Harish Shankar: ‘చోటా కె గారు.. మీ గౌరవాన్ని కాపాడుకోండి’.. కాదు.. కూడదంటే I AM Waiting: హరీశ్

తన గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కెమెరామెన్‌ చోటా కె నాయుడిని ఉద్దేశిస్తూ దర్శకుడు హరీశ్‌ శంకర్‌ లేఖ విడుదల చేశారు.

Published : 21 Apr 2024 00:07 IST

హైదరాబాద్‌: సీనియర్‌ కెమెరామెన్‌ చోటా కె నాయుడితో పని చేసిన అనుభవం తనని బాధ పెట్టినా, ఆయనకున్న అనుభవంతో కొన్ని విషయాలను నేర్చుకున్నానని, అందుకే ఆయనంటే తనకు గౌరవమని, దాన్ని చోటా (ChotaKNaidu) నిలబెట్టుకోవాలని దర్శకుడు హరీశ్‌ శంకర్‌ (Harish Shankar) సూచించారు. తాము పనిచేసిన సినిమాలకు ఎదురైన అనుభవాలను నటీనటులు, సాంకేతిక నిపుణులు ఏదోఒక ఇంటర్వ్యూలో పంచుకుంటూనే ఉంటారు. తాజాగా కెమెరామెన్‌ చోటా కె నాయుడు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హరీశ్‌ శంకర్‌ గురించి ప్రస్తావించారు. దీంతో హరీశ్‌ ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా స్వీట్‌ వార్నింగ్‌ ఇస్తూ లేఖ రాశారు.

‘‘గౌరవనీయులైన చోటా కె నాయుడు గారికి నమస్కరిస్తూ... ‘రామయ్యా.. వస్తావయ్యా’ సినిమా వచ్చి దాదాపు దశాబ్దం దాటింది. ఈ పదేళ్లలో ఉదాహరణకి మీరు 10 ఇంటర్వ్యూలు ఇస్తే, నేను ఒక 100 ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటా. కానీ, ఎప్పుడూ ఎక్కడా మీ గురించి నేను తప్పుగా మాట్లాడలేదు. మీరు మాత్రం పలుమార్లు నా గురించి అవమానకరంగా మాట్లాడారు. మీకు గుర్తుందో, లేదో ఓ సందర్భంలో మిమ్మల్ని తీసేసి వేరే కెమెరామెన్‌తో షూటింగ్‌ చేద్దామన్న ప్రస్తావన వచ్చింది. కానీ, రాజుగారు చెప్పడం మూలంగానో ‘గబ్బర్ సింగ్‌ వచ్చాక పొగరుతో పెద్ద కెమెరామెన్‌ని తీసేస్తున్నాడు’ అని పదిమంది పలు రకాలుగా మాట్లాడుకుంటారని మధనపడుతూనే మీతో సినిమా పూర్తి చేశా. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకున్నా ఏ రోజు ఆ నింద మీ మీద మోపలేదు. ఎందుకంటే ‘గబ్బర్ సింగ్’ వచ్చినప్పుడు నాది.. ‘రామయ్యా.. వస్తావయ్యా’ వస్తే అది నీది... అనే క్యారెక్టర్ కాదు నాది. మీరు మాత్రం ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడగకపోయినా, నా ప్రస్తావన రాకున్నా, నాకు సంబంధం లేకున్నా, నా గురించి అవమానకరంగా మాట్లాడుతున్నారు. ఇలా చాలాసార్లు జరిగినా నేను మౌనంగానే బాధపడ్డా. కానీ, నా స్నేహితులు అవ్వచ్చు లేదా నన్ను అభిమానించే వాళ్ళు అవ్వచ్చు నా ఆత్మ అభిమానాన్ని ప్రశ్నిస్తుండడంతో ఈ మాత్రం రాయాల్సివస్తోంది.  మీతో పని చేసిన అనుభవం నన్ను బాధ పెట్టినా, మీకున్న అనుభవంతో మీనుంచి నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను. అందుకే మీరంటే ఇంకా నాకు గౌరవం ఉంది. దయచేసి ఆ గౌరవాన్ని కాపాడుకోండి. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. కాదు.. కూడదు.. మళ్లీ కెలుక్కుంటాను అని అంటే Any day.. Any Platform.. I AM Waiting... - భవదీయుడు హరీశ్‌ శంకర్‌’’ అని తన ఎక్స్‌ (ట్విటర్‌) ఖాతాలో లేఖను పోస్ట్‌ చేశారు.

ఇంతకీ చోటా కె నాయుడు ఏమన్నారంటే..

‘‘హరీశ్‌ శంకర్‌తో రామయ్యా.. వస్తావయ్యా చేశా. తన టేకింగ్‌ స్టైల్‌లో తాను ఉండేవాడు. అస్తమానం అడ్డుపడుతుండేవాడు. చెప్పటానికి చాలాసార్లు ప్రయత్నించా. కానీ, తను వినే మూడ్‌లో ఉండేవాడు కాదు. దీంతో వదిలేశా. తనకి ఎలా కావాలో అలా చేశా. వీలైనంతవరకూ చెప్పే ప్రయత్నం చేస్తా. వింటే సరి, వినకపోతే వాళ్లకు ఏది కావాలో అది అందులోనూ ది బెస్ట్‌ ప్రయత్నిస్తా. నేను చెప్పింది ఎవరైనా వినకపోతే ఒకే ఒక్క నిమిషం కోపం ఉంటుంది. ఆ తర్వాత మామూలైపోతా. దర్శకులకు ఏవో ఆలోచనలు ఉంటాయి కదా!  వాళ్ల స్క్రిప్ట్‌ కరెక్ట్‌ అయి ఉండవచ్చు’’ అంటూ చోటా కె నాయుడు అనడంతో హరీశ్‌ కౌంటర్‌ ఇవ్వాల్సి వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని