Animal: అసలు రన్‌ టైమ్‌ 3 గంటల 21నిమిషాలు కాదు.. తెలిస్తే షాకే!

Animal: ‘యానిమల్‌’ మూవీ గురించి చిత్ర బృందం ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది.

Updated : 28 Nov 2023 13:23 IST

హైదరాబాద్‌: ట్రైలర్‌తోనే అంచనాలను పెంచేసిన చిత్రం ‘యానిమల్‌’ (Animal). రణ్‌బీర్‌కపూర్‌ కథానాయకుడిగా సందీప్‌ వంగా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా డిసెంబరు 1న థియేటర్స్‌లోకి రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా రన్‌టైమ్‌ చూసి సినీ ప్రేక్షకులంతా ఆశ్చర్యపోతున్నారు. 3 గంటల 21 నిమిషాల నిడివి కలిగిన ఈ సినిమాకు సెన్సార్‌ బోర్డు ఏ సర్టిఫికెట్‌ ఇచ్చింది. దర్శకుడు సందీప్‌ వంగా ఫస్ట్‌ కట్‌ పూర్తయ్యే సమయానికి ‘యానిమల్‌’ రన్‌టైమ్‌ ఏకంగా 3 గంటల 49 నిమిషాలుగా ఉందట. ఇంత రన్‌టైమ్‌ ఉంటే ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్స్‌లో ప్రదర్శించడం చాలా కష్టం. కచ్చితంగా రెండు ఇంటర్వెల్స్‌ ఇవ్వాల్సిందే. అయినా కూడా అంతసేపు థియేటర్‌లో మూవీ చూడటం అందరికీ ఇష్టం ఉండదు. పైగా నాలుగు షోలు వేయాలంటేనే థియేటర్స్‌ కూడా కష్టమే. ఈ క్రమంలో అతి కష్టమ్మీద 3 గంటలా 21 నిమిషాలకు కుదించారు. తాజా ప్రమోషన్స్‌లో భాగంగా రణ్‌బీర్‌ కపూర్‌ స్వయంగా వెల్లడించాడు.

ఓటీటీలో ఫుల్‌ మూవీ వచ్చేనా?

ప్రస్తుతం దర్శకుల పూర్తి విజన్‌కు ఓటీటీలు న్యాయం చేస్తున్నాయి. నిడివి కారణంగా తాము చెప్పాలనుకున్న చాలా విషయాలను దర్శకులు తెరపై చూపించలేకపోతున్నారు. అంతేకాదు, కొన్నిసార్లు మంచి సన్నివేశాలను కూడా తొలగించాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఓటీటీలు కొన్ని సినిమాలను పూర్తి వెర్షన్‌ స్ట్రీమింగ్‌కు తీసుకొస్తున్నాయి. అలాగే ‘యానిమల్‌’ కూడా డైరెక్టర్‌ అన్‌కట్‌ వెర్షన్‌ భావిస్తున్నారు. అలా వస్తే, సినీ ప్రియుల ఆనందం మరింత రెట్టింపు అవుతుంది. యానిమల్‌ థియేటర్స్‌లో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలో వచ్చే అవకాశం ఉంది.

ఇంటర్వెల్‌ బ్లాక్‌ అదిరిపోతుందా?

‘యానిమల్‌’ గురించి మరో ఆసక్తికర వార్త కూడా ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. తాజాగా చెన్నైలో జరిగిన ప్రమోషన్స్‌లో చిత్ర బృందం ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ సినిమాలో ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ ఏకంగా 18 నిమిషాల పాటు సాగుతుందట. ఇటీవల కాలంలో ఇంత నిడివితో వచ్చే ఇంటర్వెల్‌ బ్లాక్‌ మరొక సినిమాలో లేదని టాక్‌. ఇప్పటికే ట్రైలర్‌ చూపిన మెషీన్‌గన్‌ సన్నివేశం కూడా అందులో భాగమేనని అంటున్నారు. దీనిపై స్పష్టత రావాలంటే సినిమా వచ్చే దాకా వేచి చూడాల్సిందే..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని