ఓటీటీలో ఈ వారం

Eenadu icon
By Cinema Desk Published : 28 Oct 2025 01:07 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

చూస్తుండగానే కొత్త వారం రానే వచ్చింది. ప్రేక్షకులు కూడా ఈ వారమంతా ఆస్వాదించడానికి ఓటీటీలు ఎలాంటి కంటెంట్‌ తీసుకురాబోతున్నాయో అని ఉత్సాహంగా ఎదురుచూస్తుంటారు. అలాంటి సినీప్రేమికుల కోసమే ఈ వారం కూడా వైవిధ్యమైన చిత్రాలు, థ్రిల్‌ పంచే సిరీస్‌లతో వినోదాలు పంచడానికి సిద్ధంగా ఉన్నాయి ఓటీటీలు. 

ఆదాయం కోసం కాదు.. ఆస్వాదిస్తూ చేయాలి

‘‘జీవితంలో మనం చేసే పనిని ఆదాయం కోసం మాత్రమే కాదు. ఆస్వాదిస్తూ కూడా చేయాలి. వ్యాపారంలో దొరకని తృప్తి.. వ్యాపకంలో దొరుకుతుంది’’ అంటూ ‘ఇడ్లీ కొట్టు’ చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించారు హీరో ధనుష్‌. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. నిత్యామేనన్‌ కథానాయిక. గ్రామీణ నేపథ్యంలో రూపొంది థియేటర్లలో ప్రేక్షకుల్ని అలరించిన ఈ సినిమా ఇప్పుడు మీ ఇళ్లలో సందడి చేయడానికి ముస్తాబైంది. బుధవారం నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా రాబోతుందీ చిత్రం. ఇందులో ఇడ్లీ కొట్టు నడిపే సాధారణ వ్యక్తి పాత్రలో తన నటనతో మెప్పించారు ధనుష్‌. అరుణ్‌ విజయ్, షాలినీ పాండే, సత్యరాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.


లోక ప్రపంచానికి స్వాగతం

సూపర్‌ హీరో నేపథ్యంలో రూపొంది విమర్శకుల ప్రశంసలు అందుకుంది ‘లోక చాప్టర్‌ 1: చంద్ర’. మలయాళీ భామ కల్యాణి ప్రియదర్శన్, నస్లేన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ ఫాంటసీ థ్రిల్లర్‌కు డొమినిక్‌ అరుణ్‌ దర్శకత్వం వహించారు. దుల్కర్‌ సల్మాన్‌ నిర్మించిన ఈ సినిమా ఇటీవలే విడుదలై బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లని సొంతం చేసుకొని రికార్డు సృష్టించింది. ఇందులో కల్యాణి.. సూపర్‌ పవర్స్‌ ఉన్న చంద్ర పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. ఇప్పుడీ లేడీ సూపర్‌ హీరో చిత్రం శుక్రవారం జియోహాట్‌స్టార్‌ వేదికగా అలరించడానికి సిద్ధమైంది. మరి లోక ప్రపంచానికి స్వాగతం అంటున్న చంద్ర సాహసాలేంటో మీరూ చూసేయ్యండి.


శుక్రవారం... ‘కాంతార: చాప్టర్‌ 1’

‘‘ఎప్పుడు మనిషి అధర్మం వైపు వెళ్తాడో.. ధర్మాన్ని కాపాడటానికి ఆ ఈశ్వరుడు తన గణాన్ని పంపుతూనే ఉంటాడు..’’ అంటూ ఇటీవలే ‘కాంతార: చాప్టర్‌ 1’ సినిమాతో థియేటర్లలో అదరగొట్టారు కన్నడ హీరో రిషబ్‌ శెట్టి. ఆయన దర్వకత్వం వహించిన ఈ సినిమాలో రుక్మిణీ వసంత్, గుల్షన్‌ దేవయ్య, జయరామ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మట్టి పరిమళాలు అద్దుకున్న ఈ కథనంలో రిషబ్‌ తన నటనతో కట్టిపడేశారు. ఈశ్వరుడు పంపిన గణం కాంతార అంటూ థియేటర్లలో విజిల్స్‌ వేయించిన ఈ సినిమా ఇప్పుడు శుక్రవారం అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని