Harom Hara Movie: మతిపోగొట్టేలా ముగింపు!

‘‘విభిన్నమైన న్యూఏజ్‌ కమర్షియల్‌ సినిమా ‘హరోం హర’. ఈ కథ మట్టివాసనతో సహజత్వం నింపుకొని ఉంటుంది. కచ్చితంగా ఇది మాస్‌ సంభవం అవుతుంది’’ అన్నారు దర్శకుడు జ్ఞానసాగర్‌ ద్వారక.

Published : 12 Jun 2024 01:44 IST

‘‘విభిన్నమైన న్యూఏజ్‌ కమర్షియల్‌ సినిమా ‘హరోం హర’. ఈ కథ మట్టివాసనతో సహజత్వం నింపుకొని ఉంటుంది. కచ్చితంగా ఇది మాస్‌ సంభవం అవుతుంది’’ అన్నారు దర్శకుడు జ్ఞానసాగర్‌ ద్వారక. ఆయన దర్శకత్వంలో సుధీర్‌బాబు హీరోగా నటించిన చిత్రమే ‘హరోం హర’. సుమంత్‌ జి.నాయుడు నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు జ్ఞానసాగర్‌. 

  • ‘‘నా తొలి చిత్రం ‘సెహరి’ చూసి హీరో సుధీర్‌బాబు సతీమణి ఆయనకు నా గురించి చెప్పారట. కథ వినిపించగానే తొలి సిట్టింగ్‌లోనే సినిమా చేద్దామని చెప్పేశారు. అలా ఈ చిత్రం పట్టాలెక్కింది’’. 
  • ‘‘సుధీర్‌బాబు ఇందులో సుబ్రహ్మణ్యం అనే పాత్రలో కనిపిస్తారు. కుప్పంలో ల్యాబ్‌ అసిస్టెంట్‌గా పని చేసే అతను.. తుపాకులు తయారు చేయడం మొదలు పెట్టి పవర్‌ఫుల్‌ సుబ్రహ్మణ్యగా ఎలా ఎదిగాడన్నది ఆసక్తికరంగా ఉంటుంది. ఈ కథలో ఆధ్యాత్మిక కోణం కూడా కనిపిస్తుంది’’. 
  • ‘‘కుప్పం.. తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లో ఉంటుంది. అక్కడ మిక్స్డ్‌ కల్చర్‌ ఉంటుంది. అలాగే ఆ ప్రాంతంలో సుబ్రహ్మణ్య స్వామిని బాగా కొలుస్తారు. వీటన్నింటినీ ఈ చిత్రంలో కొత్తగా చూపించనున్నాం. దీంట్లో మాస్‌ అంశాలు, ఎలివేషన్లు అన్నీ ఉంటాయి. అలాగే ఇది చాలా సహజత్వంతోనూ నిండి ఉంటుంది’’.
  • ‘‘ఈ చిత్రంలో సుధీర్‌బాబు అద్భుతంగా నటించారు. ఆయనలో ఒక స్వాగ్‌ ఉంటుంది. అది ఈ చిత్రంలో చక్కగా బయటకొచ్చింది. దీంట్లో కుప్పం యాసలో ఆయన పలికే సంభాషణలు అందర్నీ ఆకట్టుకుంటాయి. ఇక క్లైమాక్స్‌ అయితే మతి పోయేలా ఉంటుంది. ఇది తప్పకుండా సుధీర్‌ నుంచి ఊహించని సినిమా అవుతుందనే నమ్మకం ఉంది’’. 
  • ‘‘నాకు యాక్షన్‌ కథలంటే చాలా ఇష్టం. కాకపోతే తొలి ప్రయత్నంలోనే ఇంత భారీ క్యాన్వాస్‌ ఉన్న కథను చెప్పలేం. అందుకే నా కథను పక్కకు పెట్టి మరొకరిచ్చిన ప్రేమకథతో ‘సెహరి’ చేశాం. నిజానికి అది నా జానర్‌ సినిమా కాదు. కానీ, దాని ద్వారానే నాకీ అవకాశం వచ్చిందనుకోవచ్చు. ఇకపైనా నాదైన యాక్షన్‌ కథలతోనే ప్రేక్షకుల్ని అలరించే ప్రయత్నం చేస్తా. నా తదుపరి చిత్రం కూడా ఇదే బ్యానర్‌లో చేయనున్నా. ఆ ప్రాజెక్ట్‌ వివరాల్ని  ప్రకటిస్తా’’.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని