Hanu Man:ఈ ఏడాది ఆ ఘనత సాధించిన రెండో మూవీ ‘హనుమాన్‌’.. ఓటీటీకి వచ్చేది ఆరోజేనా?

Hanu Man OTT Release date: హనుమాన్‌ మూవీ ఓటీటీలో ఎప్పుడు వస్తుందా? అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Updated : 22 Feb 2024 17:06 IST

హైదరాబాద్‌: తేజ సజ్జా కీలక పాత్రలో ప్రశాంత్‌ వర్మ రూపొందించిన చిత్రం ‘హను-మాన్’ (Hanu Man). సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ తెలుగు ప్రేక్షకులతో పాటు, ఇతర భాషల వారినీ అలరించింది. ముఖ్యంగా నార్త్‌ ఆడియన్స్‌ కూడా ఈ కథకు బాగా కనెక్ట్‌ అయ్యారు. ఇప్పుడదే సరికొత్త రికార్డు సృష్టించేలా చేసింది. 2024లో బాలీవుడ్‌లో రూ.200 కోట్లు వసూలు చేసిన రెండో చిత్రంగా నిలిచింది. హృతిక్‌ రోషన్‌ నటించిన ‘ఫైటర్‌’ (Fighter) ఇప్పటికే రూ.350 కోట్లకు పైగా వసూలు చేయగా, రూ.200 కోట్ల వసూళ్లతో ‘హనుమాన్‌’ రెండో స్థానంలో నిలిచింది.

తెలుగు బాక్సాఫీస్‌ వద్ద బలమైన పోటీ ఉన్నా, కంటెంట్‌పై ఉన్న నమ్మకంతో మేకర్స్‌ సంక్రాంతి బరిలోనే ‘హనుమాన్‌’ను నిలిపారు. వారి అంచనాలను నిజం చేస్తూ చిన్న చిత్రంగా విడుదలై భారీ వసూళ్లను సాధించింది. అగ్ర కథానాయకుల సినిమాలు ఉన్నా, వాటి దీటుగా ప్రతి వారం స్క్రీన్‌లను పెంచుకుంటూ ప్రేక్షకులను అలరించింది. బాలీవుడ్‌ ప్రేక్షకులు కూడా ఈ మూవీని అక్కున చేర్చుకున్నారు. ఈ క్రమంలో కొన్ని రోజుల కిందట రూ.190 కోట్లు (గ్రాస్‌) వసూళ్ల వద్ద సినిమా నెమ్మదించినట్లు కనిపించింది. అయితే, అక్కడ కూడా పెద్ద చిత్రాలేవీ లేకపోవడంతో ‘హనుమాన్‌’కు కలిసొచ్చింది. ఈ క్రమంలో తాజాగా రూ.200.10కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్‌ వర్గాలు లెక్క కట్టాయి. ఫిబ్రవరి చివరి వరకూ ఇది కొనసాగితే మరిన్ని వసూళ్లు రాబట్టడం ఖాయం. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చిత్ర బృందం కీలక ప్రకటన చేసింది. మూవీ టికెట్‌ ధరను తగ్గించి ఎక్కువమంది ప్రేక్షకులను థియేటర్‌కు వైపు నడిపించేలా నిర్ణయం తీసుకుంది. సింగిల్‌ స్క్రీన్‌లలో రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.150కే ఈ మూవీ టికెట్లను విక్రయిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ‘హనుమాన్‌’ రూ.300కోట్లు (గ్రాస్‌)కు దగ్గరగా ఉన్నట్లు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. పూర్తి థియేట్రికల్‌ రన్‌ ముగిసే సమయానికి ఆ మార్కును దాటవచ్చని చెబుతున్నాయి.

ఓటీటీకి రెడీ అవుతోందా?

ఇటీవల కాలంలో అగ్ర కథానాయకుల సినిమాలే నెల రోజులు తిరిగే సరికి ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. సంక్రాంతికి వచ్చిన ‘గుంటూరు కారం’, ‘నా సామిరంగ’, చిత్రాలు ఇప్పటికే ఓటీటీలో సందడి చేస్తున్నాయి. బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయిన ‘హనుమాన్‌’ (Hanu Man OTT Release date) కోసం ఓటీటీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో జీ5 అందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మార్చి 2వ తేదీ నుంచి ‘హనుమాన్‌’ స్ట్రీమింగ్‌కు తీసుకొస్తారని టాక్‌. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని