిమాను తమిళంలో వీక్షించిన స్టార్‌ హీరో రజనీకాంత్‌ (Rajinikanth) చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించారు. దీన్నొక ‘మాస్టర్ పీస్‌’గా అభివర్ణించారు. ‘‘విడుదలై’లాంటి కథను ఇంతకుముందెన్నడూ తమిళ సినిమాల్లో చూడలేదు. నిజంగా ఇది మాస్టర్‌ పీస్‌. సూరి యాక్టింగ్‌ మైండ్ బ్లోయింగ్‌గా ఉంది. ఇళయరాజా సంగీతం అద్భుతం. తమిళ సినిమా గర్వించే దర్శకుడు వెట్రిమారన్‌. నిర్మాతలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ‘విడుదలై పార్ట్‌-2’ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అని ట్విటర్‌ వేదికగా రజనీ పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని