Hanuman movie: హను-మాన్‌ 50 రోజులు.. 150 థియేటర్లు.. ఓటీటీ స్ట్రీమింగ్‌పై జీ5 ఏమన్నదంటే?

hanuman ott: హనుమాన్‌ 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓటీటీ విడుదలపై జీ5 స్పందించింది.

Published : 02 Mar 2024 00:47 IST

హైదరాబాద్‌: ‘హనుమాన్‌’.. ఈ ఏడాది తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ సంచలనం. చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం ఇప్పుడు 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇటీవల కాలంలో 150 థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకున్న చిత్రంగా రికార్డు సృష్టించింది. గత కొన్నేళ్లుగా చిత్ర పరిశ్రమలో 50, 100 రోజులన్న మాటే లేదు. చాలా సినిమాలు నెల రోజులు తిరిగేసరికి ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. దీంతో థియేట్రికల్‌ రన్‌ ముగిసిపోతోంది. అలాంటి సమయంలో మంచి కలెక్షన్లతో ‘హనుమాన్‌’ (Hanuman Movie) ఇప్పటికీ కొనసాగుతుండటం విశేషం. ఈసందర్భంగా దర్శకుడు ప్రశాంత్‌వర్మ ఆనందం వ్యక్తంచేస్తూ ట్వీట్ చేశారు. ‘‘నా జీవితంలో ఈ 50 రోజులు ఎంతో అద్భుతమైనవి. ఈ అనుభూతిని ఎలా చెప్పాలి? ఎక్కడినుంచి మొదలు పెట్టాలి? ఎవరికి కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. ఒక్క విషయం మాత్రం చెప్పగలను. మంచి సినిమాపై ప్రేక్షకుడు చూపే అభిమానం ఎంతటి కష్టాన్ని అయినా మరిపిస్తుంది. ‘హనుమాన్‌’ అద్భుత విజయంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అని ట్వీట్ చేశారు.

ఓటీటీలో ఎప్పుడు? జీ5 ఏమన్నదంటే?

‘హనుమాన్‌’ 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా? (hanuman ott release date) అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మార్చి 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ అవుతుందని తొలుత ప్రచారం జరిగింది. కానీ, ఆ సూచనలేవీ కనిపించడం లేదు.  ఇప్పుడు మహాశివరాత్రి కానుకగా మార్చి 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌కు తీసుకురావాలని ఓటీటీ వేదిక జీ5 (ZEE5) భావిస్తున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సిఉంది. ఇదే విషయాన్ని పలువురు నెటిజన్లు ఎక్స్‌ వేదికగా జీ5ని (hanuman ott platform) ట్యాగ్‌ చేస్తూ ప్రశ్నించారు. ఆ ట్వీట్‌లకు జీ5 సోషల్‌మీడియా టీమ్‌ సమాధానమిస్తూ, ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, మరిన్ని అప్‌డేట్స్‌కు తమ సోషల్‌మీడియా ఖాతాలను అనుసరించాలని తెలిపింది. తేజ సజ్జా (Teja sajja) కీలక పాత్రలో నటించిన ఈ మూవీలో వరలక్ష్మీ శరత్‌కుమార్‌ (Varalaxmi Sarathkumar), అమృత అయ్యర్‌, సముద్రఖని, వినయ్‌రాయ్‌, వెన్నెల కిషోర్‌, గెటప్‌ శ్రీను తదితరులు నటించారు. రూ.40 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం ఇప్పటివరకూ రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని