సంక్షిప్త వార్తలు (5)

Eenadu icon
By Cinema Desk Published : 28 Oct 2025 01:03 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
4 min read

‘12ఎ రైల్వే కాలనీ’లో..

అల్లరి నరేశ్‌ హీరోగా నాని కాసరగడ్డ తెరకెక్కించిన చిత్రం ‘12ఎ రైల్వే కాలనీ’. శ్రీనివాస చిట్టూరి నిర్మాత. కామాక్షి భాస్కర్ల కథానాయిక. సాయి కుమార్, వైవా హర్ష తదితరులు కీలక పాత్రలు పోషించారు. ‘పొలిమేర’ సిరీస్‌ చిత్రాలతో మెప్పించిన దర్శకుడు అనిల్‌ విశ్వనాథ్‌ దీనికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ అందిస్తూనే.. షోరన్నర్‌గా వ్యవహరించారు. ఈ సినిమా నవంబరు 21న థియేటర్లలోకి రానున్నట్లు సోమవారం ప్రకటించారు. ‘‘ఇదొక వినూత్నమైన థ్రిల్లర్‌ కథతో రూపొందిన సినిమా. దీంట్లో నరేశ్‌ విభిన్న కోణాలున్న పాత్రలో కనువిందు చేయనున్నారు’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి భీమ్స్‌ సిసిరోలియో సంగీతమందించారు. కుశేందర్‌ రమేశ్‌ రెడ్డి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు. 


చిన్ని గుండెలోన ఏడు రంగుల వాన 

‘‘వర్తమాన సమాజం ఎదుర్కొంటున్న ఒక ప్రధాన సమస్యని చర్చిస్తూ... ఇంటిల్లిపాదికీ వినోదం పంచుతుంది మా చిత్రం’’ అన్నారు మధుర శ్రీధర్‌ రెడ్డి. ఆయన, నిర్వి హరిప్రసాద్‌రెడ్డి  కలిసి నిర్మిస్తున్న చిత్రమే ‘సంతాన ప్రాప్తిరస్తు’. విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్నారు. సంజీవ్‌రెడ్డి దర్శకుడు. ఈ చిత్రం నవంబరు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.  ‘తెలుసా నీ కోసమే...’ అంటూ సాగే ఈ చిత్రంలోని పాటని సోమవారం హైదరాబాద్‌లో ప్రముఖ నిర్మాత డి.సురేశ్‌బాబు విడుదల చేశారు. గుండెలో చిన్నిగుండెలో ఏడు రంగుల వానా... అంటూ మొదలయ్యే ఈ పాటని శ్రీమణి రచించగా, అజయ్‌ అరసాడ స్వరాలు సమకూర్చారు. 


తెలుగులోకి ‘డియాస్‌ ఇరాయ్‌’ 

మోహన్‌లాల్‌ తనయుడు ప్రణవ్‌ హీరోగా రాహుల్‌ సదాశివన్‌ తెరకెక్కించిన చిత్రం ‘డియాస్‌ ఇరాయ్‌’. చక్రవర్తి రామచంద్ర, ఎస్‌ శశికాంత్‌ నిర్మించారు. సుస్మితా భట్, జిబిన్‌ గోపీనాథ్, మనోహరి జాయ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మిస్టరీ హారర్‌ థ్రిల్లర్‌గా ముస్తాబైన ఈ సినిమాని స్రవంతి మూవీస్‌ సంస్థ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ సోమవారం ప్రకటించింది. ‘‘ఇదొక విభిన్నమైన హారర్‌ థ్రిల్లర్‌. తెలుగులోనూ మంచి ఆదరణ దక్కించుకుంటుందని నమ్ముతున్నాం’’ అని చిత్ర నిర్మాతలు తెలిపారు. ఈ సినిమా ఈనెల 31న మలయాళం, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుండగా.. తెలుగు వెర్షన్‌ నవంబరు తొలి వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.   


ప్రేమ గెలవాలంటే త్యాగాలు తప్పవు 

దేవన్‌ హీరోగా నటిస్తూ.. స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘కృష్ణ లీల’. తిరిగొచ్చిన కాలం.. అనేది ఉపశీర్షిక. జి.జ్యోత్స్న నిర్మించిన ఈ సినిమాలో ధన్య బాలకృష్ణన్‌ కథానాయికగా నటించింది. ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో ఉన్న ఈ చిత్రం నవంబరు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం హైదరాబాద్‌లో ఈ చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ, నిర్మాత సురేశ్‌బాబు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్ర రచయిత అనిల్‌ కిరణ్‌ కుమార్‌ నాకు మంచి మిత్రుడు. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘ఈ సినిమాకి మంచి ఫలితం దక్కాలని కోరుకుంటున్నా’’ అన్నారు నిర్మాత సురేశ్‌బాబు. హీరో, దర్శకుడు దేవన్‌ మాట్లాడుతూ.. ‘‘ ప్రేమను గెలిపించడం కోసం ఎన్ని త్యాగాలైనా.. యుద్ధాలైనా చేస్తూనే ఉండాలనే పాయింట్‌ను దీంట్లో చూపించాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ధన్య బాలకృష్ణన్, అనిల్‌ కిరణ్, జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు. 


ఏది సరైనది? ఏది తప్పు? 

క్రైమ్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ‘వాధ్‌’ సినిమాకు సీక్వెల్‌గా ‘వాధ్‌ 2’ రూపొందుతోంది. సంజయ్‌ మిశ్రా, నీనా గుప్తా ప్రధానపాత్రల్లో నటించిన ఈ సినిమాకి జస్పాల్‌ సింగ్‌ సంధు దర్శకత్వం వహించారు. లవ్‌ రంజన్, అంకుర్‌ గార్గ్‌ సంయుక్తంగా నిర్మించారు. తాజాగా చిత్రబృందం ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానుందని ప్రకటించింది. ఈ సందర్భంగా ‘‘పోరాటం కొత్తది, కథ కొత్తది.. ఏది సరైనది? ఏది తప్పు? ఫిబ్రవరి 6న తెలుసుకోండి’’ అంటూ ఇన్‌స్టా వేదికగా మోషన్‌ పోస్టర్‌ని ఆవిష్కరించింది. ఈ సీక్వెల్‌ మొదటి చిత్రానికి భిన్నంగా కొత్త పాత్రలను ప్రవేశపెట్టి.. వారి సవాళ్లను అన్వేషిస్తూ ప్రేక్షకులకు థ్రిల్‌ని పంచేలా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు