Hanuman: ‘హను-మాన్‌’ విజయం ప్రేక్షకుల బహుమానం

‘‘నా చిన్నప్పుడు చూసిన వంద రోజుల సినిమా వేడుకలు బాగా గుర్తున్నాయి. కానీ దర్శకుడినయ్యాక సినిమాల ప్రదర్శనలు ఒక వారానికి పరిమితం అయ్యాయి.

Updated : 24 Apr 2024 12:00 IST

‘‘నా చిన్నప్పుడు చూసిన వంద రోజుల సినిమా వేడుకలు బాగా గుర్తున్నాయి. కానీ దర్శకుడినయ్యాక సినిమాల ప్రదర్శనలు ఒక వారానికి పరిమితం అయ్యాయి. ఇలాంటి సమయంలో కూడా ప్రేక్షకులు వంద రోజులుగా థియేటర్‌కి వచ్చి చూస్తున్నారంటే అదృష్టంగా భావిస్తున్నా. ఈ వంద రోజుల్లో రోజూ ఈ రోజే నా సినిమా విడుదలైందా అన్నట్టుగా ప్రేక్షకుల నుంచి అభినందనలు అందుతున్నాయి. కొనసాగింపుగా రూపొందుతున్న ‘జై హనుమాన్‌’ని మరింత గొప్ప అనుభూతిని పంచేలా రూపొందిస్తాం’’ అన్నారు ప్రశాంత్‌ వర్మ. ఆయన దర్శకత్వంలో, తేజ సజ్జా కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘హను-మాన్‌’ వంద రోజుల వేడుక మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. కె.నిరంజన్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదలై ఘన విజయం సాధించింది. వంద రోజుల వేడుక చిత్రబృందం సమక్షంలో జరిగింది. కథానాయకుడు తేజ సజ్జా మాట్లాడుతూ ‘‘ఈ విజయం మాకు ప్రేక్షకులు ఇచ్చిన బహుమానం. మనల్ని మనం నమ్ముకొని ముందుకు వెళితే చాలా దూరం వెళతామని నిరూపించారు మా దర్శకనిర్మాతలు. గట్స్‌ ఉన్నవాళ్లకే హిట్స్‌ అని ఎవరో చెప్పారు. అలాంటి ధైర్యం ఉన్న నిర్మాత నిరంజన్‌కి ఇది మొదటి సినిమా కావడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు. ప్రశాంత్‌ వర్మ మాట్లాడుతూ ‘‘రాబోయే ఇరవయ్యేళ్లూ ఈ కథలపైనే దృష్టిపెడుతున్నాం. రాబోయే సినిమాల్లోనూ సముద్రఖని విభీషణుడి పాత్రలో, తేజ హను మాన్‌గానే కనిపిస్తారు. వీళ్లతోపాటు మరెన్నో ఆశ్చర్యకరమైన పాత్రలు ఉన్నాయి. హిందీ తారలు మొదలుకొని మలయాళం వరకూ చాలామంది కథానాయకులు కనిపిస్తార’’న్నారు. నిర్మాత కె.నిరంజన్‌ రెడ్డి మాట్లాడుతూ ‘‘ఈ వేసవిలో త్రీడీలో ఈ సినిమాని విడుదల చేస్తున్నాం. మా నుంచి రాబోయే సినిమాలనీ ప్రేక్షకులు ఇదే స్థాయిలో ఆదరిస్తారని ఆశిస్తున్నాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సముద్రఖని, చైతన్య, గెటప్‌ శ్రీనుతోపాటు ఇతర చిత్రబృందం పాల్గొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు