Mumbaikar: విజయ్‌ సేతుపతి తొలి హిందీ చిత్రం.. నేరుగా ఓటీటీలోకి.. ఉచితంగా!

విజయ్‌ సేతుపతి హీరోగా నటించిన తొలి హిందీ సినిమా ‘ముంబైకర్‌’ నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. ఏ ఓటీటీ? ఎప్పుడు రిలీజ్‌ అంటే?

Published : 25 May 2023 23:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కోలీవుడ్‌ ప్రముఖ హీరో విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) నటించిన తొలి హిందీ చిత్రం.. ‘ముంబైకర్‌’ (Mumbaikar). ఇప్పటికే విడుదలకావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్‌ కానుంది. ఈ చిత్రం జూన్‌ 2 నుంచి ‘జియో సినిమా’ (jio cinema)లో ఉచితంగా స్ట్రీమింగ్‌ కానుంది. సోషల్‌ మీడియా వేదికగా సదరు ఓటీటీ సంస్థ ఈ వివరాలు వెల్లడించింది. తెలుగులోనూ ఈ సినిమా సందడి చేయనుంది. ఈ ప్రకటనపై విజయ్‌ సేతుపతి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌ తెరకెక్కించిన ‘మానగరం’ (Maanagaram) సినిమాకి రీమేక్‌గా రూపొందింది ‘ముంబైకర్‌’. దీనికి ఛాయగ్రాహకుడు సంతోశ్‌ శివన్‌ దర్శకత్వం వహించారు. విక్రాంత్‌, సంజయ్‌ మిశ్రా, తాన్య, రణ్‌వీర్‌ షోరే తదితరులు కీలక పాత్రలు పోషించారు. శ్రీ, సందీప్‌ కిషన్‌, రెజీనా ప్రధాన పాత్రలు పోషించిన ‘మానగరం’.. బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే. వెబ్‌సిరీస్‌ ‘ఫర్జీ’తో బాలీవుడ్‌ ప్రేక్షకుల్ని అలరించిన విజయ్‌ సేతుపతి ప్రస్తుతం అక్కడ ‘మెరీ క్రిస్మస్‌’ చిత్రంలో నటిస్తున్నారు. శ్రీరామ్‌ రాఘవన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కత్రినా కైఫ్‌ కథానాయిక. మరోవైపు, షారుక్‌ఖాన్‌ హీరోగా అట్లీ తెరకెక్కిస్తున్న ‘జవాన్‌’లో విజయ్‌ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని